వేమన శతకమ (పద్యానికి కథ )- పోర్ల వేణుగోపాలరావు. టీచర్, ఎల్లారెడ్డి పేట

 గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవడైననేమి ఖరము పాలు
భక్తి కలుగ కూడు పట్టెడైననుచాలు,
విశ్వదాభిరామ వినురవేమ.
అర్థము:
మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు. గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు.
రకరకాల ఆహార పదార్ధాలతో వండిన విందు భోజనం కంటే సాత్వికమైనది, దేవుని పై భక్తి కలిగించేది/ప్రేమతో వడ్డించినది  అయినది కొంచెం అన్నం పెట్టినా  చాలు.
అని వేమన భావం.
కథ: నిజమైన నైవేద్యం
పూర్వం రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అదే గ్రామంలో గోపయ్య అనే రైతు కూడా పొలం పనిచేస్తూ ఉండేవాడు. దాదాపు సమ వయస్కులైనా ఇరువురికీ అంతస్థులోను, స్వభావాలలోనూ చాలా తేడా. రంగయ్య స్వార్థపరుడు, పిసినారి. ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలనివాడని, పిల్లికి కూడా బిచ్చం పెట్టనివాడని ఆ గ్రామంలో అందరూ అనుకుంటూ ఉండేవారు. అలా ఉంటేనే వ్యాపారం జరుగుతుందని, తాను ధనవంతుడిని కాగలిగానని రంగయ్య సిద్ధాంతం.గోపయ్య మాత్రం భూమాతను నమ్ముకొని కష్టించి బ్రతుకుతూ ఉండేవాడు.ఆ శివయ్యే తనకు తోడు అనుకుని.. దేవాలయంలో రోజూ అభిషేకం చేసి, ఒక పండు నైవేద్యంగా సమర్పించేవాడు.
ఇలా కొన్నిరోజుల గడిచాక ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. ఊరిబయట శివాలయంలో బసచేసిన ఆయనను చూడడానికి జనం తండోపతండాలుగా ప్రతిరోజూ వెళ్ళసాగారు. ఆయనకు ఏవో మహిమలు ఉన్నాయని, కష్టాలను ఇట్టే తొలగిస్తాడని కూడా వార్తలు వెలువడసాగాయి. 
ఒకరోజు ఈ వార్త విన్న రంగయ్య కూడా ఆ దేవాలయ సమీపంలో ఏర్పరచిన స్వామివారి ఆశ్రమమునకు వెళ్ళి స్వామీజీని ఏకాంతంగా కలిశాడు. ఆ ప్రాంతంలోకెల్లా ఏకైక కోటీశ్వరుని కావాలనే  తనమనసులోని కోరికను చెప్పుకున్నాడు. 
దానికి స్వామీజీ చిన్నగా నవ్వుతూ..ఈరోజు సాయంత్రం నా ప్రవచనం విందువు గాని.. అని పంపించాడు
ఆరోజు సాయంత్రం స్వామీజీ ప్రవచనాలను చెబుతూ చివర్లో భక్తులైన  గ్రామప్రజలతో ఇలా అన్నారు.. ఈ దేవాలయంలో ఒక నలభై రోజులు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మీరు భక్తితో స్వామిని పూజించండి .. మీమీ కోరికలు సిద్ధించవచ్చు అని అన్నాడు. 
ఆరోజు నుండి రంగయ్య ప్రవర్తనలో చాలా తేడా కనిపించసాగింది. కొబ్బరికాయలు, పండ్లు, ఫలహారాలు, ప్రత్యేక నైవేద్యాలు, ఎన్నెన్నో.. స్వామివారికి నివేదన చేయసాగాడు. మనసులో కొన్నివేల కోరికలు.. గోపయ్య ఎప్పటి లాగానే..తన శక్త్యానుసారం ఒక పండును తీసుకుని వెళ్ళాడు.. గోపయ్య చేతిలోని పండును చూసి రంగయ్య హేళనగా నవ్వుతూ తన పండ్ల గంపను చూపించాడు.. గోపయ్య మౌనంగా తన పండును స్వామివారికి సమర్పించి వెళ్ళిపోయాడు. 
నలభై రోజులు గడిచాయో లేదో.. ఊరంతా ఒకటే హడావిడి.. గోపయ్య పొలంలో పూర్వీకులు దాచిన లంకెబిందెలు బయటపడ్డాయి.. ఇంటిపేర్లు.. వివరాలతో సహా..వ్రాయబడిన తాళపత్రాలతో
ఆ వార్త విన్న రంగయ్య కుప్పకూలిపోయాడు..
* * * *
(కైలాసంలో)
పార్వతి.. తన భర్తతో.. "స్వామీ.. ఎంతో ఆర్భాటంగా చేసిన రంగయ్యకు ప్రతిఫలం దక్కలేదు. రోజుకో పండును మాత్రమే ఇచ్చే గోపయ్యను అనుగ్రహించారు. ఇందులో మర్మం చెప్పండి"'
దానికి శివుడు నవ్వి.. "దేవీ..నీకు తెలియనిదా! నాచేత చెప్పిస్తున్నావు. రంగయ్య పూజలో స్వార్థం దాగివుంది. గోపయ్య ఏమీ ఆశించని నిస్వార్ధ భక్తుడు.. అందుకే అతన్ని అనుగ్రహించాను.. అతడు నిస్వార్థంగాఇచ్చిన ఒక్క పండు తింటే చాలు.. నా కడుపు నిండిపోతుంది"  అని అన్నాడు..
పార్వతి ఆనందంగా తలూపింది. 
నీతి: భక్తిశ్రద్ధలతో చేసినది చిన్న పని అయినా గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది
***********


కామెంట్‌లు