అనంతం నుండీ అవనిపైకి
ఆదిత్యుని అనుగ్రహపాతం
అందరూ అనుభవించగలిగే
అజరామర అద్భుతం
అందమైన భువనం అంతా
అలముకునే వెలుగుల పుంత
అడవికి కూడా పండుగ తెచ్చే
అపురూప ఆశీర్వాదం
ఆకాంక్షించే శుభాలను
ఆదరించే భావనతో
అక్కున చేర్చుకుని
అందించే అప్యాయత
గగన వీధుల సాగే
అపరంజి వెలుగుల తేరు
విరజిమ్మిన కాంతిపుంజాల
వరముల శరములై తాకగా
శాపాలు పాపాలు కడిగే
సురగంగ ధారలా కురిసి
నరులకు సుగతిని కూర్చి
పరులు తామే అనే భావన నేర్పి
నీవూ...నేన న్న మాట వీడి
మనమంతా ఒకటనే పాఠం చెప్పి
అందరిలో ఒకరై మసిలే
అందమైన బంధాల అల్లికలో కలిపి
బుద్భుదప్రాయమైన మనుగడ
సుహృద్భావ పూరితమై
సుసంపన్నం చేసుకోమని
దిశానిర్దేశం చేయడానికి
అనుదినం అలుపులేక
అనుక్షణం ఏమారక
అనునయంగా చేరదీసి
అనుగ్రహించే ఆప్తమిత్రునికి
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి