సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -370
అంధ గజ న్యాయము
*****
అంధ అంటే గుడ్డియగు, చీకటి, నీరు.గజ అనగా ఏనుగు , ఎనిమిది సంఖ్య, పొడవును తెలుపు కొలత.
"అంధ గజ న్యాయము" అంటే గుడ్డితనం గల  వ్యక్తులు ఏనుగు ఎలా వుంటుందో కనిపెట్టడం."
 అనగా అనగా కొందరు గుడ్డివాళ్ళకు ఏనుగు ఎలా వుంటుందో తమంత తాముగా తెలుసుకోవాలని అనిపించింది.వెంటనే నలుగురైదుగురు ఏనుగు వున్న ప్రదేశానికి వెళ్ళారు.అందులోని ఓ అంధుడు ముందుగా ఏనుగు తొండాన్ని పట్టుకుని తడిమి చూశాడు. వెనక్కి వచ్చి ఏనుగు పాములా వుందని చెప్పాడు.
మరో వ్యక్తి వెళ్ళాడు.తనకు ఏనుగు కాలు తగలడంతో దానిని పై నుంచి కిందకి తడిమి చూశాడు.ఏనుగు స్తంభములా వుందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
మూడో అంధుడికి ఏనుగు చెవి దొరికింది. దానిని  తడిమి చూశాడు. ఏనుగు అచ్చంగా చేటవలె వుందని చెప్పాడు.
నాల్గవ అంధుడు చేతులతో తడిమి నప్పుడు ఏనుగు పొట్ట భాగం అందింది.దానినంతా తడిమి ఏనుగు గోడలా వుందన్నాడు.
ఐదవ అంధుడి చేతికి ఏనుగు తోక అందింది.దానితో అతడు ఏనుగు ఓ కర్రలా,పుల్లలా వుందని చెప్పాడు.
ఇలా ఒక్కొక్కరూ ఏనుగు యొక్క ఒక్కో భాగాన్ని మాత్రమే తడిమి  తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.అంతటితో ఆగితే బాగుండేది కానీ అలా  కాకుండా తమదే  నిజమని, ఏనుగు అలాగే వుంటుందని వాదించుకోసాగారు.
మరి వాళ్ళంతా చెప్పింది నిజం కాదనీ,వాళ్ళ అంధత్వం వల్ల ఏనుగు యొక్క అసలు స్వరూపం తెలుసుకోలేక పోయారని మనకు అర్థం అవుతోంది.
అది అందరికీ తెలిసిందే కదా! ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది‌?పాపం వాళ్ళను కించపరచడం కాకపోతే... చదవుతుంటే  ఈపాటికి మనందరి మనసులో  వారి పట్ల ఓ సానుభూతో,సహానుభూతో కలగక మానదు.
అయితే దీనిని మన పెద్దలు ఎందుకు ఓ న్యాయంగా సృష్టించారు.అందులో అంతరార్థం ఏమిటి?అనేది ఒక్కసారి ఆలోచిద్దాం.
మన చుట్టు పక్కల కొందరు పరమ మూర్ఖులు, అజ్ఞానులు వుంటారు. వాళ్ళకు అసలు సత్యాన్ని, నిజాన్ని ఎంత చెప్పినా  ఒక పట్టాన అర్థం చేసుకోరు.అంటే 'చెబితే వినరు వంట బుట్టదు' అన్నమాట.
అలా తమ మూర్ఖత్వం, అజ్ఞానంతో భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ వుండటమే కాకుండా తమదైన అజ్ఞానాన్ని అంతటా వ్యాపింప జేస్తూ చుట్టూ ఉన్న వారిని కూడా మూర్ఖులుగా తయారు చేస్తారు.
అలాంటి అజ్ఞానం, మూర్ఖత్వంలో మునిగి పోవద్దని చెప్పడానికే ఈ "అంధ గజ న్యాయము" లోని అసలైన అంతరార్థం.
ఇక్కడ కళ్ళు లేకపోవడం కాదు సమస్య.కళ్ళుండీ మూర్ఖంగా ప్రవర్తించే వారు,వాదించే వారు ఉంటారు కదా!వారిదే పెద్ద సమస్య.
కాబట్టి మనమలా వుండకూడదని ఈ న్యాయం ద్వారా గ్రహిద్దాం.వివేకం విచక్షణతో మసలుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు