సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -366
క్షీర పాషాణ న్యాయము
******
క్షీరము అంటే పాలు. పాషాణము అంటే పెద్ద రాయి లేదా బండ.
పాల కొఱకు ఱాయిని మోసినట్లు అని అర్థము.
 దీనికి దగ్గరగా ఓ ఆసక్తికరమైన సామెత తెలుగులో వుంది. అదే "కాలి  కోసం కాలి చెప్పును ఒడిలో పెట్టుకోవడమన్నట్లు ". 
 ఒకోసారి కాలికి చెప్పు తొడుక్కోవాలంటే   చెప్పును ఒడిలో పెట్టుకొని తొడుక్కోవలసి వస్తుంది.
అలాగే పాల కొఱకు  రాయిని మోయడం కూడా ... ఎందుకలా  మోయాల్సి వస్తుంది? అలా ఎవరు మోస్తారో? అనేది కొంచెం మెదడుకు పదును పెడితే  తప్ప  గుర్తుకు రాదు.
 ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల యంత్రాలను ఉపయోగించి పనులను అవలీలగా చేసుకోగలుగుతున్నాం.
 కానీ ఒకప్పుడు అలా లేదు.ఎటైనా వెళ్ళాలంటే ఎడ్లబండ్లలో వెళ్ళే వారు. ఏవైనా మోసుకొని పోవాలంటే కావడులను ఉపయోగించే వారు.
అలా పూర్వ కాలంలో పాలను అమ్మేవారు పాలను కుండల్లోనో, బిందెల్లోనో పోసుకుని  వాటిని కావడిలో  పెట్టుకుని  మోసుకుంటూ పోయే వారు.
అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బిందె లేదా కుండకు సరిపడ మాత్రమే ఉన్నప్పుడు కావడి బరువంతా ఒక వైపున ఉండటం వల్ల తీసుకుని పోవడం చాలా కష్టంగా వుండేది.
 అందువల్ల ఆ కావడి వాడు రెండో వైపు పాల కుండ లేదా బిందెకు బదులుగా దాని బరువుకి సరిపడే ఱాయిని  పెట్టుకునే వాడు. అప్పుడే తూకం రెండు వైపులా సరిపోయి మోసుకుని పోవుటకు వీలుగా వుండేది.
అలా చూసే వారికి ఇది వింతగా,ఆ వ్యక్తికి ఏమైనా పిచ్చా అనిపించినప్పటికీ, బాగా ఆలోచిస్తే ఆ పాలను మోసే లేదా అమ్మే వ్యక్తికి అది తప్పనిసరని తెలుస్తుంది.
 ఇదే అర్థం స్పరించేలా ఉన్న భాగవతానికి సంబంధించిన ఓ కథను చూద్దామా... "వసుదేవుడంతటి  వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు" అంటుంటారు.
అదేమిటో రేఖా మాత్రంగా చూద్దామా...
కంసుడు దేవికి దేవి అష్టమ గర్భంలో జన్మించే శిశువు వలన తనకు ప్రాణ గండం వుందని అశరీరవాణి చెప్పడంతో... అప్పటి నుండి స్వంత సోదరి, బావ అని కూడా చూడకుండా   దేవకీ ,వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు.
అష్టమ సంతానంగా జన్మించిన శ్రీకృష్ణుడిని కంసుని బారి నుంచి తప్పించడానికి తల్లి దేవకి నుండి వేరు చేసి, కాపలా వారి కన్నుగప్పి బుజ్జి కృష్ణుని తట్టలో పెట్టుకుని తీసుకుని పోతూ వున్నాడు. అది చూసి ఓ గాడిద ఓండ్ర పెట్టిందని, దాని అరుపులకు కాపలా వాళ్ళు నిద్ర లేస్తిరేమోననే భయంతో  అరవొద్దని బతిమిలాడుతూ దాని కాళ్ళు పట్టుకున్నాడట వసుదేవుడు.అలా అవసరం గట్టెక్కడానికి దాని కాళ్ళు పెట్టుకున్నాడని ఈ సామెతను వాడుతుంటారు.
అలాగే పాల బిందెలు రెండు వైపులా ఉంటే తూకం  సరిపోతుంది.రాయి అవసరమే లేదు.కానీ ఉన్నది ఒకటే బిందె. మోసేది కావడి.అందుకే రాయిని కూడా మోయాల్సి వచ్చింది.
 ఇలా ఒకోసారి అవసరార్థం కొన్ని అనవసరమైన పనులు కూడా చేయవలసి వస్తుందని ఈ "క్షీర పాషాణ న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
 మరి మనం మాత్రం అలా అనవసరమైన వాటిని మోయకుండా మరింకేమైనా అవసరమయ్యేవే తీసుకుని వెళ్దాం.అలా రెండు రకాలుగా పని జరుగుతుంది.అంతే కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
==================================================
ఆత్మీయులైన మీ అందరికీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాలెన్నో కలుగజేయాలని కోరుకుంటూ... మీ వురిమళ్ల ( భోగోజు) సునందా ఉపేందర్,ఖమ్మం

కామెంట్‌లు