సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -404
ఆదిత్య గతి న్యాయము
****
ఆదిత్యుడు అంటే సూర్యుడు,అదితి పుత్రుడు,దేవత/ దేవుడు .గతి అనగా కదలిక, గమనము, ప్రవేశము, అవకాశము,చర్య,చీరుట, భాగ్యము, పరిస్థితి,దశ, మార్గము, ఆశ్రయము,వెడలుట, యాత్ర, సంఘటన,నక్షత్ర మార్గము,గ్రహ గమనము, జ్ఞానము, పునర్జన్మ,జీవన దశ మొదలైన అర్థాలు ఉన్నాయి.
ఆకాశం మీద సూర్యుడు కదులుతున్నట్లు అనిపించడు కానీ సమయం గడుస్తున్నా కొద్దీ ఒక్కో సమయానికి ఒక్కో చోట కనిపిస్తాడు. అది ఎలాగని తదేక దృష్టితో ఆకాశంలోకి చూస్తూ ఉన్నా ఆ మార్పు మనకు  వెంటనే దృగ్గోచరం కాదు.
పొద్దు పొద్దున్నే  తన లేలేత కిరణాలతో  'తెల్లారింది లేవండో' అని  మనల్ని ,ప్రపంచాన్ని  తట్టి లేపే అందరి బంధువు సూర్యుడు. ఇంకాస్త బద్దకిస్తే సురసురమనే కిరణాలతో చురుక్కు మనిపించేది ఆయనే. ప్రాణికోటికి జవ జీవాలను  అందించే సూర్యుడిని ఎన్నో మతాల వారు కనిపించే దేవునిగా కొలుస్తారు.
 నిజంగా  ఆకాశం మీద సూర్యుడు కదులుతున్నాడా? అందుకే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో  ఒక్కో చోట కనిపించడం వాస్తవమేనా? ఈ ప్రశ్నలకు సామాన్యంగా ఎవరైనా అదికూడా తెలియదా? అని మనకే ఎదురు ప్రశ్న వేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అయితే సమాధానం తప్పైతే కాదు కానీ మనం ఏదైనా  విషయాన్ని నిజంగా నిజమా కాదా ? అనేది తెలుసుకుంటే బాగుంటుంది కదా!.
మరింకెందుకు ఆలస్యం ? ఆ విషయాలు ,విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
ఖగోళ శాస్త్రం ప్రకారం సౌర వ్యవస్థ మధ్యలో ఉన్న నక్షత్రం సూర్యుడు.
ఈ సూర్యుడు ప్రతిరోజూ  తూర్పున ఉదయిస్తాడు.ఆకాశంలో అలా అలా ప్రయాణం చేసి పశ్చిమాన అస్తమిస్తాడని మనందరి నమ్మకం.
అయితే సూర్యుని యొక్క స్పష్టమైన కదలిక అనేది మనం నివసించే భూమి యొక్క భ్రమణం వల్లనే తెలుస్తుంది కానీ ప్రత్యక్షంగా మామూలు దృష్టితో తెలుసుకోలేం. మన భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు.అలా గ్రహమైన భూమి తిరుగుతూ వున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లుగా కనిపిస్తాయి.
సూర్యుడు కదులుతున్నాడనడంలో ఎలాంటి సందేహమూ లేదని తెలిసింది కదా!.
పాలపుంత గెలాక్సీ అనంత విశ్వంలో సదా కదులుతూనే వుంది.అలాగే ఆ గెలాక్సీ  కేంద్రం చుట్టూ తనకంటూ కక్ష్యను కలిగిన సూర్యుడు కూడా తిరుగుతూనే వుంటాడు,ఆ తిరిగే సూర్యుని ప్రయాణ వేగం దాదాపు 450,000 mph.. వేగమట.అంటే గెలాక్సీ చుట్టూ సూర్యుడు ఒక కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపుగా 225 సంవత్సరాల సమయం పడుతుందని  ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
అయితే భూ భ్రమణం వల్ల ఆకాశంలో సూర్యుని యొక్క స్పష్టమైన చలనాన్ని కాంతి అనేది భూమిని తాకే కోణాన్ని మారుస్తుంది.కాబట్టి భూమిపై చూసేవారికి సూర్యుడు ఆకాశమంతా కదులుతున్నట్లు కనిపిస్తాడు.
 ఏది ఏమైనా సూర్యుడూ మన భూమిలా ,మనలా ప్రయాణం చేస్తాడని  తెలుసుకున్నాం.
కానీ "ఆదిత్య గతి"ని మన పెద్దలు  న్యాయంగా ఎందుకు చెప్పారో ఒక్కసారి ఆలోచించి చూద్దాం.
 కవులూ రచయితలూ సూర్యుడిని నిరంతర శ్రమ జీవితో పోలుస్తుంటారు.అంతేకాదు తన పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూనే సమస్త జీవులకు శ్రేయోభిలాషియై  జవ జీవాలను ప్రసాదిస్తాడు.తన యొక్క ఉదయాస్తమయాలతో  మానవాళికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాడు.
ఇక మతపరంగా కూడా సూర్యుడు సూర్యభగవానుడుగా, ఆదిత్యుడుగా పూజలు అందుకుంటున్నాడు. అన్ని జీవులకు మూలం మరియు పోషకుడిగా వేదాలు ఉపనిషత్తులు మొదలైన వాటిల్లో వర్ణింపబడ్డాడు.మన దేశంలో సూర్యుని ఆరాధించడమనేది  ఈనాటిది కాదు శతాబ్దాల కాలం నుండి వస్తున్నది.
కొంతమంది కళ్ళముందు ఎటూ కదలని వారిలా, ఏమీ చేయని వారిలా కనబడుతూ వుంటారు కాని వారు ఎన్నో కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తూ చూసే వారికి  ఇందుగలడందు లేడను విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటారు.అందుకే "ఆదిత్య గతి న్యాయము"ను అలాంటి వారికి ఉదాహరణగా చెబుతుంటారన్న మాట.
ఇవండీ! ఆదిత్యుడి గురించిన విశేషాలు. మనం సూర్యుడిలా అందరికీ బంధువు అవుదాం. మన చేసే మంచిపని  ప్రచారం కోసం కాకుండా మన కర్తవ్యంగా భావించి చేద్దాం. ఏమంటారు?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు