సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -458
కుమారీ కంకణ న్యాయము
****
కుమారీ అనగా కూతురు, మొదటి వయస్సులో ఉన్న పెండ్లికాని పడుచు, పార్వతి.
కంకణ అనగా వివాహ సమయంలో చేతికి కట్టుకొను కంకణము,ఒక ఆభరణము, ఆడువారు చేతికి ధరించు ఒక నగ,జల బిందువు, చేతికి కట్టుకునే తోరము అనే అర్థాలు ఉన్నాయి.
యువతి చేతి కంకణము చాలా గాజులతో  మెఱుస్తూ అటూ ఇటూ ఉన్న గాజుల నడుమ ఒరిపిడి పడుతూ వుంటుంది.ఆ ఒరిపిడిలో శక్తి జనించి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందనే అర్థంతో ఈ "కుమారీ కంకణ న్యాయము"ను మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
"బహూనాం కలహో నిత్యం ద్వాభ్యాం సంఘర్షణం/తథా!ఏకాకీ విచరిష్యామి కుమారీ కంకణం యథా."అని అంటారు కవులు.
కంకణాలు అనగా గాజులు.మన భారత దేశంలో చాలా కులాలు ,మతాల్లో పెళ్ళి కాని పడుచులు, పెళ్ళయిన మగువలనే  తేడా లేకుండా పిల్లలతో  సహా చేతుల నిండుగా గాజులు ధరించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. వీటిని ముత్తైదువ తనానికి  గుర్తుగా భావిస్తారు.
పనిలోపనిగా స్త్రీలకూ, గాజులకు ఉన్న అనుబంధం, అందులో  ఇమిడి ఉన్న ఆరోగ్య సూత్రాల గురించి మన పెద్దలు, వైద్యులు చెప్పిన మాటలు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు భారత కోకిల బిరుదాంకితురాలు సరోజినీ నాయుడు గారి "బ్యాంగిల్ సెల్లర్ "కవితలోని విషయాలను తెలుసుకుందాం.
వివిధ తెగలు, జాతులు, కులాలు  పురాతన కాలం నుండి గాజులు ధరించడం ఓ ముఖ్యమైన ఆనవాయితీగా వస్తోందని చరిత్ర చెబుతోంది.ఈ గాజులలో వెండి, బంగారం,రాగి, ఇత్తడి, ప్లాస్టిక్, గాజు వంటి లోహాలతో  కంకణాలను  తయారు చేస్తారు. వాటిని ఎంతో ఇష్టంగా మహిళలు ధరిస్తూ వుంటారు.
ఐతే ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయంటారు మానసిక వైద్యులు.మణికట్టు దగ్గర రెండు కంకణాల నడుమ ఉన్న గాజులు అటూ ఇటూ కదలడం వల్ల ఆ ప్రదేశం ఒరిపిడికి గురై రక్త ప్రసరణ వ్యవస్థలో చురుకుదనం, వేగం పెరుగుతుంది.తద్వారా మంచి ఆరోగ్యం స్వంతం అవుతుంది.
ఇక గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసినప్పుడు గాజులు తొడిగే కార్యక్రమం చూడముచ్చటగా ఉండటం మనందరికీ తెలుసు. చేతుల నిండా వేసుకున్న గాజల శబ్దం గర్భం లోని శిశువు వినడం వల్ల పుట్టే ఆ శిశువుల్లో వినికిడి శక్తి బాగా పెరుగుతుందట.
స్త్రీలు ఇంట్లో వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు లయబద్ధంగా చేతుల కదలికతో పాటు గాజులు గలగలమని కదులుతూ వుంటాయి. అలా కదలడం వల్ల మణికట్టు దగ్గర మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది. శరీరంలోని ఒత్తిడి, అలసట కూడా తగ్గిపోతుంది.
ఈకర కంకణాల వల్ల  అఅందం, ఆరోగ్యం రెండు సమకూరుతాయి.
సరోజినీ నాయుడు గారి "బ్యాంగిల్ సెల్లర్" కవితలో స్త్రీల జీవితంలోని వివిధ దశలకు చిహ్నాలుగా సాంస్కృతిక వారసత్వంగా గాజులను వర్ణిస్తారు.ఇక కంకణాల విక్రేతలు జాతరలలో అమ్మే వాళ్ళు యొక్క శక్తివంతమైన సంప్రదాయాన్ని అద్భుతంగా అక్షరీకరిస్తారు. ఇలా బ్యాంగిల్ సెల్లర్ కవిత ప్రపంచ సాహిత్యంలో  గొప్ప పేరు తెచ్చుకుంది.
ఈ గాజుల మీద సినిమాలు , పాటలు చాలానే వచ్చాయి. ఆ గాజుల చిరు సవ్వడి వింటుంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పెళ్ళిళ్ళు, పేరంటాల్లో గాజులు వేయించడం ఓ వేడుకగా జరుపుకుంటారు.
ఐతే మన పెద్దలు "కుమారీ కంకణ న్యాయము" ఇవే  కాకుండా మరో కోణంలో   కూడా చెప్పారు. యువతులు, స్త్రీలు తాము చేసే పనుల వల్ల, కుటుంబంలోని సమస్యల వల్ల, రకరకాల ఆలోచనలతో అలసట, ఒత్తిడికి గురవుతూ ఉంటారు.వాటిని నివారించే ఔషధంలా  ఈ గాజులు ధరించాలనీ,అందులోనూ మట్టి,గాజుతో చేసిన కంకణాలు మంచివని  చెప్పడమే ఈ న్యాయములోని అంతరార్థము.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు