ఒక అడవిలో ఒక ఎలుగుబంటి, నక్క పక్కపక్క ఇళ్ళలో వుండేవి. ఒకసారి ఎలుగుబంటి చెరువు పక్కన మొక్కజొన్న చేను వేయాలనుకొనింది. అది విని నక్క “మిత్రమా... నువ్వొక్కదానివే మొక్కజొన్న పంట వేయడం అంత సులభం కాదు. ఇద్దరం కలసి వేద్దాం. కాలికి చెప్పులా, నెత్తికి గొడుగులా కష్టసుఖాల్లో తోడుంటా. పంట పండినాక సగం, సగం పంచుకుందాం" అనింది. దానికి ఎలుగుబంటి 'సరే' అనింది. పంట వేసి రెండు సమానంగా కష్టపడినాయి. కొంతకాలానికి చేను ఏపుగా పెరిగి, కంకులు లావుగయి
కోతకొచ్చినాయి.
సరిగ్గా అదే సమయంలో ఎలుగుబంటికి కళ్ళకలక వచ్చింది. రెండు కళ్ళు ఎర్రగా వాచిపోయి మసకమసకగా కనబడడం మొదలైంది. అది రోజురోజుకీ పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. దాంతో ఆ జిత్తులమారి నక్క ఎలుగుబంటిని మోసం చేయడానికి ఇదే సందనుకోనింది. “మిత్రమా... కంకులు బాగా లావయిపోయినాయి. కోత కోయకపోతే పాడయిపోతాయి. నువ్వేమీ దిగులు పడకు. నేను కోసి సగం, సగం పంచుతా" అనింది. ఎలుగుబంటి 'సరే' అనింది.
నక్క కంకులన్నీ కోసినాక తన వైపేమో ఎక్కువ కంకులు వేసుకొని, ఎలుగుబంటి వైపు కొంచం కంకులే వేసింది. ఎలుగుబంటికి కళ్ళు కనబడకపోయినా కుప్పలు తడిమి చూసి ఏదో మోసం జరుగుతోందని తెలుసుకొనింది. దాంతో “మిత్రమా... నీ వైపు కంకులు ఎక్కువా, నా వైపు తక్కువా వున్నట్టున్నాయే. ఏంది సంగతి" అని అడిగింది. దానికి నక్క “ఎంత మాట మిత్రమా... నమ్మిన స్నేహితున్ని మోసం చేసినవాడు నరకంలో వేడి వేడి నూనెలో వేయించబడుతాడంటా. కావాలంటే దారిన పోయేవాళ్ళని ఎవరినైనా పిలిచి అడుగుదాం. నేనెంత నిప్పో నీ కర్ధమైతాది" అనింది.
కాసేపటికి అటువైపు చక్కని చందమామ లాంటి ఒక పిల్లోడు వచ్చినాడు. అడుగుల చప్పుడు విన్న ఎలుగుబంటి “బాబూ నీదే వూరు. ఎక్కడికి పోతా వున్నావు " అని అడిగింది. దానికా పిల్లోడు “నాది పక్కనే వున్న కందనవోలు. పక్కూరిలో సంతకు పోతావున్నా' అన్నాడు. అప్పుడా ఎలుగుబంటి “అలాగా... నువ్వు చానా మంచి పిల్లోని లెక్క వున్నావు. ఇక్కడ కంకులు రెండు కుప్పలు వున్నాయి గదా... వీటిలో ఏది పెద్దగుందో, ఏది చిన్నగుందో చూసి చెప్పు” అనింది.
ఆ పిల్లోడు కుప్పల వైపు చూసినాడు. అంతలో నక్క ఆ పిల్లోనితో “చూడు బాబూ... మా ఎలుగుబంటి కళ్ళు కనబడక నేను మోసం చేస్తున్నా అనుకొంటూ వుంది. నువ్వన్నా సరిగ్గా చూసి సమానంగా వున్నాయో లేదో చెప్పు" అంటూ వానికి సైగ చేసి చంపుతా చూడు అంటూ తన వాడియైన గోళ్ళు చూపి బెదిరిచ్చింది. దాంతో ఆ పిల్లోడు బెదపడి "రెండు కుప్పలు సమానంగానే వున్నాయి. ఒక కంకి ఎక్కువా లేదు. ఒక కంకి తక్కువా లేదు" అని చెప్పినాడు.
దాంతో ఎలుగుబంటికి చానా కోపం వచ్చింది. “మధ్యవర్తిగా వచ్చినోడు ఎటువైపు వంగగూడదు. మాట తూలగూడదు. మడమ తిప్పగూడదు. కళ్ళు కనబడ్డం లేదు గదా అని నువ్వు గూడా మోసం చేస్తావున్నావు. ఈ వారం గాకున్నా వచ్చే వారమన్నా నా కళ్ళు బాగవుతాయి. అప్పుడు నీ ఇంటికొచ్చి నిన్ను ఎత్తుకొనిపోయి చంపకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా" అని శపథం చేసింది.
దాంతో ఆ పిల్లోడు బెదపడిపోయి ఇంట్లో వాళ్ళ నాయకు జరిగిందంతా చెప్పినాడు. దాంతో వాళ్ళ నాయన “అట్లనా... సరే రానీ, మెడమీద కత్తి పెట్టి న్యాయం చెప్పమంటే ఎవడు మాత్రం చెప్పగలడు.
ప్రాణం కన్నా ఏదీ గొప్పది కాదు గదా. మోసం చేసిన నక్కను వదిలేసి అమాయకుడైన నీ మీదకు వస్తే ఎలా" అంటూ మంచమ్మీద మంచం మొత్తం ఏడు మంచాలేసి మధ్యలో కొడుకును పడుకోబెట్టినాడు. మిగిలిన మంచాల్లో ఇంట్లో వాళ్ళంతా పక్కనే ఒక పెద్ద దుడ్డుకర్ర పెట్టుకోని పడుకోసాగినారు.
అట్లా నెమ్మదిగా నెల గడిచింది. అడవిలో ఎలుగుబంటికి కండ్లు బాగయినాయి. జొన్న కంకుల కుప్ప చూస్తే చానా కొంచమే కనబన్నాయి. దాంతో ఒక రోజు అర్ధరాత్రి అందరూ పండుకున్నాక అడవి పక్కనే వున్న కందనవోలుకి బైలుదేరింది. ఎంతటోడయినా సరే రాత్రి రెండు, మూడయ్యేసరికి ఒళ్ళు మరచి నిద్రపోతాడు గదా... ఆ సమయంలో లోపలికి దూరి చప్పుడు గాకుండా ఒక్కొక్క మంచమే కిందకి దించి, మధ్యలో వున్న పిల్లోన్ని మట్టసంగా మంచంతో సహా ఎత్తుకొని అడవిలోకి బైలు దేరింది. అట్లా నడుస్తా ఏడు అడవులు, ఏడు కొండలు దాటింది. అది అట్లా పోతావుంటే ఆ
పిల్లోనికి పొద్దునవుతావుంటే మెలకువ వచ్చింది. చూస్తే ఇంకేముంది... కింద ఎలుగుబంటి. ఆ పిల్లోడు అదిరిపడినాడు. ఏ మాత్రం కదిలినా మంచం దించి చంపడం ఖాయం. దాంతో చప్పుడు చేయకుండా ఎలుగుబంటి వెండ్రుకలను, నవారు మంచానికి ముడి వేయడం మొదలు పెట్టినాడు.
ఎలుగుబంటి ఒక భయంకరమైన పాడు బడిన బావి కాడికి వచ్చింది. దాని గట్టుపైకి ఎక్కింది. మంచంతో బాటు ఆ పిల్లోన్ని లోపలికి విసిరి వేయాలి అనుకొనింది. అదే సమయంలో ఆపిల్లోడు బావిపైన ఒక చెట్టుకొమ్మ వుంటే దాన్ని పట్టుకొని నెమ్మదిగా పైకి ఎక్కేసినాడు. ఎలుగుబంటి మంచం బావిలోకి విసిరేసింది. కానీ దాని వెండ్రుకలు మంచానికి గట్టిగా ముడివేసి వున్నాయి గదా, దాంతో ఆ మంచంతో బాటు అది గూడా దభీమని బావిలోకి పడిపోయింది.
పిల్లోనికి తిరిగి ఎట్లా ఇంటికి పోవాల్నో తెలీలేదు. దారి తప్పి మరింత లోపలికి పోయినాడు. ఆ అడవిలోనే జంతువులు, పక్షులతో కలసి బతుకుతూ, అక్కడ దొరికే పండ్లు కాయాలూ తింటూ పెరిగి పెద్ద కాసాగినాడు. అక్కడ రకరకాల అద్భుతమైన వన మూలికలతో నిండిన చెరువు వుంది. ఆ చెరువు నీటిలో రోజు వీధిలాడుతూ తలస్నానం చేయడం వల్ల వాని వెంట్రుకలు బంగారు రంగుకు మారాయి. ఆ నీటిని తాగుతూ, పచ్చని అడవి తల్లి ఒడిలో పెరగడంతో వయసుతో బాటు అందం గూడా పెరిగింది. బంగారు రంగు వెండ్రుకలతో, చందమామను మించిన మొహంతో, ఆరడుగుల ఎత్తుతో... అప్పుడే పూసిన పూవులెక్క వున్న వాన్ని చూస్తే చాలు ఇలాంటి అల్లుడుంటే ఎంత బాగుండునో అని ఆడపిల్లల తల్లిదండ్రులు అనుకునేలా ముచ్చటగా తయారయినాడు.
ఒకసారి ఆ యువకుడు చెరువులో ఈత కొడతావుంటే తలనుంచి ఒక వెండ్రుక ఊడి నీళ్లలో పడింది. దాన్ని ఒక చేప మింగింది. అంతే... దాని ఒళ్ళంతా బంగారు కాంతులు వెదజల్లుతూ ధగధగా
మెరిసిపోసాగింది. ఒకసారి ఒక జాలరి ఆ చెరువు కాడికి వచ్చి వల విసిరినాడు. అందులో ఈ చేప చిక్కుకోనింది.
ఆ జాలరి సాన బెట్టిన వజ్రంలా మిలమిలా మెరిసిపోతావున్న ఆ చేపను చూసి “అబ్బబ్బ... ఏం మెరిసిపోతా వుంది ఇది వజ్రంలా. ఇంత అందమైన దాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూల్లేదు. దీన్ని తీసుకొని పోయి అమ్మితే డబ్బులే డబ్బులు" అనుకుంటా సంబరంగా సంతకు పోయినాడు. ఆ ఊరిలో వున్న ఒక పెద్ద ధనవంతుడు అందరికన్నా ఎక్కువ డబ్బులిచ్చి దానిని కొనుక్కున్నాడు. అతను ఆ చేపను బహుమానంగా ఆ ఊరి జమీందారుకు ఇచ్చినాడు. ఆ జమీందారు సైన్యాధికారికి ఇచ్చినాడు. ఆ సైన్యాధికారి ఆ ఊరిని పాలించే రాజుకు ఇచ్చినాడు. రాజు ఆ చేపను చూసి ఆశ్చర్యపోయి మంత్రిని పిలిపించి “మహామంత్రి... ఎప్పుడైనా, ఎక్కడైనా పచ్చగా బంగారు రంగులో మెరిసిపోతా వున్న ఇంత అందమైన చేపను చూసినావా... ఈ వింతకు కారణమేమో కనుక్కో" అన్నాడు. మంత్రి రాజ వైద్యులను పిలిపించినాడు. వాళ్ళు దాన్ని పరిశోధించి కడుపులోనుండి తల వెండ్రుకను తీసినారు. వెంటనే ఆ చేపలో మెరుపు తగ్గిపోయింది.
“మహారాజా... ఆ చేప ధగధగలకు కారణం అది మింగిన ఈ తల వెండ్రుకనే" అంటూ అందించినారు. రాజు బంగారు రంగులో పట్టులా మెత్తగా మెరిసిపోతావున్న ఆ వెండ్రుకను చూసి ''కేవలం ఒక్క ఈ
వెండ్రుకే ఇంత అందంగా మిరుమిట్లు గొలుపుతా వుంటే ఆ యువకుడు ఇంకెంత మనోహరంగా మెరిసిపోతా వుంటాడో కదా" అనుకుంటూ ఈ తల వెండ్రుక ఎవరిదో కనుక్కోమని మంత్రిని ఆజ్ఞాపించినాడు. దాంతో మంత్రి సైన్యాధికారిని పిలిపించినాడు. సైన్యాధికారి జమీందారుని పిలిపించినాడు.
జమీందారు ధనవంతున్ని పిలిపించినాడు. ధనవంతుడు జాలరిని పిలిపించినాడు. జాలరి చేపను పట్టిన చెరువును చూపించినాడు. సైనికులు చెరువు చుట్టూ ఆ యువకుని కోసం గాలించసాగినారు. ఆఖరికి ఒక గట్టుమీద చెరుకుగడ తింటూ కనిపించినాడు. రాజుగారు తీసుకురమ్మన్నారని చెప్పినారు.
కానీ ఆ యువకుడు వాళ్ళమాట పట్టించుకొంటేనా... రాజు నగరానికే గాని అడవికి కాదు గదా. దాంతో రాను పొమ్మన్నాడు. దాంతో వాళ్ళు పట్టి బంధించాలని చూసినారు. కానీ ఆ యువకుడు చిక్కినట్టే చిక్కి బుడదమట్టలా జారిపోసాగినాడు. అడవిలో వుండే ప్రతి చెట్టూపుట్ట, కొండాకోన, వాగూవంక గుట్టుమట్లు తెలిసినవాడు. దాంతో వాన్ని పట్టుకోలేక రాజుకు పోయి చెప్పినారు. రాజు మరింతమంది సైనికులను పంపించినాడు గానీ ఆ యువకుడు అమ్మలాంటి అడవిలో ఎన్ని రోజులైనా ఎవరికీ చిక్కలేదు.
దాంతో రాజుకు పంతం పెరిగి “ఎవరైతే ఆ యువకున్ని అడవిలోంచి పట్టుకువస్తారో వాళ్ళకు పదివేల బంగారు వరహాలు" అని దండోరా వేయించినాడు. చానా మంది ప్రయత్నించినారు గానీ ఎవరికీ చేతగాలేదు.
ఒకరోజు ఒక ముసలామె రాజభవనానికి వచ్చింది. “రాజా... నేను కోరినవన్నీ అందిస్తే ఆ యువకున్ని పట్టుకొని మీ ముందు నిలబెడతా" అనింది.
అందరూ ఆ ముసలామెను చూసి “కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో నీకెందుకే అవ్వా బంగారు వరహాల మీద ఆశ. ఎందరెందరో వీరులు, సైనికులే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నారు. పో... పోయి... కృష్ణా రామా అనుకుంటా ఒక మూలన కూర్చో" అంటూ ఎగతాళి చేసినారు.
కానీ రాజు అందరినీ వారించి “ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బుర్రలో ఏ ఆలోచనుందో ఎవరికి తెలుసు. బలంతో చేయలేని పనులు తెలివితో చేయొచ్చు. ఆమెకు ఏం కావాలో ఇచ్చి పంపండి" అన్నాడు. అప్పుడా ముసలామె “రాజా... నాకు ఒక గుర్రం బండి కావాలి. గుర్రాలు 'అ' అంటే ఆగేలా, 'ప' అంటే పరిగెత్తేలా వుండాలి. ఒక చిన్న సీసాలో మత్తు మందు, గుప్పెడు నువ్వులు కావాలి" అనింది. రాజు "అలాగే"నని ఆమె అడిగినవన్నీ ఇచ్చి అడవికి పంపించినాడు.
ముసలామె ఆ యువకున్ని వెదుక్కుంటా అడవిలోని చెరువు కాడికి వచ్చింది. అక్కడ ఆ యువకుడు కనబడగానే “నాయనా... బాగా దాహంగా వుంది. కొంచెం నీళ్ళివ్వు" అనింది. ఆ యువకుడు పెద్ద తామరాకును పొట్లంలా చుట్టి చెరువు మధ్యలోంచి నీళ్ళు తెచ్చి ఇచ్చినాడు. ఆమె వాటిని తాగుతా "ఎవరు నాయనా నువ్వు. అచ్చం నా మనవనిలా వున్నావు. ఏ ఊరు. అమ్మా, నాయన ఎవరు" అంటూ తీయగా మాట కలిపింది. అంతవరకు తనను అలా ప్రేమగా పలకరించిన వారు ఎవరూ లేకపోవడంతో ఆ యువకుడు ముసలామె పక్కనే కూచోని జరిగిందంతా చెప్పసాగినాడు
అవ్వ ఆ మాటలకు వూ కొడతా "ఎన్నినాళ్ళయింది నాయనా తల దువ్వుకొని. అంతా చిక్కుపడి పేలు తిరుగుతా వున్నాయి. ఇలారా తల దువ్వి చక్కగా చందమామలా చేస్తా" అనింది. ఆ యువకుడు ఆమె ముందు కూర్చున్నాడు. వానికి కనపడకుండా కొన్ని నువ్వులు తీసి తలలో వేసింది. ఒక్కొక్కటే తీసి గోర్ల మధ్య పుటుక్కు పుటుక్కుమని అంటా మాటల మీద మాటలు చెబుతా తలను నెమ్మదిగా దువ్వసాగింది. ఆ యువకుడు హాయిగా కళ్ళు మూసుకొని వింటా వింటా ఆమె వడిలో పడుకొని అలాగే నిద్రపోయినాడు. వెంటనే ముసిలామె ఒక బట్టముక్క తీసి దానిపై కాస్త మత్తుమందు పోసి వాసన చూపించింది. దాంతో ఆ యువకుడు మరింత మత్తుగా వాలిపోయినాడు. వెంటనే వాన్ని గుర్రం బండిలోకి చేర్చి “హేయ్... ప” అంటూ అదిలించింది. అంతే అవి ఎక్కడా ఆగకుండా ఆ యవకుడు మేలుకునే లోపల సక్కగా రాజభవనానికి వచ్చి ఆగినాయి. రాజు చానా సంబరపడి ముసలామెకు ముందుగానే చెప్పినట్లు పదివేల బంగారు వరహాలిచ్చి పంపిచ్చినాడు.
తన మాటను ఎదురించినందుకు రాజుకు ఆ యువకుని మీద కొంచం కోపమున్నా ఆ అమాయకమైన పండు వెన్నెల లాంటి ప్రశాంతమైన మొహం చూసి కోపం చిటికెలో ఎగిరిపోయింది. “ఎవరు నాయనా నువ్వు. ఆ అడవిలో ఒక్కనివే ఎందుకున్నావు. ఏంది నీ కథ” అని అడిగినాడు. ఆ యువకుడు జరిగిందంతా చెప్పినాడు.
రాజుకు బంగారు తీగలాగా వున్న ఆ యువకున్ని చూస్తావుంటే పెళ్ళికాని తన చిన్న కూతురు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి దాపునుంచి ఆ యువకున్ని చూపించినాడు. వాడు నవ్వితే ఆకాశం నుండి భూమ్మీదకు వాన కురిసినట్లు వుంటాది. మంచుపూలు మీదికి విసిరినట్లు వుంటుంది. పచ్చని పంటలు విరగకాసినట్లు వుంటాది. పసిపిల్లలు సంబరంగా కేరింతలు కొట్టినట్లు వుంటాది. అది చూసి యువరాణి ముచ్చటపడి సిగ్గుతో 'సరే' అనింది. వెంటనే ఆ యువకుని అమ్మానాన్నలను వెతికించి రాజభవనానికి పిలిపించి, ఆకాశమంత పందిరి భూదేవంత అరుగూ వేసి, నూటా అరవై ఆరు రుచులతో ఊరందరికీ విందు భోజనాలు పెట్టి, అంగరంగ వైభవంగా పెళ్ళి చేసినాడు.
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి