సుప్రభాత కవిత ; -బృంద
గొడుగంటి నీడగా
చలువ పందిరి వేసిన 
చక్కని తరువుల దారిలో 
హాయిగా సాగే గమనం...

కొమ్మల సందున వచ్చి
వెచ్చగ తాకి పలకరించు
తెలి వెలుగుల కిరణాల
నులివెచ్చని అభిమానం

తనువంతా తెలియని
ఆనందపు కెరటాల
తడిసి మురిసే మనసున
ఎగసే ఉత్తుంగ తరంగం..

కాంతి ధారల రూపున
కురిసిన దైవానుగ్రహానికి
ముకుళిత హస్తాలతో
అంజలి ఘటించే హృదయం

నిరంతర కాలచక్ర గమనంలో
ఏ క్షణమూ తిరిగిరాదనీ
వేదనైనా వేడుకైనా కదిలిపోక
తప్పదనీ ఎరుగని అజ్ఞానం

రేపటిపై పెంచుకున్న
ఆశల పాదులన్నీ
పూలుపూచి కాయ కాచే
తరుణం వచ్చెనని  సంతోషం

ఉత్సాహం ఊపిరిగా
నమ్మకమే మనకున్న బలంగా
మంచిని పంచుతూ సాగే
మధురక్షణాలను తెచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు