రాజ హంసలు;- నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108.
ఆరిపోయే ప్రాణానికి ఆజ్యం పోసే 
అపర ధన్వంతరి వారసులు 
అస్త్ర శస్త్ర చికిత్స పరంపరతో                  
నిశ్చల అవయవాలకు నడక నేర్పే సృజన శీలురు 
చిద్రమైన బతుకు చిగురింప చేసే చిరుజల్లులు!

స్టెతస్కోప్ సర్పాన్ని సతతం
మెడలో ధరించే శివుని ప్రతిరూపాలు
అందరికీ ఆరోగ్యం లక్ష్య సాధనగా 
అహరహం వైద్య సేవే పరమావధిగా 
స్వచ్ఛ జల ప్రవాహాన సాగిపోయే రాజహంసలు! 

సమగ్ర సమాజ ఆరోగ్య పరిరక్షణకై 
నిరంతరం పరితపించే ఆదర్శ మార్గదర్శకులు 
భేద భావాలు లేని నిర్మల గంభీర శిఖరాలు
మానవత్వ పరిమళాలు వెదజల్లే మహా వృక్షాలు 
అంటురోగ తిమిరాన్ని తరిమే ఉషాకిరణాలు! 

నరునిగా అవతరించిన శ్రీమన్నారాయణులు
ప్రాణం ఫణంగా పోరాడే త్యాగమయ జీవులు 
దేహమంతా ముక్కలై మరణ శయ్యపై చేరినా                                      
రోగం రొప్పితో అవయవాలు అచేతనమైనా 
స్వస్థత పరిచి స్వాంతన చేకూర్చే ప్రాణ దాతలు! 

జబ్బుల తరిమి జాతిని రక్షించే జ్యోతి స్వరూపాలు 
చెరగని చిరునవ్వుతో పగలు రేయి పరిశ్రమతో 
పవిత్ర వైద్య వృత్తి ధర్మం పాటించే జన్మ ధన్యం
వైద్యం వ్యాపారం కాదు సేవా దృక్పథమని చాటే
ప్రేమ కరుణతో కూడిన తెల్ల కోటుకు వందనం!
👩🏻‍⚕️🧑🏽‍⚕️🧑🏽‍⚕️👩🏻‍⚕️🧑🏽‍⚕️♦️🦢🦢🦢🦢🦢
(1జూలై,జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా)


కామెంట్‌లు