సునంద భాషితం;-వురిమళ్ల సునంద, చికాగో, అమెరికా
 న్యాయాలు-565
దేవదత్త పుత్ర న్యాయము
   *****
దేవదత్త అనగా  దేవదత్తుడు అనే పేరు గల వ్యక్తి, గౌతమ బుద్ధునికి తమ్ముడు అని కూడా అంటారు. పుత్ర అనగా పుత్రుడు,కుమారుడు, తనయుడు అనే అర్థాలు ఉన్నాయి.
దేవదత్తుడి పుత్రుడు దేవ దత్తుడి భార్యకు కూడా పుత్రుడే అని అర్థము..
అందులో ఎలాంటి సందేహమూ లేదు.ఎందుకంటే  ఒకవేళ అసలు భార్య అయినా, కొసరు భార్య అయినా ( ఏమనుకోకండీ) అంటే  మరో భార్య ఉన్నా ఆమెకు కూడా కొడుకే అవుతాడు కదా!
ఇదో సరదా న్యాయము.ఓ పొడుపు కథ లాంటిది కూడా.కొంతమంది మాట్లాడేటప్పుడు ముక్కేది అంటే సూటిగా చెప్పకుండా  తిప్పి తిప్పి చెబుతుంటారు.ప్రశ్నలోనే జవాబు వుంటుంది. బుద్ధికి పదును పెట్టే ఈ న్యాయము  వినేటప్పుడు విసుగనిపించినా ఆ తర్వాత విస్మయం కలుగుతుంది.
 కొంత మంది భలే ఆట పట్టిస్తూ మాట్లాడుతుంటారు. మీరు ఎవరండీ? అని అడిగితే ఫలానా వ్యక్తి ధర్మపత్ని కుమారుడినండీ అంటారు.ఆ వ్యక్తి కొడుకును అని నేరుగా చెప్పకుండా...
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించిన చమత్కార లేదా చాటు పద్యాలు చూద్దాం.
"వంగ తోట నుండు, వరిమళ్ళలో నుండు/ జొన్న చేల నుండు చోద్యముగను/తలుపు తల పైన నుండు/ దీని భావమేమి తిరుమలేశా!"
 ఈ పద్యంలోనే  జవాబు వుంది.పద్యాన్ని ఇలా విడ దీసి చదివితే అర్థమవుతుంది. వంగ తోట నుండు - వంగ అంటే వంకాయ తోటలోనే వుంటుంది.కోసేంత వరకు.వరిమడిలోనే వుంటుంది. జొన్న చేలోనే వుంటుంది.తలుపు మూలలోనే వుంటుంది.తల మీదనే వుంటుంది కదా! 
మరో పద్యం :-"కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు/ పశువు శిశువుతోడ పలుక నేర్చు/వనిత వేదములను వల్లించుచుండును/బ్రాహ్మణుండు కాకి పలలము దినును" 
 దీనిని ఏ పాదము ఆ పాదమే చదివితే విపరీతార్థం వస్తుంది."కొండ నున్న నెమలి కోరినన్ని పాలు ఇస్తుంది" అని వుంది. అది అసహజం కదా! ఇలా మిగిలిన పాదాలు కూడా. వీటిని ఇలా చదివితే  అసలును అర్థం చేసుకోవచ్చు.కొండ నుండు నెమలి- నెమలి కొండా కోనల్లో వుంటుందని అర్థము. ఇలా మిగిలిన వాటిని కూడా చదివితే కవి ఎంత చమత్కారంగా రాశాడో తెలుస్తుంది.
 ఇలా మన తెలుగు సాహిత్యంలో ఇలాంటి చమత్కార పద్యాలు, చాటువులు, చెణుకులతో పాటు  అద్భుతమైన కావ్యాలు రెండు అర్థాలను ఇచ్చే ద్వ్యర్థి, మూడు అర్థాలతో కూడిన త్ర్యర్థి కావ్యాలు ఉన్నాయి. అదే మన తెలుగు భాషలో ఉన్న గొప్పదనం.
నలుగురు కలిసి ఉన్న సమయంలో వాతావరణం గంభీరంగా అనిపించినప్పుడో,తరగతి గదిలో రోజు వినే తెలుగు పాఠాలను విద్యార్థులు వినడానికి ఏకాగ్రత చూపించనప్పుడో ఇలాంటి చెణుకులు , చాటువులు, చమత్కార పద్యాలు వినిపిస్తే  వారికి మన భాషా సౌందర్యం అర్థమవుతుంది.సంతోషంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తారు.
చుట్టరికాలు/ బంధుత్వాలలో  ఇలాంటి చమత్కారాలను చూద్దాం. వేలు విడిచిన మేనమామ కూతురనీ,వేలు విడిచిన మేనత్త కొడుకు అని అనడం వింటుంటాం.వేలు విడిచిన  మేనమామ అంటే అమ్మమ్మ యొక్క అక్క లేదా చెల్లెలి కొడుకు అన్నమాట.అతని కూతురు మరదలు అవుతుంది. అలాగే వేలు విడిచిన మేనత్త అంటే నాన్న తండ్రి అంటే తాతగారి తమ్ముడు లేదా అన్న కూతురి కొడుకు బావ అవుతాడు.ఇలాంటి సంబంధ బాంధవ్యాల గురించి పెద్దవాళ్ళు ఉన్న కుటుంబంలో తరచూ వింటుంటాం.
 "దేవదత్త పుత్ర న్యాయము" పుణ్యమాని  తెలుగు భాషలోని చమత్కార, చాటువుల మాధుర్యాన్ని రుచి చూడగలిగాం.

కామెంట్‌లు