సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా
 న్యాయాలు -554
దాహక దాహ న్యాయము
*****
దాహక అనగా తగల బెట్టునది,దహన శీలమైనది,అగ్ని. దాహ అనగా కాలుట, దప్పిక అనే అర్థాలు ఉన్నాయి.
మంట లేని అగ్ని కట్టెలతో కలిసి తాను కూడా ఆ కట్టెల ఆకారాన్ని పొందుతుంది అని అర్థము.
పంచభూతాల్లో అత్యంత ఆకర్షణీయమైనది అగ్ని. పెద్దలు అందుకే అంటుంటారు "నిప్పు, నీరు ఆకర్షిస్తాయి.వాటి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి" అని.
మరి అలాంటి అగ్ని లేదా నిప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా అగ్ని అంటే అందరికీ భయమే. అది ఒంట్లో పెరిగితే జ్వరంగా మారుతుంది. వాతావరణంలో పెరిగితే మండే ఎండగా మారి యిబ్బంది పెడుతుంది. ఇక చిన్న అగ్గిరవ్వ పైకి లేచిందంటే గుడిసెలు ఇళ్ళు, వాకిళ్లు,చెట్టూ చేమ... ఏదైనా సరే కాలి బూడిద కావాల్సిందే. దానిని ఆపడం ఒకసారి మనతరం కాకపోవచ్చు. మొత్తం బూడిద చేశాకే శాంతిస్తుంది.అంటే అగ్ని ఎంత దహనశీలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు .
మరి అలాంటి అగ్ని దేహంలో సమపాళ్లలో ఉంటేనే మనిషి బతకగలడు.మనిషిలో ప్రాణం అగ్నితో ముడిపడి ఉంటుంది. దేహంలోంచి అగ్ని పూర్తిగా చల్లారిపోయిందంటే మనిషి మరణించినట్లే.అంటే అగ్నిని జీవ ప్రదాతగా చెప్పవచ్చు.అలాగే మొత్తం  మాడి మసై పోయేలా చేస్తుంది కాబట్టి జీవ హర్తగా కూడా చెప్పుకోవచ్చు.
ఆదిమ మానవుడు ఎప్పుడైతే నిప్పును కనిపెట్టాడో అప్పటి నుండి  తినే ఆహారం రుచికరంగా ఉండేందుకు అగ్నిని ఉపయోగించడం మొదలుపెట్టాడు.అలా అగ్నితోనే వంటావార్పు చేసుకుంటాం.
అలాంటి అగ్ని కట్టెలతో తక్కువ మంటతో చేరినప్పుడు  మసిగా మారకుండా అలా కట్టె ఆకారం పొందుతుంది.
అయితే దీనిని రెండు రకాలుగా మనుషుల వ్యక్తిత్వానికి అన్వయించి చూడవచ్చు.
అగ్నిని  మన పెద్దవాళ్ళు కోపానికి  ప్రతీకగా చెబుతుంటారు.అగ్నిలాంటి తీవ్రమైన కోపం వల్ల జరిగే నష్టం పూడ్చుకోలేనిది.కోపం వచ్చిన వ్యక్తినే కాదు.కోపానికి గురైన వ్యక్తిని కూడా తీవ్రంగా నష్టపరుస్తుంది.
అలాగే అగ్ని లాంటి తీవ్ర స్వభావం ఉన్న వాళ్ళతో చేసిన స్నేహం పచ్చని జీవితాన్ని సైతం కాలిన కట్టెలా మారుస్తుంది.
 కాబట్టి ఈ "దాహక దాహ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అలాంటి వారి స్నేహానికి, కోపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ మనలో అలాంటి మనస్తత్వం ఏమాత్రం పొడసూపినా వెంటనే మార్చుకోవాలి.
ఇదండీ "దాహక దాహ న్యాయము"లోని అంతరార్థము.

కామెంట్‌లు