న్యాయాలు -553
దశమ వివేక న్యాయము
*****
దశమ అనగా పదవది.వివేక అనగా తెలివి
దశమ వివేక అనగా పదో తెలివి అని అర్థము.అంటే మామూలు తెలివికంటే ఎక్కువ తెలివి లేదా అతి తెలివి అన్నమాట.
అసలు తెలివి అంటే ఏమిటో తెలుసుకుందాం.తెలివి అంటే సహజంగా పుట్టుకతోనే చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకునే శక్తి.విద్య విషయ పరిజ్ఞానం వల్ల అది మరింత పదునవుతుంది.విషయాన్ని త్వరగా, ఖచ్చితంగా అర్థం చేసుకునే నేర్పు కలిగి తదనుగుణంగా స్పందించగలిగి, సందర్భానుసారంగా సమన్వయం చేసుకోగల వ్యక్తిని ప్రజ్ఞాశాలి లేదా బాగా తెలివైన వ్యక్తి అని అంటారు.
ప్రజ్ఞాశాలి ఎంత మందిలో నైనా ఇట్టే గుర్తింపబడతాడు.అతని ప్రత్యకత మాటల్లోనూ, చేతల్లోనూ కనబడుతుంది.
మరి ఈ తెలివి తేటలు అనేవి ఎక్కడ నుండో రావు.మనం నిత్య జీవన అలవాట్లతోనే వస్తాయని నిపుణులు చెబుతున్నారు.మనిషి యొక్క తెలివి శరీరం మరియు మనసు మీద ఆధారపడి ఉంటుంది.కొంతమంది పెద్దవాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ వుంటారు.వారిని చూసినవారెవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.అంటే వారికి తెలివి శాతం ఎక్కువగా ఉందని అర్థము .
ఇలా తెలివి పెంచుకోవడానికి కావలసిన ప్రశ్నలు ముఖ్యంగా ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ పోవడమే. నిత్యం చేసే పుస్తక పఠనం. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం.సమాజంలోని వివిధ రకాల వ్యక్తులను నిశితంగా పరిశీలించి వారి ఆలోచనలు,వ్యూహాలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం వల్ల మంచి చెడుల మధ్య అంతరాలు తెలిసే తెలివితో పాటు మేధో సామర్థ్యం పెరుగుతుంది.
అంతే కాదు నేను ఇది చేయగలను. చేస్తాను.అని ఎవరికి వారే సవాల్ విసురుకుని,సాధించే ప్రయత్నం చేయడంలాంటి వన్నీ తెలివి తేటల్ని మరింత పెంచుతాయి.తద్వారా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది.ఈ విధంగా మనం నేర్చుకున్న అంశాలు,తెలుసుకున్న విషయాలు, పొందిన అనుభవాలు తెలివితేటలకు గీటురాయిగా నిలుస్తాయి.
వివేకం లేదా తెలివి అనేది సాటి వారిని, సంఘటనలను లోతుగా అర్థం చేసుకునేందుకు, మనమేంటో ఋజువు చేసుకునేందుకు ఉపయోగపడాలి కానీ ఇతరులను మోసం చేయడానికి కాదని గ్రహించాలి.
అయితే దశమ వివేకం అంటే అతి తెలివి అన్నమాట.అతి తెలివి అంటే గొప్ప తెలివి అనికాదు. మహా ప్రమాదకరమైన తెలివన్న మాట.
ఈ అతితెలివి ఉన్న వారిలో అత్యుత్సాహం ఉంటుంది.వీళ్ళపై వీళ్ళకి విపరీతమైన నమ్మకం వుంటుంది.ఇతరులు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడరు. ఏదైనా సరే విషయం తెలుసుకోకుండానే అందులోకి ప్రవేశించి పూర్తి చేయలేక భంగపడుతుంటారు,అపజయాల పాలవుతుంటారు.ఇలాంటి వారి గురించి రాసిన భర్తృహరి నీతి శతకం లోని శ్లోకం చూద్దాం.
"యదా కించిద్ జ్ఞోహం గజ ఇవ మదాన్ధఃసమభవం/తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవ లిప్తం మమ మనః/ యదా కించిత్కించిద్బుధ జన సంకాశాదవగతం/తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మేవ్యపగతః/"
అనగా నేను ఎప్పుడు కొంచెమే తెలిసివుండినప్పుడు గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు తెలియని వాడనై మదించిన ఏనుగు వలె నాకే అన్నీ తెలుసనుకొని, సర్వజ్ఞుడను అనుకుంటూ వుండే వాడిని. విద్యాధికుల సాంగత్యం వలన ఎప్పుడైతే నాకు కొంచెం కొంచెంగా విషయ జ్ఞానం అవగతమవుతూ వచ్చిందో అప్పుడే నేను ఎంత అవివేకినో అన్న విషయం అర్థమవుతూ వచ్చింది.నేను మూర్ఖుడిననే సంగతి తెలిసిన కొద్దీ ఆ భావన చేత జ్వరము తగ్గి సుఖపడినట్లు నన్ను పట్టియున్న గర్వము పోయి సుఖ పడ్డాను అని అర్థము.
అతి తెలివి వుండకూడదు అనే అర్థంతో ఈ "దశమ వివేక న్యాయము"ను మన పెద్దలు పై శ్లోకాన్ని సైతం ఉటంకిస్తూ ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే తెలివి తేటలు పెంచుకోవాలి కానీ అతి తెలివి తేటలు కావనీ,ఎదిగిన కొద్దీ ఒదగాలనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవలసిన నీతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి