సుప్రభాత కవిత ; -బృంద
ఓటమెరుగని గెలుపుకోసం
అలుపెరుగని  యుధ్ధం
గమ్యమే  గమనమైతే
పయనమే జీవితం.

కలలు శిలలై నిలిచినా
వెతలు కథలై మారినా
కలతలు కన్నీరై కరిగినా
రేపటికై ఎదురుచూపు

పచ్చి గాయాల బాధలు
గుచ్చి బాధలు పెడుతున్నా
నచ్చే మమతల మధురిమకై
పిచ్చిగా వెదికే మనసు

తరచి చూస్తే తడి ఆరని
తలపుల వేదనలు
తెరచి చూస్తే  కనపడని
అరచినా వినపడని పిలుపులు

ఎదలోన అలికిడి చేస్తూ
వదలక ప్రాణం నిలిపి
కదిలే కాలపు వేగానికి
మదిని సమాయత్తం చేస్తూ..

రేపన్న ఆశను నింపి
మాపును మాయతో మరపించి
దాపునే వుండి దయగా
కాపు కాసే కమ్మని వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు