సుప్రభాత కవిత ; - బృంద
ఎదురు చూసిన వెలుగు కిరణాలు
ఎదను తాకిన బంగరు తరుణాలు
ఎంత మురిసెనో అడుగున పొరలో
అంతరంగాన దాచిన అనుభూతులు

ఆర్తి నిండిన ఆవేదనలూ
అందుకున్న అండదండలూ
అరవిరిసిన అపేక్షలూ
ఆవిరైన అపురూప క్షణాలు

శిలగా మారిన కలలన్నీ
నిలిచి చూసే నిజాలు
నింగి తెచ్చే వెలుగు కోసం
వేచి వేసారిన కలతల చీకట్లు

గతమంత మరపు రాగా
వెతలన్నీ కరిగి పోగా
కథ మారే దశ ఎదో కనుగొని
సాగే జీవనరాగ సంచారం

కనుల నీరు చిందినా
నడచి కాలు కందినా
గడచిపోక తప్పనిదే
జీవితాన ప్రతిక్షణమూ...

గెలిచి తీరు ధ్యేయము
పోరు చేసే ధైర్యమూ
సడలిపోని నమ్మకము
వదిలిపోని ఆశలే....మన సైన్యము

అలుపు లేని అలల లాగా
గెలుపు కోసం  ఆరాటపడి
పొదుపు లేని ప్రయత్నాలతో
అదుపు లేని విజయం పొందమనే

అద్భుత సందేశం తెచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు