'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
========================================
క్రొత్త వృత్తములు.
============
91.
శ్రమిత శిఖండి -భ, స, భ, గ, గ.
యతి -7.
ఘోరపు కలిలో కూలితి నయ్యా!
చేరితి దరికిన్ శ్రేయము నీవా!
కోరితి పరమున్ గోపవిహారా!
సారెకు కొలుతున్ శ్రద్ధగ కృష్ణా!//
92.
కోశిత కుశలా -భ, స, స, గ, గ.
యతి -7
శక్తి నొసగుమా!జలజాతాక్షా!
ముక్తి నిడుమయా!భువనాధీశా!
భక్తిగ దలుతున్ వరదా!నిన్ సం
రక్తిగ గొలుతున్ లలితో కృష్ణా!//
93.
వరత్రా -భ, జ, జ, య.
యతి -6.
పావనమగున్ బద సేవలు సల్పన్
జీవనములో సిరి నీవెగ శౌరీ!
కావగదయా!కరిరాజ మురారీ!
చేవనిడుమా!సిరిరాయుడ! కృష్ణా!//

94.
దళ -భ, జ, స, య.
యతి -7
నిత్యము జపించి నిను దల్తు నయ్యా!
సత్యమును పల్కి చరింతు స్వామీ!
భృత్యునిగ చూడు కృపతోడ నన్నున్
నృత్యకుశలా!సుహృతుండ!కృష్ణా!//

95.
శ్రీయమునా -భ, త, మ, య.
యతి -7.
దుష్టల దండించి దుర్మార్గంబు ద్రోలన్
శిష్టుల రక్షించి శ్రేయంబీయ పృథ్విన్
వృష్టికులంబందు వేంచేయంగ ప్రేమన్
కష్టములన్ దీర్చి కాచేవాడ!కృష్ణా!//


కామెంట్‌లు