ఆటలు ఐక్యతకు నిదర్శనం ; -. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
 ఆటల ద్వారా ఐక్యతా స్ఫూర్తి పెంపొందుననీ, మానసిక శారీరక వికాసానికి క్రీడలనేవి నాంది పలుకుతాయని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీయూటిఎఫ్) ఏర్పడి ఏభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజాంలో జరిగిన యుటిఎఫ్ స్వర్ణోత్సవాలకు  ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజాం జి.సి.ఎస్.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన రాజాం నియోజకవర్గ స్థాయి క్రీడా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.  ఉపాధ్యాయులకు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్ మొదలగు
ఆటలతో పాటు ఏకపాత్రాభినయాలు, పాటలు, పద్యాలు, కవితలు మొదలగు సాంస్కృతిక పోటీలను నియోజకవర్గస్థాయిలో నిర్వహించుట మిక్కిలి అభినందనీయమని ఆయన కొనియాడారు. సెప్టెంబర్ నెలలో జిల్లా స్థాయిలోను, అక్టోబర్ నెలలో రాష్ట్రస్థాయిలోను ఈ పోటీలు కొనసాగుతున్నాయని వెంకటేశ్వర్లు తెలిపారు. డిసెంబర్ 14, 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేసారు.

యు.పి.ఎస్.ను అంగీకరించం

----------
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యుపిఎస్ స్కీమ్, మరో జిపిఎస్ వంటిదే తప్ప ఓపిఎస్ కు ప్రత్యామ్నాయం కానే కాదని ఆయన అన్నారు. కాంట్రిబ్యూషన్ లేని విధానమే ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించరాదని, బోధనకు మాత్రమే పరిమితం చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు. ఎం.టీ.ఎస్. ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి మోహనరావు, ఎస్.కిశోర్ కుమార్, జిల్లా అధ్యక్షులు రమేష్ పట్నాయక్, జె.వి.ఆర్.కె ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి పక్కి వాసు, బి.రామినాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ చుక్కా వైకుంఠరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మారెళ్ళ కృష్ణమూర్తి, ఎ.వెంకట అప్పల నాయుడు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గిరడ చంద్రశేఖర్ నాయుడు, గేదెల రమేష్, నియోజకవర్గంలో గల నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావు, బాలకృష్ణ, ఎం ప్రసాద్, జి.విష్ణుమూర్తి, వి.సత్యంనాయుడు, నిర్వహణా కమిటీసభ్యులు ఎం.శ్రీనివాసరావు, వై.భాస్కర్, బి.శ్రీనివాసరావు, పి.మురళి. డి.రామారావు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు