అందమైన రూపుతో
చిన్నిచిన్ని మెలికలతో
తెలుగు పౌరుషము చూపి
వెలుగు తలకట్టుతో....
అమ్మ లాటి అచ్చులతో
నాన్న లాటి హల్లులతో
కలబోసిన కమ్మని పదముగా
కడుపుతీపి నింపుకున్న....ప్రేమగా
మనసనుకున్నది మరుక్షణమే
భావసుమాలన్నిటినీ మాలగూర్చి
మురిపెముగా చూసుకుంటూ
మురిసిపోయే ముద్దులొలుకుతూ...
పాపనవ్వులా స్వఛ్ఛంగా
రూపుదాల్చిన అక్షరాలు
పదముల పక్కన చేరి వాక్యమై
హాయిగ భావం తెలిపుతూ...
బడిలో వరుసగ నిలిచిన
పసిపిల్లల్లా అమాయకంగా
ముద్దుగా కలిసి వుండి
ముచ్చటగా అనిపిస్తూ..
మాటకు మూలంగా
మనసును పరుస్తూ
మన వారి మధ్యన
మమతలు పంచుతూ
మౌనమైన మనసును
మాటల తోటలోకి చేయిపట్టి
తీసుకొచ్చి పరిచయం చేసి
ప్రపంచంలో గొప్పగా నిలబెట్టి
తెలివెలుగుల తేటలా
తేనె సోనల ఊటలా
వెండి వెన్నెల వానలా
కమ్మగా కురిసేటి
జిలుగు రవ్వలతో
వేయి కాంతులతో
వెలిగేటి తెలుగు..భాషకు
మేలిమి ముత్యాల నీరాజనాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి