సుప్రభాత కవిత ; - బృంద
ఊయలూపే కడలి మధ్యలో
ఊగుతున్న  అలల గుంపు
ఊపిరాపి  అబ్బురంగా
ఉదయభానుని చూసే వేళ..

చిరు తరగల పల్లకిపై
ఊరేగుతున్న చిన్ని కెరటం
ఉత్సాహంగా నురగల తెర తీసి
ఉరికి వస్తున్న వెలుగు కిరణాలను చూసెనేమో!

తీరం తాకిన సంబరమంతా
మోమున నవ్వుగ పూయించి
పాల నవ్వుల పరవశంలో
పరుగున వెనుకకు మరలేనేమో!

నులివెచ్చని వేకువ తాకిడికి
చలి విచ్చిన చిన్ని తరంగం
కను తెరచి బాలుని చూసి
కేరింతగ పసిపాపల్లే నవ్వెనేమో!

అంతరాన అనలము దాచిన అంబుధి
ఆకసాన అరుణుని రాకచూచి
ఆత్మీయభావముప్పొంగ
అంజలి ఘటించి ఆహ్వానించెనేమో!

రశ్మిమంతుడి ఆగమవేళ
రత్నాకరుని ఆనందహేల
‍రాగాలన్నీ కలగలిపి హోరున
రాగమాలికేదో ఆలపించువేళ

అతిశయముగ అరుదెంచు ఆదిత్యునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు