తరతరాల తెలంగాణ మాగాణి కవనం
అక్షర తూటాలు పేల్చిన ఓ ప్రజా కలం
విద్యార్థి దశ పూరించిన విప్లవ శంఖారావం
ఆత్మ గౌరవం కోసం జీవితమే తృణ ప్రాయం
కాళోజీ రూపం ఎగిసిపడే ఉద్యమ కెరటం..!
నిజాం నిరంకుశ గుండెల్లో అంకుశం
ఖండించెను రజాకార్ల వికృత ఉన్మాదం
యాసకు ప్రాణం పోసి భాషకు తొడిగె మకుటం
తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఘనుడు
నిరాడంబర యోగి తెలంగాణ వైతాళికుడు..!
పలుకుబడుల పదాలకు పీఠమేసిన వైనం
తెలంగాణ పోరు జోరు చైతన్య సమాహారం
ప్రజల గొడవ తన గొడవగా తలచిన నైజం
కోట్లాది గుండెల్లో కొలువైన ధిక్కార స్వరం
సామాన్యుడు దేవుడనే విశాల హృదయం !
అసమానత సహించని మానవతా దృక్పథం
పద్మ విభూషణ్ వరించిన వీర తెలంగాణ తేజం
అణగారిన బతుకులకండగా నిలిచిన బీజాక్షరం
అన్యాయం అడ్డంకుల నెదురించే ఉత్తుంగ తరంగం
జయహో నీ జయంతి తెలంగాణభాషా దినోత్సవం!
ఎక్కడ అధికారం పడగలిప్పి బుసకొడుతుందో
ఎప్పుడు పెత్తనం జడలు విప్పి చిందులేస్తుందో
కారణజన్ముడు కాలానికో కాళోజీ ఉదయించాలి
అంతర్ముఖ కుటిలత్వాల అంతమే పంతంగా
కణకణ మండే అక్షరసూరీడుగ నిప్పులు చెరగాలి !
(9 సెప్టెంబర్, కాళోజీ జయంతి సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి