ఒకూర్లో ఒకడుండేటోడు. వాడు పెద్ద పిసినారి. పదిపైసలు ఖర్చు పెట్టాలన్నా పదిసార్లు ఆలోచించేటోడు. వానికో రోజు పెద్ద జ్వరమొచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపిచ్చినా, ఎన్ని మందులు మింగినా కొంచం గూడా తగ్గలేదు. దాంతో ఒకరోజు దేవుని గుడికి పోయి “సామీ! సామీ! నాకు జ్వరం గనుక తగ్గిపోతే నీకు ఒక టెంకాయ కొడతాను. ఎట్లాగయినా తగ్గించు సామీ" అని వేడుకున్నాడు. కొద్దిరోజులకు వైద్యులిచ్చిన మందులు బాగా పని చేసి జ్వరం తగ్గిపోయింది.
జ్వరం తగ్గితే దేవునికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు గదా! దాంతో ఒక రోజు టెంకాయలంగడికి పోయి “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు "నాలుగు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని “మూడుకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "మూడు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న తాండ్రపాడుకు పో, ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి తాండ్రపాడులో టెంకాయలంగడికి చేరుకోని "ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “మూడు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా. వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రెండుకియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “రెండు రూపాయలకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న నన్నూరుకుపో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా మరో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి నన్నూరులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “రెండు రూపాయలు" అని చెప్పినాడు.
వీడు పెద్ద పిసినారోడుగదా... వాడడిగినంత ఇవ్వడం ఇష్టం లేక బేరం చేద్దామని "రూపాయకియ్యవా " అన్నాడు. ఆ మాటలకు వాడు "రూపాయకు ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న ఓర్వకల్లుకు పో. ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా పదిమైళ్ళు కిందామీదాపడి నదిచి ఓర్వకల్లులో టెంకాయలంగడికి చేరుకోని “ఒక టెంకాయెంత" అనడిగినాడు. వాడు “ఒక రూపాయ" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా... రూపాయ గూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక "వూరికే ఇయ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు “వూరికే ఈడ యాడా దొరకవుగానీ పక్కనే వున్న కాల్వబుగ్గకు పో ఆడ దొరుకుతాయి" అన్నాడు.
రూపాయ మిగులుతుందనేసరికి వాడు సంబరంగా ఇంకో పదిమైళ్ళు కిందామీదాపడి నడిచి కాల్వబుగ్గలో టెంకాయల తోటకి చేరుకోని “ఒక టెంకాయెంత" అన్నాడు. వాడు "డబ్బులేమీ వద్దులే పూరికే తీసుకో" అన్నాడు.
వీడు పెద్ద పిసినారోడు గదా ఇచ్చిందాన్ని పుచ్చుకోని సంతోషంగా తీసుకోని పోక "వూరికే రెండియ్యవా" అన్నాడు. ఆ మాటలకు వాడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు చూపించి “రెండేం ఖర్మ నీకెన్ని కావాలంటే అన్ని నువ్వే కోసుకో పో" అన్నాడు.
దాంతో వానికి ఆశ పుట్టి గబగబా టెంకాయచెట్టు దగ్గరికి పోయినాడు. అది ఒక పెద్ద బావి పక్కనే వుంది. నెమ్మదిగా చెట్టు ఎక్కసాగినాడు. టెంకాయ చెట్టు బాగా పొడుగ్గా, కొమ్మలు రెమ్మలు లేకుండా సక్కగా, నున్నగా వుంటాది గదా. దాంతో వాడు కొంచం దూరం ఎక్కి పట్టు తప్పి సర్రున జారి దభీమని బాయిలో పడినాడు. ఆ బాయికి మెట్లుగూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని అరుస్తా వుంటే టెంకాయలోడు వచ్చి గమ్మున చూస్తా కూచున్నాడు.
వాడు వాన్ని చూసి “బాబూ! బాబూ! నన్ను కాపాడవా" అనరిచినాడు.
దానికి వాడు చిరునవ్వు నవ్వి “టెంకాయలయితే వూరికే ఇస్తాగానీ... ఎవరినీ ఊరికే కాపాడను. వందరూపాయలు ఇచ్చేటట్టయితే చెప్పు కాపాడుతా" అన్నాడు. వాడు చేసేదేమీ లేక ఆఖరికి "సరే" అన్నాడు. దాంతో వాడు తాడేసి వాన్ని పైకి లాగి వందరూపాయలు తీసుకున్నాడు.
రూపాయకు చూసుకుంటే ఆఖరికి వందరూపాయలు పోయిందే అని బాధపడతా వాడు మళ్ళా నడుచుకుంటా ఉత్త చేతులతో ఇంటికి చేరుకున్నాడు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి