దొరికినావురా మిడతం బొట్లు ;-డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

 ఒకూర్లో ఒక యువకుడుండేటోడు. వాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతా ఎప్పుడూ మిడతలను పడతా వుండేటోడు. దాంతో అందరూ వాన్ని 'మిడతంబొట్లు' అని అడ్డపేరుతో పిలిచేటోళ్ళు. కానీ వాడు చానా తెలివైనోడు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. వానికి ఈ మధ్యనే పెండ్లయింది. వాని పెండ్లాం పండగకని పదైదు రోజుల ముందే పుట్టింటికి పోయింది. వీడు పండగకు ముందురోజు పొద్దున బైలుదేరినాడు. అప్పట్లో ఇప్పట్లా బస్సులూ, రైళ్ళూ వుండేటివి కాదుగదా... యాడికైనా కాలినడకనే. వాళ్ళత్తోళ్ళ వూరు చానా దూరం. దాంతో వాడు ఆడాడ ఆగుతా, అలసట తీర్చుకుంటా, వెంట తెచ్చుకున్నవి తింటా బాగా చీకటి పడే సమయానికి అత్తోళ్ళ వూరికి చేరుకున్నాడు. అప్పటికే బాగా నడిచీ నడిచీ అలసిపోవడంతో ఇంటి బైట్నే అరుగు మీద కూలబన్నాడు. రాత్రి కావడంతో తలుపులు మూసేసి వున్నాయి. తర్వాత రోజు పండగ కదా. అదీగాక కొత్త అల్లుడొస్తున్నాడు గదా.. అందుకని వాళ్ళత్త గారెలు చేద్దామని అప్పుడే నూనె పొయ్యి మీద పెట్టింది. గారె నూనెలో వేయగానే సుయ్‌మని చప్పుడు వచ్చింది. ఆ యువకుని ఒక తమాషా చేద్దామనిపించింది. దాంతో ఇంట్లోకి పోకుండా అరుగు మీదే కూచోని సుయ్‌మన్నప్పుడల్లా ఒకటీ... రెండు.. మూడు.. ఇట్లా వరుసగా లెక్కబెట్టసాగినాడు. మొత్తం అరవయ్యారయినాయి. అప్పుడు తలుపు తట్టి లోపలికి పోయినాడు.
అత్తామామా అంతా అల్లున్ని పలకరించి అన్నానికి కూచోమన్నారు. వాడు స్నానం చేసి కూచున్నాడు. అత్త వేడి వేడి అన్నం పెట్టి, పప్పూ, కూర, రసమూ పెట్టింది. వాడు అవి తింటా ''ఏమత్తా అన్నం, పప్పూ పెడ్తా వున్నావు గానీ గారెలు ఒక్కటి గూడా పెట్టడం లేదు'' అన్నాడు. ఆమె అదిరిపడి ''అదీ.. అల్లుడూ.. రేపు పండగ కదా... దేవునికి నైవేద్యం పెట్టి పెడదామని అటక మీద పెట్టినా. ఐనా నీకెట్లా తెలిసింది మేం గారెలు చేసినామని'' అనింది. దానికి వాడు నవ్వుతా ''ఏమత్తా.. మీ అల్లుడంటే అట్లాంటిట్లాంటి అవలాగాడనుకున్నావా... వేదాలు, పురాణాలు పిండి కొట్టి, జ్యోతిష్యాలు, శాస్త్రాలు నమిలి మింగేసినోడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కళ్ళు మూసుకోని చిటికెలో చెప్పేయగలడు. కావాలంటే నా మంత్రశక్తితో నువ్వు మొత్తం ఎన్ని గారెలు చేసినావో చెప్పేయనా'' అన్నాడు. ఆ మాటలకు అత్తా, మామా, పెండ్లాం ఆచ్చర్యంతో నోళ్ళు తెరిచి '' చెప్పు చూద్దాం'' అన్నారు. వాడు కళ్ళు మూసుకోని పెద్ద మాయగానిలా గాల్లో చేతులు తిప్పుతా, ఏదో ఆలోచిస్తున్నట్లు నటిస్తా, లెక్కలేస్తా '' అత్తా... నువ్వు చేసింది మొత్తం అరవయ్యారు. కావాలంటే పోయి లెక్కబెట్టుకోపో'' అన్నాడు. వెంటనే వాళ్ళు అటక మీదనుంచి గారెలతట్ట కిందికి దింపి లెక్కబెట్టి చూస్తే ఇంకేముంది... అల్లుడు చెప్పినట్టే మొత్తం అరవయ్యారున్నాయి. వాళ్ళు అల్లుని శక్తికి మురిసిపోయినారు. తరువాత రోజు అత్తామామలు కనబన్నోళ్ళందరినీ పిలిచి పిలిచి తమ అల్లుని తెలివితేటల గురించి చెప్పీ చెప్పీ మురిసిపోయినారు. దాంతో ఆనోటా ఈనోటా పడి వీధివీధంతా విషయం తెల్సిపోయింది.
తరువాత రోజు పొద్దున్నే ఆ వీధి చివర వుండే చాకలాయన ఇంటి ముందుకొచ్చి నిలబన్నాడు. ఆ యువకుడు బైటకు రాగానే ఎగిరి కాళ్ళ మీద బడి ''అయ్యా... నిన్న పొద్దుటి నుంచీ నా గాడిద యాడా కనబడ్డం లేదు. కనబడినోళ్ళందరినీ అడిగీ అడిగీ వూరంతా వెదికీ వెదికీ అలసిపోయినా... నువ్వు నీ మంత్రశక్తితో ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావని వీధివీధంతా చెప్పుకుంటా వున్నారు. ఎట్లాగైనా సరే నా గాడిద యాడుందో కొంచం కనుక్కోని చెప్పు. అంతవరకు నీ కాళ్ళు వొదిలేదే లేదు'' అన్నాడు పట్టినపట్టు విడవకుండా. ఆ మాటలింటానే వాని గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టయింది. ''ఒరే .. మిడతంబొట్లూ తెలీదంటే అత్తామామల ముందు మరియాద పోతాది. తెలుసంటే యాడుందో చెప్పాల. ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా వుంది గదరా నీ పరిస్థితి'' అని లోలోన అనుకుంటా కొంచం ఆలోచించి '' రేయ్‌ ... యాడికి పోతాది లేరా.. రేపు పొద్దునకంతా అదే మీ ఇంటికొస్తాది గానీ... నువ్వు పోయి హాయిగా కాలు మీద కాలేసుకోని పండుకోపో ... నా మంత్రశక్తితో అది యాడుందో కనుక్కుంటా'' అన్నాడు ఎట్లాగయినా వాని బారి నుంచి అప్పటికి తప్పించుకోవాలని. ఆ రోజు రాత్రి అందరూ పండుకున్నాక లేసి గాడిద కోసం వెదకసాగినాడు. ఆఖరికి అది పక్కవూరి పొలిమేరలో మేత మేస్తా కనబడింది. దాన్ని పట్టుకోని మట్టసంగా తోలుకోనొచ్చి ఆ చాకలాయన ఇంటి వెనుక పెరట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు.
చాకలాయన పొద్దున లేసి చూస్తే ఇంగేముంది వాడు చెప్పినట్టే గాడిద ఇంటి వెనుక గడ్డి మేస్తా కనబడింది. అంతే ఆ విషయం వూరువూరంతా నిమిషాల్లో పాకిపోయింది. ''అబ్బో... మంగమ్మగారి అల్లునికి గొప్ప శక్తులున్నాయంట. ఏ సంగతయినా సరే ఇట్టే చెప్పేస్తాడంట'' అని అందరూ అనుకోసాగినారు. మన జనాలంతా 'ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు... మనమూ పోయి ఒక రాయేస్తే పోలా' అనే రకం గదా... దాంతో ఆ వూరోళ్ళే గాక, చుట్టుపక్కల వూరోళ్ళు గూడా బండ్లు కట్టుకోని తిర్నాలలెక్క రాసాగినారు. ''నాయనా.. నా కూతురి పెండ్లెప్పుడవుతాది, సామీ... మావోనికి వుద్యోగం ఎప్పుడు దొరుకుతాది, అయ్యా... నా దరిద్రం పోయే దారి సెప్పు, తండ్రీ.. ఈసారి ఏ పంట వేస్తే విరగబడి కాస్తాది..'' ఇట్లా ఒకొక్కడు ఒకొక్కటి అడగడం మొదలుపెట్టినాడు. ఆ యువకుడు మామూలుగానే మాంచి తెలివైనోడు గదా... దాంతో బాగా ఆలోచించి జవాబులు సెప్పేటోడు. కొన్ని జరిగేవి. కొన్ని జరిగేవి కాదు. జరిగినోళ్ళు జరిగిన విషయం అందరికీ పడీ పడీ సెప్పేటోళ్ళు. జరగనోళ్ళు మన కర్మ ఇంతేలే.... అనుకోని వూరుకుండేటోళ్ళు. అట్లా కొన్ని రోజుల్లోనే మనోని కీర్తి ఇంటిగోడలు దాటి వూరి పొలిమేరలు దాటి, దేశాన్నేలే రాజు వరకూ పోయింది.
ఆరాజు దగ్గర ఒక రత్నాల హారముంది. అది తరతరాలుగా వాళ్ళ వంశంలో ఒకరి నుంచి ఒకరికి వస్తా వుంది. రాజుకి అదంటే చానా చానా ఇష్టం. పండుగలప్పుడు, ఉత్సవాలప్పుడు మెడలో వేసుకోని సంబరంగా తిరుగుతా వుంటాడు. అట్లాంటిది అది వున్నట్టుండి ఒకరోజు కనబడకుండా పోయింది. ఎంత వెదికినా, ఎంతమందిని విచారించినా దొరకలేదు. ఆ బాధతో రాజు మంచం పట్టేసినాడు. అప్పుడు అతనికి ఆ యువకుని గురించి తెలిసింది. వెంటనే సైనికులని పంపించినాడు. వాళ్ళు ఆ యువకుని పిలుచుకోని రాజు ముందు నిలబెట్టినారు.
రాజు వాని వైపు చూస్తా ''చూడు... సామీ... మా వంశంలో ఎప్పుడూ జరగని అపచారం నా కాలంలో జరిగింది. ఎవరైనా వింటే నవ్విపోతారు. అంతఃపురాన్నే కాపాడుకోలేనోడు జనాల్ని ఏం కాపాడతాడని. నీ గురించి చానా విన్నా. నువ్వే ఎట్లాగైనా సరే నా మర్యాద నిలబెట్టాల. నీకు రేప్పొద్దున వరకు సమయమిస్తా వున్నా... దొంగల్ని పడ్తివా... నీకు బంగారంతో అభిషేకం చేయించి, ఏనుగు మీదెక్కించి వూరువూరంతా వూరేగిస్తా... లేదంటివా నీ ముక్కో చెవో కోయించి గాడిద మీదెక్కించి వూరిబైటకి తన్ని తరిమేస్తా...'' అన్నాడు. ఆ మాటలకు శాస్త్రి గుండెలో రాయి పన్నట్లయింది. ''ఒరే... మిడతంబొట్లూ... తప్పించుకోని పారిపోదామా అంటే ఇది అంతఃపురం. చుట్టూ సైనికులున్నారు. ఇక తప్పదు. చెవో, ముక్కో ఏదో ఒకటి కోయించుకోవడం ఖాయంరా నువ్వు'' అనుకుంటా గదికి చేరుకోని అద్దం ముందు నిలబడి ''చెవా, ముక్కా... చెవా, ముక్కా'' అనుకోసాగినాడు చూసుకుంటా.
ఆ అంతఃపురంలో పని చేసే దాసీలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు వున్నారు. వాళ్ళు చూడ్డానికి చక్కని చుక్కల్లెక్క వుంటారు గానీ పెద్దదానికేమో ముక్కు పెద్దది. చిన్నదానికేమో చెవులు చిన్నవి. దాంతో అందరూ వాళ్ళని ఏయ్‌ చెవీ, ఏయ్‌ ముక్కూ అంటూ అడ్డపేర్లతో ఆట పట్టించేటోళ్ళు. వాళ్ళే ఆ రత్నాలహారాన్ని ఎవరూ లేని సమయంలో దొంగిలించింది. వాళ్ళకి ఆ యువకుడు వచ్చినప్పటి నుంచీ ఒగటే భయంగా వుంది. వూరువూరంతా వాని గొప్పతనం గురించి చెబుతా వుంటే వెన్నులో ఒణుకు వచ్చింది. దొరికామా వురిశిక్ష ఖాయం. దాంతో ఏం చేయాల్నో తోచక వాడు వున్న గది దగ్గరికి వచ్చి కిటికీలోంచి తొంగి చూసినారు. లోపల మనోడు ''చెవా, ముక్కా... చెవా, ముక్కా'' అని కొంచెం గట్టిగానే గొణుక్కుంటా వున్నాడు. ఆ మాటలినగానే వాళ్ళిద్దరూ అదిరిపన్నారు. ''అయ్యబాబోయ్‌... వీనికి మన సంగతి తెలిసిపోయినట్లుంది. రాజుకి గనుక చెబితే ఈ రోజుతో మనకి భూమ్మీద నూకలు చెల్లిపోయినట్లే... ఎట్లాగయినా సరే కాపాడి ఆపద నుంచి గట్టెక్కించమని అడుగుదాం'' అనుకుంటా ఇద్దరూ లోపలికి పోయి వాని కాళ్ళ మీద పన్నారు. ''అయ్యా ... బుద్ధి పొరపాటై ఈ పని చేసినాం. ఎట్లాగైనా సరే మమ్మల్ని కాపాడండి'' అంటూ, రత్నాలహారం తీసుకోనొచ్చి అతని చేతిలో పెట్టినారు. వాడు సరేనంటూ అందరూ పండుకున్నాక దాన్ని తీసుకోనిపోయి రాజు తోటలో ఒక చింతచెట్టు కింద గుంత తీసి కప్పి పెట్టినాడు.
తరువాతరోజు పొద్దున్నే సంబరంగా రాజు ముందుకి పోయినాడు. ''ఏమి... కనిపెట్టినావా'' అన్నాడు రాజు ఆతృతగా. ''హా.. మహారాజా... హారం కనబడుతోంది గానీ... దొంగ కనబడ్డం లేదు, బహుశా వాడు దేశం వదిలి పారిపోయినట్టున్నాడు'' అని చెప్పినాడు. ''సరే..సరే..దొంగదేముందిలేగానీ ముందు హారం సంగతి చెప్పు'' అన్నాడు రాజు.
వాడు ఏవేవో లెక్కలు వేస్తున్నట్లు గాల్లో గీతలు గీస్తా, అటూ ఇటూ తిరుగుతా ''మహారాజా ఈశాన్యం వైపున్న తోటలో ఏదో ఒక చింతచెట్టు కింద దాచినట్టు తెలుస్తా వుంది. భటుల్ని పంపించి అన్నింటి కిందా తవ్వించి చూడండి'' అని చెప్పినాడు. రాజు అట్లే అని పోయి ఒకొక్క చెట్టు కింద తవ్విస్తా ఆఖరికి ఆ యువకుడు దాచిన చింతచెట్టు దగ్గరికి చేరుకున్నాడు. భటులు ఆడ తవ్వి చూడగానే ధగధగలాడుతా హారం బైటపడింది. దాన్ని చూడగానే రాజు సంబరంతో పొంగిపోయినాడు. ఆనందంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. పరుగెత్తుకుంటా వచ్చి వాన్ని గట్టిగా కౌగిలించుకోని ''రేయ్ ... నువ్వు సామాన్యునివి కాదు. నీ అంత గొప్పోడు ముల్లోకాల్లోనూ యాడా వుండడు. నా పరువు, మరియాదా నిలబెట్టినావు'' అంటా అప్పటికప్పుడు పట్టపుటేనుగును తెప్పించి, పట్టుబట్టలు తొడిగించి, ముందూ వెనుకా తప్పెట్లు కొడతా వుంటే, వీధుల్లో అడుగడుగునా పూలు చల్లిస్తా, వూరువూరంతా దద్దరిల్లేటట్లు టపాకాయలు పేలిపిస్తా వూరేగించినాడు. ఆ తరువాత '' రేయ్... ఇకపై నువ్వు నాతోబాటు ఈన్నే వుండు. నిన్ను నా మంత్రుల్లో ఒకనిగా నియమించుకుంటావున్నా'' అని చెప్పినాడు. ఆ మాటల్తో వాని గుండె దడదడలాడింది. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. కాదనలేక సరే అని అట్లాగే వుండిపోయినాడు. రాజుకు తన తెలివితేటలతో సలహాలు ఇస్తా నెట్టుకు రాసాగినాడు. కానీ వానికి 'దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు ' అన్నట్టుగా ఎప్పుడు ఏ ఆపద ఏవైపు నుంచి వస్తుందో అని ఒగటే భయం. దాంతో ఎట్లాగైనా సరే దీన్నించి తప్పించుకోని ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాడు.
ఒకసారి రాజు ఆ యువకునితో కలిసి తోటలో పచార్లు చేయసాగినాడు. ఎట్లాగైనా బైటపడ్డానికి ఇదే సరైన సమయమనుకోని ''రాజా... ఎప్పటి నుంచో నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటావున్నా... నేను ఒక రోజు పోతా వుంటే ఒక ముని తపస్సు చేసుకుంటా కనబన్నాడు. అప్పుడే అటువైపు వచ్చిన ఒక పెద్దపులి ఆయనని చంపడానికి మీదకు దుంకింది. అది చూసి నేను ఏమాత్రం బెదపడకుండా నా దగ్గరున్న కట్టె తీసుకోని ఆ పులి మీదకు దుంకి దాన్ని ఆన్నించి తన్ని తరిమేసినా. దాంతో ఆ ముని నాకు కొన్ని అద్భుత శక్తులు ఇచ్చినాడు. కానీ అవి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పని చేస్తాయి. ఈ రోజుతో ఆ గడువు పూర్తవుతా వుంది. రేపటి నుంచీ నేనూ అందరిలాంటి మామూలు మానవున్నే కాబట్టి మీ దగ్గరిక కొలువు మానేసి నేనెవరో తెలీని కొత్తచోటుకు పోయి హాయిగా బ్రతుకుతా'' అన్నాడు.
అంతలో రాజు ఎదుట వున్న పూవు మీద ఏదో వాలింది. రాజు లటుక్కున దాన్ని పట్టుకోని గుప్పిట మూసి ''సరే... అలాగే.... కానీ రేపటి నుంచి గదా నీ శక్తులు మాయమయ్యేది. ఇదిగో ఇదే నీకు చివరి పరీక్ష. నా గుప్పిటలో ఏముందో చెప్పుకో. చెప్పావంటే నీవు మోయలేనంత బంగారమిచ్చి వీడ్కోలు పలుకుతా... లేదనుకో ఇంతవరకు నీకిచ్చినవన్నీ గూడా తీసేసుకోని కట్టుబట్టలతో వదులుతా'' అన్నాడు. వానికి ఎంత ఆలోచించినా అదేంటో అర్థం కాలేదు. దాంతో ''ఛీ ఛీ... అదృష్టం ఎప్పుడూ మనవైపే వుండదు. ఈ రోజుతో దొరికిపోయినావురా మిడతంబొట్లూ'' అని చిన్నగా గొణిగినాడు. పక్కనే వున్న రాజుకు ఆ మాటలు వినబన్నాయి. దాంతో అతను ఆచ్చర్యంగా ''శభాష్‌.... నిజంగా నీ శక్తి అద్భుతం. నేను పట్టింది మిడతనే'' అంటూ చేయి తెరిచి చూపించినాడు. ఆ యువకుడు తన అదృష్టానికి మురిసిపోయినాడు. రాజు తాను ముందే చెప్పినట్టు మోయలేనంత బంగారమిచ్చి వానికి వీడ్కోలు పలికినాడు. బ్రతుకు జీవుడా అనుకుంటా వాడు ఆ డబ్బంతా తీసుకోని రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా పెండ్లాం బిడ్డల్తో కలిసి తనను ఎవరూ గుర్తుపట్టని రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలేసుకోని కులాసాగా 
బతకసాగినాడు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం