న్యాయాలు -621
బహు నామను మరణ న్యాయము
******
బహు అనగా అధికము, సమృద్ధము, అనేకము, తఱచు, పెద్ద అధికముగా, పెద్దగా. నామను అనగా పేరు.మరణ అనగా మరణము,మృత్యువు, చావు, మృతి అనే అర్థాలు ఉన్నాయి.
మరణం అనేక రకాలుగా,అనే రూపాల్లో సంభవిస్తుందని అర్థము. అలాంటి మరణం గురించి"నూరేళ్ళయినా చావు తప్పదు- వెయ్యేళ్ళయినా వేరు తప్పదు" అంటుంటారు మన పెద్దవాళ్ళు.
మరి ఆ మరణం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడో ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా...
"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ!/ తస్మాద పరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి!!"
అనగా పుట్టిన వానికి మరణం తప్పదు.మరణించిన వానికి పుట్టుక తప్పదు.తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు."అంటాడా కృష్ణ పరమాత్మ.
అయితే మహాభారతంలో యక్షుడు యుధిష్ఠిరుడిని అడిగిన యక్ష ప్రశ్నల్లో ఈ మరణానికి సంబంధించిన ప్రశ్న కూడా వుండటం విశేషం.అదేమిటంటే " అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?". ఈ ప్రశ్నకు యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం "చుట్టు పక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా ... "నేను మాత్రం చావను" అనుకుంటాడు మనిషి.అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం" అని జవాబిస్తాడు ధర్మరాజు.అలా మానవ స్వభావాన్ని ఎంత నిశితంగా పరిశీలించి చెప్పాడో ఈ సమాధానం చూస్తేనే అర్థమవుతుంది.
నిజమే కదా! మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ప్రాణ పక్షిని గద్దలా తన్నుకు పోతుందో ...
విచ్చీ విచ్చని గర్భస్థ మొగ్గా ?పాలుగారని పసిప్రాయమాయవ్వనమా? ప్రౌఢమా?మధ్యస్థమావృద్ధాప్యమా?కులమా! తలమా?లింగ వర్గ భేద భావమా...ఇవన్నీ మరణానికి స్మరణకు రావు...సాక్షీభూతంగా నిలిచిన మనిషికి చావన్నది తన దరికి రాదన్న భ్రమ మాయా పొరలా తనువు మాయమయ్యేంత వరకు కొనసాగుతూనే వుంటుంది.
మృత్యు వాత పడ్డ వారితో పెనవేసుకున్న పేగు బంధము పడే బాధ అంతా ఇంతా కాదు. ఒకానొక సారి తన బిడ్డను కోల్పోయిన తల్లి బుద్ధుడిని తన బిడ్డను బ్రతికించమని వేడుకుంటుంది.చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని నువ్వులు తెమ్మని చెబుతాడా గౌతముడు. ఆ తల్లి తాను ఇల్లిల్లూ తిరిగినప్పుడు తెలుసుకుంటుంది. "మృత్యు వాత పడని ఇల్లంటూ ఉండదని,జాతస్య మరణం ధృవం అని". అంటే మరణం అనివార్యం.కాకపోతే వయో భేదాన్ని బట్టి దుంఖోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక మరణం ఎలా సంభవిస్తుందో ఎవరూ చెప్పలేం.అయితే ఎవరినో ఒకరిని, ఏదో ఒక సందర్భం, సంఘటనను నెపంగా చేయడం మరణానికి మహా సరదా. "అలా జరగకుంటే బాగుండు.ఫలానా వాళ్ళే కారకులు ...ఇలా రకరకాలుగా వ్యాఖ్యానింప జేస్తుంది.
నీరా,నిప్పా,చాలా,ఆకాశమా,అగాధమా ? పంచభూతాల ద్వారా సంభవింప జేస్తుంది . పలు రూపాల్లో ప్రాణాలు తీస్తుంది.
అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన నగర గీతంలో "మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులా" రాసిన ఈ వాక్యం అందరినీ ఉలిక్కిపడేలా, అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. "ఒంటి స్తంభం మేడలో దాగిన వచ్చే మృత్యువును ఎవరూ ఆపలేరు " అంటారు.
అలాగని మనం అజాగ్రత్తగా ఉండలేం కదా! అలా ఉండకూడదు కూడా.ఉట్టి కట్టుకుని ఈ ప్రపంచంలో ఎవరూ స్థిరంగా మరణం లేకుండా ఉండరు. ఈ "బహు నామను మరణ న్యాయము" ద్వారా ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే. మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన అతిథులం.అశాశ్వతులం.కాబట్టి మనకున్న , మనకిచ్చిన ప్రతి క్షణాన్ని,నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరుల సహాయనికై, సేవకై ఉపయోగించిన ప్రతి క్షణం వందల వేల రెట్లుగా మనల్ని ఈ నేలపై చిరంజీవులను చేస్తుంది.అది తెలుసుకొని నదిలా, సెలయేరులా సాగిపోదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి