చీకటి తెరలను చీల్చగ వచ్చిన
వెలుగుల ఖడ్గము నీవేనా??
నింగిని చుక్కల మెరుపును ముంచే
వెలుతురు సంద్రం నీవేనా?
మబ్బుల మందను భయపెట్టే
కిరణపు బెత్తం నీదేనా?
అడవిని కమ్మిన తరువుల నీడకు
తోడయే స్నేహ హస్తం నీదేనా?
కమ్మిన కలతల తిమిరపు నీడను
తరిమే తెగువ నీదేనా?
మేదినిని మేలుకొలుపుతూ మోగే
నిశ్శబ్ద నగారా నీవేనా?
జగతికి సుగతిని చేకూర్చే
జగద్రక్షకుడివి నీవేనా?
దిక్కుల తాకే వేయిచేతుల
బాహుబలివి నీవేనా?
గగనపు దారిని ఘనమై కదిలే
కాంతిరథం నీదేనా?
అగమ్య గోచరమైన అలజడి బాపే
అశుతోశుడివి నీవేనా?
కొండవెనుక అండగ వెలిసి
మంటను మంచుగ మార్చే కరుణ నీదేనా?
దారి తెలియక నిలిచిన మనసుకు అందే తెలియని సాయం నీదేనా?
మాయలో ముంచి మాయక వుంచే
గాయపు మర్మం నీవేనా?
మళ్ళీ మళ్ళీ మరుసటి రోజులా
తరలి వచ్చి మురిపించే వేకువ నీవేనా?
నీకై వేచిన మది పాడే
; -🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి