అన్నీమంచిరోజులే!.. డా.గంగిశెట్టి శివకుమార్.

 మాధవుడు,గోవిందుడు బాల్యస్నేహితులు.వయసొచ్చేదాకా గురుకులంలో చదువుకుని గ్రామంచేరారు.మాధవుడు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు.గోవిందుడు గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్న చిల్లర అంగడిని కొనసాగిద్దామనుకున్నాడు.వాళ్ళతో మాధవుడి బామ్మ",పురోహితుడ్ని అడిగి మంచిరోజు చూసుకుని మీ మీ వృత్తుల్నిప్రారంభించండి మీ తండ్రులకు విశ్రాంతి యివ్వండి."అన్నది..అలాగే నని మాధవుడు గోవిందుడూ కలిసి పురోహితుని వద్దకు వెళ్ళారు. పురోహితుడు పంచాంగం చూసి వారికి మంచిరోజు చెప్పాడు.ఆరోజునుంచి ఇద్దరూ వారి వారి పనులను చూసుకోసాగారు.                           ఇద్దరూ బాల్యమిత్రులే అయినప్పటికీ వారిద్దరి మనస్థత్వాల్లో మార్పు ఉంది.గోవిందుడిది శ్రమించే స్వభావంకాదు.తను చేసే పనిమీద శ్రద్ధా లేదు.అదీగాక అత్యాశతో ధరలు  పెంచేవాడు.గోవిందుడి తండ్రి ఇదంతా  గమనించి  గోవిందుడ్ని చేరబిలిచి ఇది సరయిన పద్దతి కాదని హెచ్చరించాడు.గోవిందుడు తండ్రిమాటలు పెడచెవిన పెట్టాడు.క్రమంగా గోవిందుడి వ్యాపారం తగ్గిపోయింది.నష్టాలు పెరిగిపోయాయి.అయినా గోవిందుడిలో మార్పుకలగలేదు.                               ఇక మాధవుడి విషయాని కొస్తే  వ్యవసాయం ప్రారంభించినరోజు నుంచే  ఒళ్ళు వంచి పనిచేయడం ప్రారంభించాడు.అతివృష్టి,అనావృష్టిలను లెక్కచేయలేదు.వ్యవసాయంలో ఎదురయ్యే అన్ని విధాల కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు.మనసులో ధైర్యం పట్టుదల వదలలేదు.కాలంగడిచే కొద్దీ లాభాలు రావడం మొదలయ్యాయి..మరికొంతభూమిని కొని వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడం ప్రారంభించాడు.                                             వ్యాపారం దెబ్బతినడంవలన గోవిందుడు  దిగులుపడుతున్నాడని తెలిసిఒకరోజు మాధవుడు గోవిందుని చూడవచ్చాడు. అప్పుడు గోవిందుడు,"ఇదేమిటీ ఇద్దరం ఒకే పురోహితుని వద్దకు వెళ్ళాం.ఆయనే మనిద్దరికి మంచిరోజు చెప్పారు.ఆయన చెప్పినట్లే చేసి ప్రారంభించాం.నీవేమో వృద్ధిలోకి వస్తున్నావు.నేనేమో రోజురోజుకి దిగజారిపోతున్నాను" అన్నాడు."ఈ విషయాలు నాకంత వివరంగా తెలియవు.ఏదైనా పని ప్రారంభించాలంటే మంచిరోజు చూసి ప్రారంభించాలనే మా పెద్దలమాటను పాటించాను అంతే!అన్నాడు. మాధవుడు ఆమాటా ఈ మాటా మాట్లాడికొద్దిసేపటితరవాత వెళ్ళిపోయాడు.ఇదంతా పక్కగదిలో వున్నగోవిందుడితండ్రి  విన్నాడు.తరవాత గోవిందుడితో ఇలా అన్నాడు "జ్యోతిషం అనేది ఖగోళశాస్త్రవిజ్ఞానానికి సంబంధించినది.అంతే తప్ప మూఢనమ్మకంకాదు.ఒక పని మంచిఫలితం ఇవ్వడానికిమూహూర్తాన్ని మనం నిర్ణయించుకుని దాన్ని మహిమగలదిగా భావిస్తాం.అందువల్ల ఆ పని చేయడానికి మనకు తగినంత ధైర్యం లభిస్తుంది. ఏ పనినయినా మనం చిత్తశుద్ధితో చేస్తే మంచిఫలితం తప్పక వస్తుంది. రోజుల్లో చెడ్డవి,మంచివి  అని ప్రత్యేకంగావుండవు.కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా పని చేస్తే అన్నీ మంచిరోజులే !అయితే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పడు ఆయాకాలాలను,ఆనాటి వాతావరణ పరిస్థితుల అనుకూలనాలను ముందుచూపుతో అంచనా వేయవలిసివుంటుంది.దీనికి ఖగోళశాస్ర్తం పనికి వస్తుంది.ఆ విధంగా  మంచిరోజు,చెడ్డరోజు లాంటివి క్రమంగా ఏర్పడ్డాయి.నేను నిన్ను ముందుగానే వ్యాపారవిషయమై హెచ్చరించాను.నువు వినలేదు.వ్యాపారంలోఅశ్రద్ధ పనికిరాదు. మోసం,అత్యాశ తాత్కాలిక ప్రయోజనం యివ్వవచ్చుకానీ నిజాయితీ అనేది ఖాతాదారులనమ్మకాన్ని పెంచి శాశ్వత ప్రయోజనాలను యిస్తుంది.దీనికి ఉదాహరణ శ్రమను నమ్ముకున్న నీ మిత్రుడే."అంటూ హితబోధ చేశాడు.తండ్రిమాటలు గోవిందుడిమీద బాగా పని చేశాయి.ఇంతకాలం ఆయన సలహాలను పెడచెవినపెట్టినందుకు గోవిందుడు పశ్చాత్తాపపడ్డాడు.ఆ తరవాత గోవిందుడు మిత్రుడైన మాధవుడ్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీని,కష్టాన్ని నమ్ముకుని వృద్ధిలోకి వచ్చాడు. మాధవుడు కూడ గోవిందునికి తగిన సలహాలిస్తూ మిత్రుడి వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డాడు.    
కామెంట్‌లు