నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం.:- ప్రమోద్ ఆవంచ - 7013272452

 ఊరు అంటే....
పండు వెన్నెల ఇంటి ముంగిట చల్లినంత,విచ్చిన పూరేకు నవ్వినంత,మనసుకొక గిలిగింత,వయసుకొక 
కోరికంత, కల్మషం లేని మనుషుల బంధమంత, రైతులు 
తమ గుండెల నిండా పరుచుకున్న పచ్చని పంటంత, వ్యవసాయంపై వాళ్ళకు ఉన్న నమ్మకమంత,శ్రమయే
జీవితంగా బతుకుతున్న పశువులంత, వృద్దాప్యంలో 
ఊరడింత.... ఊరు...మన ఊరు..ఆ ఊరిలోనే పుడుతాం,ఆ ఊరిలోనే పెరుగుతాం,ఆ ఊరిలో చదువుకుంటాం, కొందరు ఉద్యోగరీత్యా,మరి కొందరు ఉపాధి కోసం ఇతర ఊర్లల్లకు వలస వెళుతుంటారు ఇంకొందరు వ్యవసాయమో, ఇతర కుల వృత్తులు  చేసుకుంటో ఊర్లోనే ఉండిపోతారు.వీళ్ళందరినీ మీ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో అడగండి...మాకు తెలియదు అని చెపుతారు.ఆ ఊర్లో ఉన్న దేవాలయం ఎప్పుడు కట్టించారో కూడా వాళ్ళకు తెలియదు.కారణం ఊరి గురించిన పాత విషయాలు తెలిసిన,ఆ జ్ఞాపకాలను పంచుకునే ఆ తరం కనుమరుగవుతుంది.కొంతమంది పాత తరం వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు,తెలిసినా జ్ఞాపకం ఉండకపోవచ్చు, వయసు రీత్యా అది సహజం.....కట్ చేస్తే....
                    విభజిత 'నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం' గ్రంధావిష్కరణ కార్యక్రమం నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో వైభవంగా జరిగింది.తెలంగాణ సారస్వత పరిషత్తు తెలంగాణాలోనీ ముప్పై మూడు జిల్లాల నైసర్గిక స్వరూపం,రాజకీయ,సాంస్కృతిక,విధ్యా,పత్రికా,కథ,పాటపర్యాటక,బాల, సినిమా,రంగాల గురించి రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా,సమగ్ర సమాచారాన్ని పొందుపరచిన పుస్తకాలను ప్రచురిస్తుంది.దీనికి సంబంధించి జిల్లాకు చెందిన ప్రముఖుల నుంచి సరైన సమాచారం క్రోడీకరించిన వ్యాసాలు సంపాదించేందుకు
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్ష, కార్యదర్శులు 
నానా వ్యయ ప్రయాసలు పడ్డారు.దాని గురించి ముందు ముందు ప్రస్తావిస్తాను.ఏమైతేనేమి ఇప్పటి వరకు ఇరవై జిల్లాల సమగ్ర సమాచార సంపూర్ణ గ్రంధాలను వెలువరించారు.ఇక ప్రస్తుతానికి వస్తే నాలుగు వందల ముప్పై నాలుగు పేజీల నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం' పుస్తకం  కాంపిటేటివ్ పరీక్షలు రాసే విధ్యార్థులకు కరదీపిక అని చెప్పవచ్చు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ఊరు...ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాలను, ఆ ఊరి సమగ్ర నైసర్గిక స్వరూపాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి పుస్తకం చాలా అవసరం అనిపించింది.ఈ పుస్తకంలో నల్గొండ జిల్లాకు 
సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందించడంలో 
తెలంగాణ సారస్వత పరిషత్తు విజయం సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు.ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంత తేలికైన విషయం కాదు.అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని, 'నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం' పుస్తకాన్ని పూర్తి చేసి ఆవిష్కరించారు....కట్ చేస్తే...
                 ఉదయం తొమ్మిది గంటలు... నేను, రమేష్ 
సాగర్ రింగ్ రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర వెంకట రమణ గురించి ఎదురు చూస్తున్నాం.పది నిమిషాలు గడిచాయి.
రమేష్ మంత్రి గారి ఫోన్ లో బిజీగా ఉన్నాడు.రమణ 
ప్రభుత్వ వాహనంలో వచ్చి మా దగ్గర ఆపాడు.ఆయనతో పాటు మా ఈనాడు ట్యాంక్ బండ్ రిపోర్టర్ రాములు కూడా ఉన్నాడు.నేను ఉదయంలో పనిచేసేటప్పుడు రాములు ఈనాడు ట్యాంక్ బండ్ రిపోర్టర్ గా పనిచేసేవాడు.మల్కాపూర్ దగ్గర ఆర్య రెస్టారెంట్లో లో 
టిఫిన్ చేసి నల్గొండకు వెళ్ళాం.మేం వెళ్ళే సరికే ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 
పుస్తక ఆవిష్కరణ పూర్తి చేసి ప్రసంగిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి గారు గత యాభై ఏళ్లుగా పత్రికా రంగంలో 
కొనసాగుతూ, జర్నలిస్టుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు.ఆయనది నార్కెట్ పల్లి 
పక్కన పల్లెపాడ్ గ్రామం.ఆయన ప్రసంగం అనంతరం 
తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి చెన్నయ్య 
రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ కమీషనర్, మరియు 
సీపిఆర్ఓ అయిన కన్నెకంటి వెంకటరమణ గారిని 
స్టేజీ మీదకు ఆహ్వానించారు.రమణ వాళ్ళ ఊరు పిట్టంపల్లి.మా ఊరైన చర్లపల్లి వెనుక వైపు ఉంటుంది.
వెంకటరమణ ప్రసంగం చాలా షార్ట్ గా, అర్థవంతంగా 
చెప్పదలచుకున్న అంశాలను సూటిగా, స్పష్టంగా మాట్లాడారు.ప్రముఖ సాహితీవేత్త శ్రీరంగాచారి గారి ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది.ఆయన ఊరు చందుపట్ల.చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం 
వైస్ ఛాన్సలర్ ఆచార్య సూర్యాదనుంజయ గారి స్పీచ్ 
కూడా చాలా బాగుంది.ఆమెది మిల్లుల మిర్యాలగూడ.
ఈ మాట ఆమె ప్రసంగంలో చెప్పింది.ఇంకా ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు సాగి కమలాకర్ శర్మ,వెల్దండి శ్రీధర్, డాక్టర్ సాగర్ల సత్తయ్య,పున్న అంజయ్య, డాక్టర్ బిన్నూరి 
మనోహరి, డాక్టర్ సుజాత శేఖర్, డాక్టర్ తండు కృష్ణ చైతన్య,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
                కార్యక్రమం చివర్లో నాకు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్ష కార్యదర్శులు నన్ను శాలువా కప్పి మెమోంటొతో సన్మానించారు.నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం' పుస్తకం లో నేను రాసిన మూడు ఆర్టికల్స్ ని
ప్రచురించారు.ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
నాకోసం నా బాల్య మిత్రులు రాపోలు వెంకటేష్, బ్రహ్మయ్య, కరుణాకర్ లతో పాటు కవి మిత్రుడు మోత్కూరు శ్రీనివాస్ కూడా వచ్చారు.నల్గొండలో రక్తదానం చేస్తూ, చాలా మందికి సేవలు అందిస్తున్న నా 
ఫార్మా మిత్రుడు చంద్రశేఖర్ కూడా వచ్చాడు.ఇంకో మిత్రుడు, జర్నలిస్టు గుడిపాటి శ్రీనివాస్ తో, ఇరవై అయిదేళ్ళ స్నేహం.తను కూడా మాతో పాటు కార్యక్రమం
అయ్యేంత వరకు ఉన్నాడు....
                           
కామెంట్‌లు