అరటి తొక్క :  - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  ఒక ఊరిలో సోము అని ఒక పిల్లోడు వుండేటోడు. వాడు చానా అల్లరోడు. ఎవరి మాటా వినేటోడు కాదు. తన పనులతో ఎప్పుడూ అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి సోము పొద్దున్నే అరటిపండు తిని తొక్క విసిరి వీధిలో పడేశాడు. అది సక్కగా పోయి దారి నడుమ పడింది.  కాసేపటికి ఒక పిల్లవాడు అటువైపు ఏదో పనుండి వేగంగా ఉరుక్కుంటా వచ్చాడు. పాపం... ఆ పిల్లోడు ఆ అరటిపండు తొక్కను చూసుకోకుండా దానిమీద కాలేశాడు. అంతే... అసలే అది నున్నని తారు రోడ్డు. దాంతో ఆ పిల్లోడు సర్రున జారుకుంటా ముందుకు పోయాడు.  సరిగ్గా అదే సమయంలోనే ఆ పిల్లోని ముందు ఒక ముసలాయన వేగంగా సైకిలు తొక్కుకుంటా వచ్చాడు. ఆ పిల్లోడు సర్రున జారుకుంటా రావడం చూసి ఎక్కడ ఢీ కొట్టుకుంటాడో ఏమా అని భయపడి ... ఒక్కసారిగా సైకిలు పక్కకు తిప్పాడు. అక్కడ ఒక గాడిద హాయిగా కాగితాలు తింటా వుంది. ఆ ముసలాయన సైకిలు పక్కకు తిప్పాడు కదా ... అది సర్రున పోయి దభీమని ఆ గాడిదకు గుద్దుకుంది.
అంతే... ఆ దెబ్బకు గాడిద అదిరిపడి వేగంగా ముందుకు వురికింది. అక్కడ ఒకాయన గోడకు నిచ్చన వేసుకొని పైకి ఎక్కి సున్నం కొడతా వున్నాడు. గాడిద పోయి ఆ నిచ్చనకు తగిలింది. దాంతో నిచ్చన అటూఇటూ ఊగింది. దానిమీద నిలబడిన ఆయన పైనుంచి ఎక్కడ పడిపోతానో ఏమో అని భయపడి చేతిలోని సున్నం డబ్బా వదిలేసి కింద పడకుండా గోడను గట్టిగా పట్టుకున్నాడు.
ఆయన నిచ్చన మీదనుంచి సున్నండబ్బా వదిలేశాడు గదా ... అది సరిగ్గా అప్పుడే అటువైపు వచ్చిన ఒక దున్నపోతు మీద దభీమని పడింది. దాంతో పైనుంచి ఏమి పడిందో ఏమో అని భయపడిన ఆ దున్నపోతు వేగంగా అక్కన్నుంచి సర్రున ముందుకు వురికింది. 
అప్పుడే సోము బడికి పోవడానికి సంచీ తగిలించుకోని తెల్లని బట్టలతో బైటకు వచ్చాడు. వేగంగా అటువైపు దూసుకొని వచ్చిన ఆ దున్నపోతుని చూసి ఆడిరిపడ్డాడు. అది ఎక్కడ తనను ఢీ కొడుతుందో ఏమో అని భయపడి వెనక్కు తిరిగి ఇంటివైపు వురకసాగాడు. ఇంటిముందు వీధిలోకి విసిరేసిన అరటితొక్క పడివుంది గదా... సోము ఆ కంగారులో చూసుకోక దాని మీద కాలేశాడు. అంతే... సోము జర్రున జారుకుంటా ముందుకు పోయాడు. అక్కడ ఒక పెద్ద మురికి కాలవ వుంది. దభీమని పోయి దానిలో పడ్డాడు. తెల్లని బట్టలు కంపు కొడతా నల్లగా బురద బురద అయ్యాయి. అది చూసి జనాలందరూ పడీ పడీ నవ్వసాగారు. సోము తలవంచుకొని బైటికి వచ్చాడు.  రోడ్డుమీద అరటితొక్క పకపకపక నవ్వుతా కనబడింది.
*******

కామెంట్‌లు