కొంచెం భరోసా!!:- -గద్వాల సోమన్న,-9966414580
మంచి చెపితే మారిపోతాను
వెలుగు దారిలో నడిచిపోతాను
నైతిక విలువలు ప్రబోధిస్తే
జ్యోతి రీతిలో వెలిగిపోతాను

కొంచెం నమ్మకం నాకిస్తే
కొండలు పిండి పిండి చేసేస్తాను
నింగిని చాపలా చుట్టేస్తాను
చుక్కలన్నీ  కోసుకొస్తాను

గుండెలో ధైర్యాన్ని నింపితే
సాహస పనులెన్నొ తలపెడుతాను
రికార్డులను బద్దలుకొడుతాను
చరిత్రను తిరిగి రాసేస్తాను

కాసింత ఆదర్శం చూపిస్తే
మహనీయున్ని నేనౌతాను
చిటికెడంత నాకు స్ఫూర్తినిస్తే
ఆకాశాన్ని అందుకొంటాను


కామెంట్‌లు