సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-686 వేణ్యాకాశ న్యాయము
*****
వేణి అనగా జడ, ప్రవాహము,నది, వెల్లువ. ఆకాశ అనగా ఆకాశము,నింగి,అంతరిక్షము ,మేఘద్వారము,విహాయసము, శూన్యము, గగనము,అంబరము, సర్వమంగళము అనే అర్థాలు ఉన్నాయి.
 వేణ్యాకాశము అనగా జడలా అల్లుకున్న  ఆకాశమంటి అనంతమైన నదుల సంగమం అని అర్థము.
ఈ నదుల సంగమములో ముఖ్యంగా త్రివేణీ సంగమము చాలా  ప్రసిద్ధి చెందినది. ఇందులో శుక్ల, కృష్ణ, లోహిత వర్ణములుగల గంగా,యమునా, సరస్వతీ నదులు కలిసి ఆ జలమున చక్కని ఒక క్రొత్త రంగు ఏర్పడటం గమనించవచ్చు.
ఈ మూడు ముచ్చటైన జడగా అల్లుకుని ప్రవహించడం  ఒకానొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయంగా జనులు భక్తి భావంతో వాటిని కొలుస్తూ వుంటారు.
దీనినే ఆధ్యాత్మిక వాదులు అమృత వాహినిగా, అద్భుతమైన దానిగా అభివర్ణిస్తూ త్రివర్ణములును,త్రి గుణములును గల త్రిమూర్తిలోక స్వరూపుడు సచ్చిదానంద మయుడును, జ్యోతి స్వరూపుడును,స్వయం ప్రకాశకుడు అగు విరాట్పురుషుడి రూపంలో వెలుగొందునని చెబుతుంటారు.
 ఇక ఈ మూడు నదుల గురించి కొంత తెలుసుకుందాము.
భారత దేశంలోని ప్రధానమైన నదులలో గంగానది ఒకటి.భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన చరిత్ర గంగానదితో అవినాభావంగా ముడిపడి వుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంగ అనగా నీరు అని అర్థము. ఈ గంగను గంగమ్మ తల్లి అనీ, గంగాభవాని అని పిలుస్తుంటారు.
ఇక హిందువుల ఆచారం ప్రకారం గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే సమస్త పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకము. గంగాజలం చనిపోయే ముందు తాగితే వారికి స్వర్గప్రాప్తి నిశ్చయమని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.
భగీరథుడు తపస్సు చేసి శివుని జటాజూటంలోని గంగను భువికి రప్పించాడు. ఈ నది శుక్ల వర్ణంలో వుంటుంది అనగా తెలుపు రంగులో ఉంటుంది.
ఈ గంగానదికి ఉపనది యమునా నది. దీనిని యమునోత్రి ,సూర్య తనయ అని కూడా అంటారు.ఈ నది నీటి రంగు కృష్ణ వర్ణం అనగా నీలిరంగు లేదా నలుపు రంగు.ఇది గంగానదికి ఎడమవైపున పుట్టి, కుడివైపు నుండి కలుస్తుంది.
ఇక మూడో నది సరస్వతీ నది. ఇది చాలా పురాతనమైన నది . హిందూ పురాణాలలో, ఋగ్వేదంలో ఈ నది గురించి చెప్పబడింది.ఈ నది లోహిత వర్ణంలో అంటే ఎరుపు రంగులో ఉంటుంది .
 ఈ మూడు నదుల సంగమం అలహాబాద్ లోని ప్రయాగలో మనకు కనిపిస్తుంది.
అయితే ఈ నదులకు మూడు దశలు ఉంటాయని చెబుతూ వాటిని  మానవుని జీవిత దశలతో పోల్చారు. అది ఒకటి బాల్య దశ:- అనగా పర్వత మార్గంలో నది ప్రవహించే దశ.రెండు.యవ్వన దశ:- అనగా నది మైదానంలో ప్రవహించే దశ.మూడు.వృద్ధాప్య దశ:- అనగా వంకలు, డొంకలు తిరుగుతూ సముద్రంలో కలిసే ముందు దశ.
 మరి వేణ్యాకాశ న్యాయము ద్వారా మన పెద్దవాళ్ళు చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే  మూడు నదుల వర్ణాలు  అనంతమైన విశ్వంలో  ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఆ మూడు వర్ణాల గుణాల మిశ్రమం అంటారు. వేర్వేరు కార్యాకలాపాలు లేదా ప్రక్రియల సమయంలో ఈ మూడు గుణాలలో ఏదో ఒకటి ఆధిపత్యం చెలాయిస్తుంది అంటారు.
ఇందులో శుక్ల లేదా తెలుపు స్వచ్ఛత, విధేయత మరియు పవిత్రతను సూచిస్తుంది. అలాగే కృష్ణ వర్ణం లేదా నలుపు హుందాతనం, అధికారాన్ని సూచిస్తుంది. ఇక లోహిత లేదా ఎరుపు రంగు త్యాగము,ప్రమాదము, ధైర్యంతో ముడిపడి ఉంది.కార్యాచరణ, ప్రేమ, మరియు సంతోషంతో ముడిపడి ఉంటుంది. సూర్యోదయం ఎరుపు రంగులో ఉండి సంతోషాన్ని కలిగించడం అందరికీ తెలిసిందే.
 ఈ విధంగా  ప్రతి మనిషిలో త్రివేణి సంగమంలా  ఈ గుణాలు అల్లుకు పోయి ప్రవహిస్తూ వున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మన పెద్దలు ఈ "వేణ్యాకాశ న్యాయము"ను ఉదాహరణగా చెప్పడం జరిగింది.
అలాగే త్రిమూర్తి, త్రిగుణాలు,త్రివర్ణాలతో స్వయం ప్రకాశకుడై వెలుగొందుతున్న  విరాట్ పురుషుని కొలిచి జీవితాన్ని ముక్తి పదంలో నడిపించుకొమ్మని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.
 వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసేది ఒకటే జీవితాన్ని  సచ్ఛీలత,సహాయత,సమరస భావనతో ఫలవంతం చేసుకోవాలని.అది తెలుసుకున్న మనం ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం.

కామెంట్‌లు