కొత్తూరు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

 పుస్తక పఠనం అనే అభిరుచిని కలిగియుంటే వ్యక్తిత్వ వికాసంతో కూడిన పరిపూర్ణమైన జీవితాన్ని సాధించగలమని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ నిర్దేశాల మేరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో రెండవరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. వారోత్సవాలలో భాగంగా నేటి పుస్తకప్రదర్శన కార్యక్రమాన్ని తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ  మహాత్మాగాంధీ తదితర దేశభక్తులంతా గ్రంథాలయాలకు వెళ్ళి ప్రపంచ విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదివి, ప్రజలకు అవగాహనపర్చి, చైతన్యం కలిగించి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించారని అన్నారు. ఆనాడు గ్రంథాలయ ఉద్యమాలు నడిపి మనకు ఈ విజ్ఞాన కేంద్రాలనందించిన ఎన్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య వంటి మహనీయులు కృషిని ఆయన గుర్తు చేసారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయాధికారిణి తెంబూరు ఇందిర మాట్లాడుతూ మంచి పుస్తకానికి మించిన తోడు లేదని, చేతిలో పుస్తకం ఉంటే ఒంటరితనం అనే ఆలోచనే ఉండదని, పుస్తకాలు చదవడంవలన దేశ సంస్కృతి సంప్రదాయాలనేవి తెలుసుకుని సామాజిక బాధ్యతను గుర్తెరిగేలా చేస్తాయని అన్నారు. ఈరోజు పుస్తకప్రదర్శనతో పాటు మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సదస్సు కూడా ఉండడంతో తిరుమలరావు డ్రగ్స్ రహిత సమాజం అనే స్వీయకవితను వినిపించి, ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఇదే వేదికపై గ్రంథాలయానికి పలు పుస్తకాలను తిరుమలరావు బహూకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పౌరులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు