సునంద భాషితం:-- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-690-
వ్యపదేశి న్యాయము
   ****
వ్యపదేశ అనగా సందేశము, వంశము, కపటము, కీర్తి, ప్రతిష్ట అనే అర్థాలు ఉన్నాయి.
వ్యపదేశీ అంటే సందేశం ఇచ్చుట అని అర్థము.
ఆ సందేశంలో ఒకే వస్తువు నందు రెండు ధర్మములను ఆరోపించుట.అనగా ఏమిటో ఇక్కడ ఆధ్యాత్మిక వాదులు ఇచ్చిన ఉదాహరణను చూద్దాం. 
సమస్త బ్రహ్మాండము నందు అంతర్వర్తియైన పరమాత్మ ఒకచోట జీవుడుగా అంటే సమస్త జీవుల రూపంలో,మరో విధంగా దేవుడుగానూ ఉన్నాడని అంటారు.అంటే అందరికీ తెలుసు దైవం సర్వాంతర్యామి అని.
మరొక ఉదాహరణ  ఒకే వ్యక్తి ఒక చోట ఒక రకంగా మరో చోట మరొక విధంగా పిలవబడటం అనగా ఫలానా వారింటి పెద్ద కుమార్తె మెట్టినింటిలో చిన్న కోడలుగానూ అలాగే చిన్న కొడుకు మరొకరి ఇంటిలో పెద్ద అల్లుడుగానూ పిలువ బడుతూ వుంటారు.అంటే  వ్యక్తి ఒకరే స్థానమును బట్టి చేసే ధర్మం స్థాయిలో మార్పు కలుగుతుంది.కుటుంబంలో వ్యక్తి జ్యేష్టుడా,మధ్యముడా కనిష్ఠుడా...ఏదో ఒక స్థానం వుంటుంది.
ఇక వారే సమాజంలోకి వెళితే వారి స్థాయి, ధర్మము రకరకాలుగా మారుతుంది.
ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఏమిటంటే ఒక సంఖ్య లేదా అంకె విలువను చూసినట్లయితే దానికి సహజ విలువతో పాటు స్థాన విలువ వుండటం మనందరికీ తెలిసిందే. అంకె లేదా సంఖ్య ఒకటే కానీ స్థానాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దాని ధర్మాలు మారుతాయి.తద్వారా ఫలితాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.
 మరి ఈ న్యాయమును "వ్యపదేశీ న్యాయము"అంటున్నామెందుకని  సందేహం మన మదిలో మెదులుతూ వుంటుంది.కానీ పెద్దవాళ్ళు సృష్టించిన ప్రతి న్యాయములో ఓ ముఖ్యాంశం, ప్రత్యేకమైన అంతరార్థం యిమిడి వుంటుందనేది మనకు తెలుసు.
వ్యపదేశీ అంటేనే సందేశం ఇవ్వడం. వస్తువు లేదా వ్యక్తి ఒకరే అయినా ధర్మాలు సందర్భానుసారంగా మారిపోతాయనే విషయాన్ని గ్రహించేలా చేయడం. అలా మారుతున్నప్పుడు మానసికంగా సిద్ధంగా వుండి దానిని ఆనందంగా స్వీకరించడమనేది నేర్చుకోవాలి.ఇదే "వ్యపదేశీ న్యాయము" ఇచ్చే  గొప్ప సందేశం.దీనిని గ్రహించి తదనుగుణంగా మసలుకుందాం.
వురిమళ్ల సునంద, ఖమ్మం

కామెంట్‌లు