ఛందస్సు అలంకారాలతో గాఢమైన శ్లోకాలు రాయొచ్చు.
కాచి వడబోసిన జీవిత పరమార్థాలను కథల రూపంలో చెప్పొచ్చు.
ప్రపంచాన్ని అచ్చంగా ఒక నవలగా ఆవిష్కరించొచ్చు.
బాలల కవితలు రాయటం మాత్రం అంత సుళువు కాదు.
అందుకు పువ్వులాంటి పిల్లల మనసు తెలిసుండాలి. తారల్లా మెరిసే వాళ్ళ కళ్ళ ఊసులు గ్రహించ గలగాలి. బాలల పసి భాష అర్ధం చేసుకోగలగాలి. తాను బాలుడై పోవాలి. తనకో వసి వాడని పసి మనసు వుండాలి.
ఇంకా చెప్పాలంటే పిల్లలకు ఒక తాతయి వుండాలి.
డా. కె ఎల్వీ ప్రసాద్ గారు చిరంజీవి ఆన్షికి తాతగారు.
అసలు కన్నా వడ్డీ ముద్దoటారు. మూడో తరం మురిపాలు మనకు తెలియంది కాదు.
మనవరాలంటే ఆకులు రాలే శిశిరంలోకి హరితాన్ని మోసుకు వచ్చే వసంతం.
మనవరాలంటే ఉడిగిపోయిన జవసత్వాలను ఉరకలెత్తించే ఉత్సాహం.
మనవరాలంటే అద్వితీయమైన అనుభూతులను ఇచ్చే అపురూపమైన వరం.
డా. ప్రసాద్ గారి అదృష్టం కొద్దీ ఒక్కగానొక్క ముద్దులొలికే మనవరాలు ఆన్షి వారి సంరక్షణలోనే పెరుగుతోంది.
తాతగారిని రెండో బాల్యంలోకి లాక్కెళ్ళటానికి అంతకన్నా ఇంకేo కావాలి.
ఆన్షి ఎదుగుతున్న క్రమంలో ప్రతి జ్ఞాపకాన్ని వారు చిత్రాల రూపంలో పదిల పరుచు కున్నారు.
ఆన్షికి మంచి చెడులు నేర్పిస్తున్న సందర్భంలో పదిల పరుచుకున్న చిత్రాలను జోడిస్తూ ప్రతి సంఘటనను సరళమైన బాలల భాషలో అపురూపమైన కవితలుగా మలిచారు.
చిలక పలుకులను చిలక పలుకులంత తియ్యగా అందించారు.
దంత వైద్యులైన డా. ప్రసాద్ గారు ‘సంకేతం’ అంటూ పాపాయి పాల పళ్ళ పరిజ్ఞానంతో చిలక పలుకులు ప్రారంభించి ‘ఆరోగ్య భాషణం’ లో ఆరోగ్య సూత్రాలు చెబుతూ ‘అందరికీ ఆరోగ్య’ సూచనలతో ముగించటం బావుంది.
ఈ చిలక పలుకులన్నీ తరిచి చూస్తే పసితనంలో పిల్లలకు నేర్పాల్సిన అంశాలెన్నో కనిపించాయి ఇందులో.
‘కరోనా కాలం’ లో స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన పిల్లలను ఇంట్లో కట్టడి చేయటంలో వారు పడ్డ వ్యథను పిల్లల భాషలో బాగా వ్యక్తం చేసారు.
‘పరిమళం’ పోగొట్ట్టుకున్న తెలుగు పదాలను చెబుతూ ‘అక్షర మాల’ లో తెలుగు భాష పైన ప్రేమను ఇనుమడింప చేశారు.
‘మొలక’ లోనే పర్యావరణాసక్తిని పెంచుతూ చెట్ల ‘ఉనికి’ ని వివరించటం, ‘నారికేళం’ ఉపయోగాలు విశదీకరించటం, ‘ప్లాస్టిక్కును తరిమేద్దా’మంటూ కాలుష్య నివారణ అవసరాన్ని చెప్పటం ప్రశంసనీయంగా వుంది.
పిల్లల నవ్వులను పోలిన ‘పువ్వుల’ వివరణ అభినందనీయం.
మన జాతిపిత గాంధీ తాత గురించి పిల్లలకు తెలియ చెప్పాల్సిన అవసరాన్ని ‘వేళ్ళు’ పూరించింది.
పిల్లలెంతో ఇష్టంగా జరుపుకునే ‘పుట్టిన రోజంటే’ పండుగను శోభాయమానంగా చిత్రించారు.
పిల్లలు తెలుసుకోవాల్సిన అనుబంధాలు ఆత్మీయతలు ‘తెలుసుకోండి’ లో హృద్యంగా వివరించారు.
గతమై పోయిన ‘ఉత్తరాలు’, అదృశ్యమై పోయిన పోస్ట్ మాన్ కోసం ‘ఎదురుచూపు’ బాధనిపించాయి.
‘యుద్ధం’ పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించేట్టుగా వుంది.
చిలక పలుకులు ఆసాంతమూ ప్రాధమిక విద్యా పాఠ్యాంశాలుగా వుండదగిన అనేక అంశాలతో కూడుకుని వుంది.
‘అమ్మ బొమ్మ’యిన లక్కపిడత ఆన్షి అందాలు పుస్తకo అందాన్ని రెట్టింపు చేసాయి.
‘ఇష్టం’ లో ఆన్షి పరంగా చెప్పిన తాతంటే ఇష్టాన్ని, చిరంజీవి ఆన్షి చిరకాలం కొనసాగించాలని కోరుకుంటూ తన కోసం తాతగారు సృష్టించిన ఈ అమూల్యమైన చిలక పలుకులను స్వయంగా ఆచరించి పుస్తకాన్ని సార్ధకం చేయాలని ఆశిస్తూ చిట్టి తల్లికి నా ప్రేమాశీస్సులు అందచేస్తున్నాను.
***




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి