ఓ మనసా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చీకట్లో ఉండేవు
తలపుల్లో ముంచేవు
మరుగుల మాటునీవు
తపనల చోటునీవు               ||చీకటిలో||

కనపడక దాగేవు
ఉనికిని చాటేవు
ఆఙ్ఞలు ఇచ్చేవు
అమలును పరిచేవు

పనులను చేయించేవు
చైతన్యమును చూపెంచేవు
ప్రాణమును నిలబెట్టేవు
జీవనమును గడిపించేవు          ||చీకటిలో||

ఉన్నవి వదిలేసేవు
లేనివి కోరుకొనేవు
చేసేది చెప్పకుండేవు
చెప్పింది చేయకుండేవు

సుఖమును ఆశించేవు
సూక్తులను వల్లెవేసేవు
మంచితనము చూపించేవు
మాలిన్యము దాచిపెట్టేవు         ||చీకటిలో||

కంటితో వీక్షించేవు
కన్నవాటిని కాంక్షించేవు
కర్ణాలతో ఆలకించేవు
శ్రావ్యతని క్రోలుకునేవు

శ్వాసను తీసుకునేవు
సుగంధాలను కోరేవు
నోటితో ఆరగించేవు
రుచులను ఆశించేవు             ||చీకటిలో||

మోవులను బిగించేవు
మాట్లాడక మెలిగేవు
మర్మాలను దాచేవు
మౌనమును దాల్చేవు

దేహపెత్తనము సాగించేవు
అధికారము చలాయించేవు
గొప్పలను పలువురికిచెప్పేవు
మెప్పులను వినగనిష్టపడేవు    ||చీకటిలో||

అందాలను చూడగోరేవు
ఆనందాలను ఆస్వాదించేవు
ప్రేమాభిమానాలు పొందేవుపంచేవు
బాంధవ్యాలను పెంచుకొనేవుకొనసాగించేవు

చైతన్యమును చూపించేవు
విఙ్ఞానమును అందించేవు
నిండుజీవితము గడపాలనుకునేవు
నూరేళ్ళబ్రతుకు కోరేవునీవు       ||చీకట్లో||


కామెంట్‌లు