న్యాయాలు -658
మార్జాల అభ్యంజన న్యాయము
*****
మార్జాల అనగా పిల్లి కస్తూరిమృగము.అభ్యంజనం అనగా నూనె మున్నగు వానిచే శరీరమునకు మర్థన చేసుకుని స్నానం చేయుట, కంటికి కాటుక పెట్టుకొనుట అనే అర్థాలు ఉన్నాయి.
"మార్జాల అభ్యంజనము"లో మనం ముందుగా అభ్యంజనం అంటే ఏమిటో , దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
అభ్యంజనం అనగా నూనె వ్రాసుకుని , తలకు మర్దనా చేసుకుని ,ఆ తర్వాత ఆవనూనె వంటికి మర్థనా చేసుకోవడం. అలా ఆవనూనె మరియు నువ్వుల నూనె వేడి చేసి తలకు రాసుకొని మర్దనా చేయాలి. ఆ తర్వాత నువ్వుల నూనెతో నలుగుపిండిని శరీరానికి పట్టించే వారు. నలుగు పెట్టి మర్దనా చేయడం వల్ల శరీరంపైన ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒంట్లోని కొవ్వు కూడా కరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది.ఇలా అభ్యంజనం చేసి తలంటి స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు.
మరి మార్జాలం అభ్యంజన స్నానం చేస్తుందా? అసలు దానికి స్నానం అంటే ఇష్టం ఉంటుందా ?అంటే లేదనే చెప్పాలి. పశువులు, జంతువుల్లో కొన్ని మాత్రమే స్నానాలు చేస్తాయి.అలా చేసిన వాటి గురించి కూడా తెలుసుకుందాం.
పక్షుల్లో పిట్టలు ( ఊర పిచ్చుక), కాకులు చేయడం చూస్తుంటాం. బుజ్జి పిట్టలు చిన్న చిన్న నీటి తావుల వద్దకు చేరి నీళ్ళలో అటూ ఇటూ రెక్కలు తడుపుకుంటూ, తలను చటుక్కున ముంచి తీసి స్నానం చేయడం చూస్తుంటే భలే ముచ్చటగా కనిపిస్తుంది.
ఇక 'కాకి స్నానం' అనేది జాతీయంగా చెబుతుంటారు. కాకి నీటి మడుగులో మొదట ఒక వైపు రెక్కను అందులో తడిచీ తడవనట్లు ముంచి తీసి వెంటనే తడి లేకుండా విదిలించుకుంటుంది. అలాగే రెండోవైపు రెక్కను కూడా నీటిలో ముంచి తీసి తడిని విదిలించుకుని స్నానం అయిందనిపిస్తుంది. మరది పూర్తిగా స్నానం చేసినట్లా అంటే ప్రశ్నార్ధకమే? అంటే ఏదో చేశానని అనిపించుకోవడమే కనిపిస్తుంది.అలా మేము స్నానం చేశాం అనిపించుకొనేలా మాత్రమే కొందరు చేసే స్నానాలను 'కాక స్నానం' అంటుంటారు.
ఇక జంతువుల స్నానంలో ఏనుగు స్నానం, మహిష స్నానం అనేవి ఉన్నాయి. ఏనుగులు స్నానం చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అవి స్నానంలో ఆనందాన్ని పొందుతాయి. గంటలు గంటలు నీళ్లలో చేరి తొండంతో ఎత్తుకుని పోసుకుంటూ శుభ్రంగా చేస్తాయి.అయితే అంతటితో ఆగితే బాగుండేది.నీళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే కొమ్మలు విరిచి ఆకులను,మట్టి దుమ్ము లేపి తొండంతో ఒంటిమీద చల్లుకుంటాయి. స్నానం చేసిన ప్రయోజనమే లేకుండాపోతుంది.
మరి ఇలాంటి గజ స్నానాలు చేసి వారు మనలో కూడా కనిపిస్తారు. ఎంతో శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఉతకని బట్టలో,ముతక బట్టలో వేసుకున్న వారిని చూసినప్పుడు తప్పకుండా మనకు ఈ 'ఏనుగు స్నానం' గుర్తొచ్చి పెదవులపై నువ్వు మెరుస్తుంది.
కుక్కలు స్నానాలని ప్రత్యేకంగా చేయవు కానీ అవసరమైతే నీటిలో ఈదుతాయి.అందుకే ఓ సామెత కూడా వుంది "కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు".
ఇక ఆవులు,గేదెల స్నానాలు. ఆవు యజమాని చేయిస్తే తప్ప తనంత తానుగా నీటిలోకి దిగడం మనకు కనబడదు. ఇక "గేదె లేదా మహిష స్నానం" చూస్తూ ఉంటే నవ్వూ, కోపం, చిరాకు కలుగుతాయి.ఎక్కువగా ఎండా కాలంలో నీటి మడుగుల్లోకి, చెరువుల్లోకి చేరుతాయి.అటూ ఇటూ పొర్లి హాయిగా గంటలు గంటలు నీళ్లలో ఉండి బయటకు వస్తాయి.కానీ వాటి వంటి మీద మురికి మాత్రం అస్సలు పోదు. పైగా గాలి గట్టిగా వస్తేనో ఎండ బాగా కొడితేనో చూడాలి వాటి అవస్థ. స్నానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఒంటికున్న బురద ఎండి చిట్లినట్టయి బాధ కలగడం ఖాయం.
ఇలాంటి వారు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొందరు ఉంటారు. స్నానం చేసినా చేయనట్ఠే ఎక్కడ మురికి అక్కడే వుంటుంది.ఆ తర్వాత యిబ్బంది పడతారు .
ఇలా రకరకాల స్నానాలను చూసిన మన పెద్దవాళ్ళు మనుషులు చేసే స్నానాలకు ఆయా పేర్లు పెట్టారన్న మాట.
మరి "మార్జాల అభ్యంజనం" విషయానికి వస్తే అయ్యే పనేనా ?అది నిజమా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే పిల్లికి స్నానం అంటేనే ఇష్టం ఉండదు. దానికిక మర్థనాలా? కాని పని. ఇలాంటి వారు కూడా మన మధ్యలో ఉంటారు. వారికి స్నానం అంటే అస్సలు ఇష్టం ఉండదు. బలవంతపు స్నానాల గురించి చెప్పుకునేటప్ఫుడు ఈ "మార్జాల అభ్యంజనం" తప్పకుండా గుర్తుకు వస్తుంది.
ఇదండీ! "మార్జాల అభ్యంజన న్యాయం" అంటే.భలే సరదాగా వుంది కదండీ!
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి