సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -678
విహంగమ గతి న్యాయము
*****
విహంగమ అనగా విహంగము, పక్షి,పులుగు,శకుంతము,శకునము. గతి అనగా కదలిక, గమనము, ప్రవేశము, అవకాశము,,చర్య,చీరుట, భాగ్యము, పరిస్థితి,దశ, మార్గము, ఆశ్రయము,వెడలుట, యాత్ర, సంఘటన, నక్షత్ర మార్గము,గ్రహ గమనము, జ్ఞానము, పునర్జన్మ,జీవన దశ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
 విహంగమ గతి అనగా  పక్షి మార్గము అని అర్థము. పక్షి తన సహచర పక్షులతో ఎలా ప్రయాణిస్తుంది? దాని ఆహారపు అలవాట్లేవి? పక్షి మార్గము లేదా "విహంగమ గతి" అంటే ఏమిటో వివరాల్లోకి వెళ్ళే ముందు వాటికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
 జీవక్రియలో ఆకలి అనేది వుంటుందని మనకు తెలుసు. అది కేవలం మనుషులకే కాదు.పశుపక్ష్యాదులన్నింటికీ వుంటుంది.మరి ఆకాశంలో ఎగిరే పక్షులు ఆహారాన్ని  పసిగట్టడానికి వివిధ రకాల పద్దతులు అనుసరిస్తాయి. అలా అనుసరించడానికి ముఖ్యంగా వాటికి దృష్టి, కదలిక, స్పర్శ,వాసన మరియు శబ్దం మొదలైనవి ఉపకరిస్తాయి.
దృష్టి విషయానికి వస్తే పక్షుల కళ్ళు అత్యంత పదునైనవి.వివిధ రంగులను గుర్తించగలవు.గ్రద్ద కళ్ళు మానవుని కళ్ళకంటే 4,5 రెట్లు శక్తివంతమైన చూపును కలిగి ఉంటుంది.
ఇక కదలిక విషయంలో పక్షుల కళ్ళు అతి చిన్న కదలికలను కూడా గుర్తిస్తాయి.అందుకే మన ముందు వాలిన పక్షిని పట్టుకోబోవడమో లేదా అవసరానికి కదలడమో చేస్తే వెంటనే తుర్రుమని ఎగిరిపోవడం మనందరికీ తెలిసిందే. చేపల్ని తినే పక్షులు నీటిలోపల చేపల కదలికను స్పష్టంగా చూసి అవి పైకి తేలేలోపు చటుక్కున పట్టుకుంటాయి.
 వాసన పసిగట్టే పక్షులు కొన్ని ఉన్నాయి.అవి కుళ్ళిపోయిన మాంసం వాసన భూమి లోపల ఉన్న పురుగులు, కీటకాల వాసన పసిగట్టి వాటిని తవ్వి తింటాయి.
శబ్దం విషయానికి వస్తే గుడ్లగూబలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుందని,అవి చిన్న చిన్న శబ్దాలను పసిగట్టి ఆహారాన్ని పట్టుకుంటాయి.అలాగే కోకిలలు కూడా పురుగుల శబ్దాలను వినడం ద్వారా పురుగులను వేటాడి తింటాయి.
ఇలా ప్రతిపక్షికి ప్రత్యేకమైన ఆహార అలవాట్లతో పాటు ఇలా ఆహారాన్ని సంపాదించుకునే తెలివితేటలు సహజంగానే వుంటుంది.
 ఇక అసలు విషయానికి వస్తే విహంగ గతి అనగా పక్షి మార్గము గురించి చెప్పాలంటే ఉదయాస్తమయాల్లో పక్షులు బారులు కట్టి వెళ్ళే తీరు అద్భుతంగా ఉంటుంది.ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అవి ముఖ్యంగా వి (V ) ఆకారంలో ఎగరడం చూస్తుంటాం. దీన్ని శాస్త్రవేత్తలు సైతం నిశితంగా పరిశీలించి అలా ఎగరడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పారు. ఒకటి V ఆకారంలో ప్రయాణించడం వల్ల వెనుక ఉన్న పక్షులకు ముందు ఉన్న పక్షులు అడ్డులేకుండా ఉంటాయి.అలా అడ్డులేక పోవడం వల్ల ముందు వెళ్ళే పక్షి గమనం చివరి పక్షి వరకు కనిపిస్తుంది.
ఇక రెండో కారణం పక్షి రెక్కలు ఆడించినప్పుడు గాలి కిందికి తోయబడుతుంది.అలా రెక్కల కింద ఉన్న గాలి కిందికి వెళుతుంది.రెక్కల పక్కన గాలి పైకి వస్తుంది. అలా వచ్చేటపుడు ఒక వాయు గుండం లాంటి ప్రవాహం సృష్టించబడుతుందట.ఇలా పుట్టిన వాయుగుండం మొదటి పక్షి రెక్కల చివర్లో ఉంటుంది. ఇలా ముందు వెళ్తున్న పక్షి సృష్టించిన వాయుగుండం వలన గాలి నిరోధకత తగ్గి వెనుక ఉన్న పక్షి ఎక్కువగా శ్రమ పడకుండానే తక్కువ శక్తిని ఖర్చు చేసి ఎగర గలుగుతుంది. అయితే ముందు పక్షి శక్తి మీద మిగిలిన పక్షుల గమనం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అవి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరొక పక్షి ముందుకు వచ్చి ముందు ఉన్న పక్షిని వెనక్కి పంపుతుందట.అలా పక్షులు ఒక దాని కొకటి సహకరించుకుంటూ అలవోకగా ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాయన్న మాట.
ఇలా  మానవుల కన్న ఎన్నో రెట్లు చిన్నవైన పక్షులు సమూహంగా ప్రయాణం చేసేటప్పుడు ఈవిధమైన ఏర్పాటు చేసుకోవడం,సహకరించుకోవడంలో వాటిలోని ఐక్యత ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.
 మరి మానవులమైన మనం అలా వుంటున్నామా? అందుకే కాబోలు మన పెద్దవాళ్ళు ఈ విహంగమ గతి న్యాయాన్ని పరిచయం చేస్తూ అలా ఉండాలని చెప్పారు.
 ఇక విహంగమ గతి అనేది నిత్య జీవితంలో చేసే యోగాలో కూడా ఉండటం విశేషం. అయితే దీనిని ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే పరమాత్మతో ఆత్మను ఏకం చేయడం అని అంటారు.అంటే ఇక్కడ ఆత్మ పక్షి లాంటిది దాని తుది గతి లేదా దశ పరమాత్మలో లీనం అవడం.అలా పరమాత్మతో ఆత్మను ఏకం చేయడానికి యోగాలో "విహంగమ గతి" అనేది ఒక సమగ్ర మార్గంగా పనిచేస్తుందనీ, ప్రతిరోజూ రెండు సార్లు కేవలం పది నిమిషాల ధ్యానాన్ని అంకిత భావంతో చేయాలని అంటారు. ఇలా చేయడం వల్ల శరీరం మనస్సు మరియు ఆత్మ అనేక ప్రయోజనాలు పొందుతుందనీ, ఇది ఆధ్యాత్మిక మరియు శారీరక శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరమైన విధామని చెప్పడం జరిగింది.
 ఏది ఏమైనా ఈ "విహంగమ గతి న్యాయము"ద్వారా మనం సమూహంగా మరియు వ్యక్తిగతంగా ఎలా వుండాలో తెలుసుకోగలిగాం. అలా వుండటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!


కామెంట్‌లు