న్యాయాలు-645
మహార్ణవ యుగచ్ఛిద్ర కూర్మ గ్రీవా ప్రవేశ న్యాయము
******
మహార్ణవ అనగా గొప్ప ,ఆర్ణవ అనగా సముద్రము,అంతులేని చాలా లోతుగలది.యుగ అనగా కృతాది యుగము,జత,బార,బండికాడి.ఛిద్ర బెజ్జము,దోషము,న్యూనత.కూర్మ అనగా తాబేలు,ఉప వాయువులలో రెండవది.గ్రీవా మెడ,మెడ వెనుక భాగము.ప్రవేశ అనగా లోనికి వచ్చుట అని అర్థము.
మహా సముద్రంలోని రెండు తరంగముల మధ్య నెటు పోలేక అలల తాకిడికి అలిసిపోయిన తాబేలు చివరకు ఎలాగైతేనేం ఒకానొక తరంగమొచ్చే సమయంలో మెడ బయటికి పెట్టి చూసి, మళ్ళీ లోపలికి అనుకుంటూ మరో అలలోకి ప్రవేశిస్తూ చివరికి ధైర్యం తెచ్చుకుని స్వేచ్చగా ప్రయాణం చేయడమని అర్థము.
ఆ విధంగానే పురుషార్థి యైన వ్యక్తి అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అన్వేషణలో నిరంతమవు సంసార చక్రమునందు పడిపోతాడు .అలా అనేక జన్మముల కావల జనన మరణాలకు సంబంధించిన ప్రత్యేక లేదా విశిష్టమైన సుఖ దుఃఖాల స్పర్శతో ఖిన్నుడైపోతూ బాహ్యాంతఃకరణ గణమును, విషయముల బారిన పడకుండా వాటిని అరికట్టి వివేకిగానూ ,ఆత్మానాత్మ వివేకము గలవాడుగానూ మారును అని భావము.
మరి అందులోని విషయాలను ఒకసారి చర్చించుకుందామా...
మనిషన్నాక సంసార సాగరాన్ని ఈదక తప్పదు. ఈదేటప్పుడు అలల్లాంటి కష్టాల తాకిడీ తప్పదు. ఆ తాకిడికి విపరీతంగా అలిసిపోయినప్పుడు ఒకోసారి జీవశ్చవమైనంతగా బాధ మనసును మెలి పెడుతుంది. అదిగో ఆ సమయంలోనే అంతర్మధనం మొదలవుతుంది.ఎందుకు ఈ పుట్టుక?ఏమిటి అవస్థలు? ఈ జననమరణాలు సుఖదుఃఖాలు? అని అనిపిస్తుంది.అలా అనుకుంటూనే విపరీతమైన వేదనతో కుమిలి పోతూనే ఆ కష్టాల,బాధల సమూహము నుండి బయట పడేందుకు లోలోపల అంతరాత్మ వివేకంతో,విచక్షణతో ఆలోచించేలా చేస్తుంది.
అలా అంతరాత్మ ప్రబోధంతో వాటన్నింటినీ అధిగమిస్తూ వుంటే ఆత్మానాత్మ అనగా ఆత్మ పరమాత్మ అనే వివేకము కలుగుతుంది. వాటిని జయించేందుకు యుద్దానికి సిద్దం అవుతుంది. అలా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశం లభిస్తుంది.ఇక ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం వెన్నంటి తోడుగా ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు.అనుకున్నది సాధించ వచ్చు.
మన పెద్దవాళ్ళు దీనిని ఓ న్యాయముగా ఉదహరిస్తూ 'మహా సముద్రంలో పోటెత్తిన రెండు అలల మధ్య ప్రయాణం చేసే తాబేలును మనిషితో పోల్చడం జరిగింది.
మనందరికీ తెలిసిందే.ఏ మనిషి జీవితం వడ్డించిన విస్తరి, పరచిన పూల పాన్పు కాదు. వివాహ బంధంతో ముడిపడితే సంసారం ఒక సాగరమవుతుంది.అవేమీ వద్దనుకుంటే ప్రపంచమే మహార్ణవం అవుతుంది.రెండింటిలో అలసినా ,సొలసినా ఆయుష్షు ఉన్నంత వరకూ ఈదక తప్పని పయోనిధులే.
తీరమెక్కడా? అని తాబేలులా మెడ బయటికి తీస్తూ, లోపలికి ముడుస్తూ ధైర్యాన్నీ పట్టుదలను,మనో దేహంలో ప్రతి క్షణం నింపుకుని పయనించే సమయంలో తాత్విక చింతన, ఆధ్యాత్మిక దోరణి మనసును ఆవహిస్తుంది. "పునరపి జననం పునరపి మరణం" అనే భావనతో పాటు సుఖ దుఃఖాల స్పర్శ కలవర పెడుతుంటుంది.అయినా అంతరాత్మ ఆ వేదనల సమూహము నుండి ఎప్పటికప్పుడు తప్పిస్తూ కర్తవ్యోన్ముఖంగా నడిపిస్తుంది.
అలా నడిపించబట్టే తాత్విక, ఆధ్యాత్మిక భావనలు ఎన్నైనా క్షణికాలై దూది పింజలా తేలిపోవడమో,నీటి బిందువులా ఆవిరైపోపడమో జరుగుతుంది. కాబట్టే ఈ ప్రపంచంలో మానవ మనుగడ సజీవంగా సాగిపోతోంది.
"మహార్ణవ యుగచ్ఛిద్ర కూర్మ గ్రీవా ప్రవేశ న్యాయము " చదవడానికి పెద్దదిగా ఉన్నా అందులో ఇమిడి ఉన్న అంతరార్థం ఇదే.
అది తెలుసుకున్న వ్యక్తిని బంధాలు,బంధనాల జీవితం తాలూకు అనుభవాలు గాలిలా తాకుతూ అలా వెళ్ళి పోతాయి అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.అప్పుడే అన్ని అనుభవాలను స్వీకరించగలం. సునాయాసంగా ఎదుర్కొనగలం.
సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి