అంతరంగాన అలజడులెన్నున్నా
అలల సయ్యాటలతో అలరించేవు
అదుపు తప్పవు ఏనాడు
అనిశ్చితి ఎంతైనా కనపడనివ్వవు
అతిగ అణగతొక్కిన ఆలసించక
అదును చూసి వేసెదవు వేటు
అతివలందరికి నీవు ఆదర్శమే కదా
అవమానభారము మోయు క్రమమున
చెలియలి కట్టని దాటిపోని ఓర్పు
చెలియలకు నేర్పినది నీవే
చెదిరి పోనివ్వక మనసును
చేత పట్టుట నిను చూసే నేర్చేనేమో!
కెరటాల దూకుడెంతైనా
తీరాల దాటు వేగమైనా
పోరాటమాడ నిచ్చి తిరిగి
ఆరాటమాపి కలిపేసుకుంటావు
జ్వాలా ముఖులు పేలుతున్నా
లోపలి రాతి పొరలు కదులుతున్నా
తెలియనివ్వని తెలివి చూపే
అలవాటు నెలతలకు నీదేనేమో!
అగాధం లొ రత్నాలు దొరికే
అదృష్టం కొందరికిగా!
అన్నులమిన్నల అనురాగం
ఆనవాలు అందరికి దొరకదుగా!
రాజీ లేని జీవితాలు
రాగం లేని గీతాలు
రాలిన పూల సౌరభాలు
రాతను మార్చుకునే చేతలు
సంద్రమంటి హృదయాలకు
అందమైన కానుకగా వచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి