మట్టి ఋణం:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఏ చినుకుకు
మన్ను కన్ను తెరుస్తుందో
ఏ చినుకుకు
విత్తనం గర్భవతిగా మారుతుందో
ఏ చినుకుకు 
విత్తనం బాలెంతయి మొక్కను కంటుందో
ఏ చినుకుకు 
గుంతలు, బావులు, చెరువులు,
కాలువలు, ఏరులు, నదులుగా రూపు మారుతాయో
ఆ నీళ్ళ చుక్కలను 
రుచిచూసిన మట్టిబెడ్డలు ఊరికే ఉండవు
బదులుగా 
పాలకంకులను మనకు బహుమతిగా ఇస్తాయి
చెమట చుక్కలుగా మారిన మన రక్తాన్ని
వాసన చూసిన మట్టిబెడ్డలు ఊరికే ఉండవు 
బదులుగా 
ధాన్యాల రాశులను మనకు కానుకగా ఇస్తాయి
మరి
ఈ మట్టి ఋుణం 
మనం ఎలా తీర్చుకుందాం?
**************************************


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
చినుకుకు మట్టికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఏంచెప్పారు... గురూజీ!