రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం ద్వారా కౌమారుల వికాసం

 జాతీయ ఆరోగ్య మిషన్ నిర్దేశాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం (ఆర్.బి.ఎస్.కె) ద్వారా కౌమారుల వికాసం సుసాధ్యం కాగలదని పాతపొన్నుటూరు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్-ఎఫ్ కొత్తకోట అరుణకుమారి అన్నారు. కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూచనలతో మూలజగన్నాధపురంతో పాటు ఈ పాఠశాలలో ఆమె ఈ పథకాన్ని అమలుచేస్తూ మాట్లాడారు. ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విడుదలైన సమాచారసంగ్రహణ పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు చేతులమీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణారావు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం దేశ వికాసానికి సౌభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే మన ఆశయాలను ఆచరణలోకి తీసుకురాగలమని అన్నారు. 
ఈ పుస్తకంలో విద్యార్థుల ఎత్తు, బరువు, గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు ఛాతి కొలతలను, ఫేమిలీ డాక్టర్ ఎవరైనా ఉన్నారా, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులేమిటీ తదితర సమాచారాన్ని తక్షణమే ఈ పుస్తకంలో నమోదు గావిస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా పళ్ళను శుభ్రపరుచుకోవాలనీ, రెండు పూటలా స్నానం చేయాలని విద్యార్థులనుద్దేశించి ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖర్ మాట్లాడుతూ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, గోళ్ళను కత్తిరించుకుంటూ ఉండాలని, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ మాట్లాడుతూ పండ్లు, కూరగాయలు వంటి పౌష్టికాహారం భుజించాలని అన్నారు. ఉపాధ్యాయులు బొమ్మాళి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్లు వేసుకుని రక్తహీనత రాకుండా ఆరోగ్యం పొందాలని, కాచి వడపోసి చల్లార్చిన నీటిని త్రాగాలని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ పదార్ధాలపై మూతలు వేసి ఉంచాలని, వేడి పదార్ధాలను తీసుకోవాలని అన్నారు. పొగత్రాగరాదని, మత్తు పానీయాలు డ్రగ్స్ వంటివి దరి రానీయకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ ఆర్.బి.ఎస్.కె. కార్యక్రమం నెల నెలా సమీక్షించడం జరుగుతుందని ఆరోగ్య కార్యకర్త అరుణకుమారి తెలిపారు.
కామెంట్‌లు