న్యాయములు-692
శంఖ న్యాయము
****
శంఖ అనగా శంఖము,ఒక నిధి అని అర్థము.
"శంఖ న్యాయము" అనగా శంఖము వలె పవిత్రమైన జీవితాన్ని గడపాలని అర్థం.
శంఖం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహాభారతంలో శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును ఉపయోగించడం.ఇలా శ్రీకృష్ణుడే కాకుండా శివుడు,మహా విష్ణువు అర్జునుడు మొదలైన వారు ఉపయోగించిన శంఖాలు వివిధ పేర్లతో పిలువబడటం గుర్తుకు వస్తాయి.
మరి మనం శంఖాల గురించి కొన్ని విషయాలు విశేషాలూ, ప్రత్యేకతలు తెలుసుకుందామా.
శంఖాలు సముద్రంలో నివసించే గాస్ట్రోపోడా తరగతికి చెందిన స్ట్రాంబిడే కుటుంబంలోని స్ట్రాంబస్ ప్రజాతికి చెందిన జీవులు.ఇవి చాలా చిన్న వాటి నుండి చాలా పెద్ద వాటి వరకు వివిధ పరిమాణాల్లో ఉంటాయి.
ఈ శంఖాలలో ఆకారాన్ని బట్టి 3రకాలుగా వర్గీకరించారు.1.దక్షిణావృత శంఖము దీనిని ఎడమ చేతితోనూ2.మధ్యావృత శంఖము - దీనిని మామూలుగా నూ.3. ఉత్తరావృత శంఖము -'దీనిని కుడి చేత్తో పట్టుకుంటారు.
ఈ శంఖం పుట్టుక గురించి విష్ణు పురాణములోనూ, బ్రహ్మ వైవర్త పురాణములోనూ వుంది. అది కూడా చూద్దాం.
పూర్వ కాలంలో శంఖచూడుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణ కవచాన్ని పొందుతాడు. ఇక ఆ గర్వంతో ముల్లోకాలను భయపెట్టిస్తూ స్వర్గం పైకి దండెత్తి వస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడి శరణు కోరుతాడు. శివుడు ఆ పనిని మహావిష్ణువుకు అప్పజెపుతాడు. అప్పుడా విష్ణువు బ్రాహ్మణ వేషంలో శంఖచూడుడి అభిమానాన్ని పొంది కృష్ణ కవచ ఉపదేశం పొందడం, అనంతరం శివుడు శంఖచూడుని సంహరించి దేహాన్ని సముద్రంలో వేయగా శంఖచూడుని సతీమణి తులసి తన పాతివ్రత్య మహిమతో శంఖంగా మార్చిందని చెప్పబడింది.
శంఖం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది వుండే ఆకారం మూలంగా దానిని గాలి వీచే దిశకు ఓ ప్రత్యేక కోణంలో పట్టుకుంటే గాలులు గొట్టంలోకి ప్రవేశించి తిరిగి పరావర్తనం చెందే క్రమంలో గింగిర్లు తిరుగుతాయి.అలా గాలి కదిలే కంపనాలే శతాబ్దాలుగా మనకు వినబడుతుంటాయి.కొన్ని శంఖాలను చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినబడటం విశేషం.
ఈ శంఖాలను లక్ష్మీ శంఖము,గోముఖ శంఖము, కామధేను శంఖము,దేవ శంఖము గరుడ శంఖం,గరుడ శంఖం, రాక్షస శంఖం,సుఘోష శంఖం,శని శంఖం,రాహు శంఖం, కేతు శంఖం,కూర్మ శంఖం అని ఇలా అనేక రకరకాల పేర్లతోపిలుస్తారు
ఇలా ధ్వనించ గల శంఖాలను యుద్ధభేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం ఇవ్వడానికి ఉపయోగిస్తారు.ఇక గ్రామాలలో సంచరించే జంగమ దేవరులు వేకువ జామున ఇల్లిల్లూ తిరుగుతూ శంఖనాదం చేయడం , దానిని మన కుటుంబ పెద్దలు ఎంతో శుభ సూచకంగా భావించడం,అలాగే "శంఖులో పోస్తేనే తీర్థం" అనే నానుడి కూడా అందరికీ తెలిసిందే.
"శంఖే చంద్ర మావాహయామి/ కుక్షే వరుణ మావాహయామి/ మూలే పృధ్వీ మావాహయామి/ధారాయాం సర్వ తీర్థ మావాహయామి అనే శ్లోకం మరియు సముద్ర తనయా విద్మహే/ శంఖరాజాయ ధీమహీ/తన్నో శంఖ ప్రచోదయాత్!.. ఈ శ్లోకాల గురించి మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు."
ఈ విధంగా మన పెద్దవాళ్ళు"శంఖం సకల సంపదలకు ప్రతీక"అని భావిస్తారు .చాలా మంది పూజా మందిరాలలో పెట్టుకుని పూజిస్తుంటారు.
అయితే దీనిని ఆయుర్వేద వైద్యులు ఔషధంగా ఉపయోగిస్తారు. శంఖ భస్మము వలన అనేక రకాల రోగాలు నయమవుతాయని, శంఖంలో పోసిన నీటిని పిల్లలకు తాగిస్తే ఆరోగ్యవంతులు అవుతారని అంటారు.
మనం శంఖం గురించి అనేక విషయాలు విశేషాలూ ప్రత్యేకతలు తెలుసుకున్నాం కదా! మరి ఈ "శంఖ న్యాయము"ను మన పెద్దలు మానవులకు ఎందుకు వర్తింపజేశారో అధ్యయనం చేద్దాము.
హిందువులు శంఖాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో మానవులుగా మనమూ అంతే పవిత్రంగా భావించబడాలి.అలా పవిత్రంగా ఉండాలనీ, శంఖులో పోస్తేనే తీర్థం అన్నట్లు మనం మాట్లాడితే ఆ మాటకు తిరుగులేకుండా వాక్ శుధ్ధి కలిగి వుండాలనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది.అది గ్రహించి ఆ విధంగా ఉండేందుకు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆచరిద్దాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి