కార్తీక సోమవారం విశిష్టత:- సి.హెచ్.ప్రతాప్

 తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం నాడు స్నానం, దానం, జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనవి.కార్తీక మాసం పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు ప్రముఖ ఆలయాలను సందర్స్తితారు.  వేకువజాముననే ప్రధాన ఆలయాల్లోని కోనేర్లల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తమకు తోచిన విధంగా తపం,జపం, దానాది పుణ్య కార్యక్రమాలను ఆచరిస్తారు.కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ప్రవహించే నదిలో స్నానం చేసి ‘‘హర హర శంభో.. హర హర మహదేవ’’ అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు.ఈ రోజున నిష్ఠతో పరమశివునికి బిల్వపత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము.
 
సాయంత్రం పూట శివాలయంలో శివుని పూజించి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి, ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపమును వెలిగించాలి. ఆపై ఉపవాసమును విరమించాలి.  పగలంతా ఉపవాసము ఉంటే నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయవచ్చును.
కార్తీక సోమవారం నాడు శివాలయ సందర్శనం శుభాలను చేకూరుస్తుంది. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేయడం లేదా ఏకభుక్తం ఉండడం ,ఎవరి శక్తి మేరకు వారు దానధర్మాలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.కార్తీక సోమవారం నాడు ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని, శివుడాజ్ఞ లేకుంటే చీమైనా కుట్టదు కాబట్టి పరమశివుడు వారిని అన్ని విధాలుగా కాపాడతాడని, అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు, కార్తీకమాసంలో చివరి సోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి.
స్నానం చేయడం అనేది తమకు తోచినప్పుడు కాకుండా సూర్యోదయానికి పూర్వం ప్రాతఃకాలంలో చేయడం శ్రేష్ఠం. దీనివలన రూపం, బలం, తేజం, శౌచం, ఆయుష్షు, తపస్సు, ఆరోగ్యం, మేధస్సు పెరుగుతాయి. లోభం, దుస్స్వప్నాలు నశిస్తాయి. ఈ పది గుణాలు రావడానికి కారణం సూర్య చంద్రులే. రాత్రంతా చంద్ర నక్షత్రాలు, పగలు సూర్యరశ్మి నీడులో ప్రవేశిస్తాయి. రాత్రి నీడులో రోగ కీటకాలు లోపల దాగి ఉంటాయి. సూర్యోదయాత్పూర్వం అవి పైకి వస్తాయి. కాబ్టి ఉదయమే స్నానం చేయడం మంచిది.
 కనీసం కార్తిక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెపుతుంది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు.సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనః కారకుడు. మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు   తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతఃకాలాన్నే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసాక భోజనం చేయడం మంచిది. 

కామెంట్‌లు