భగవద్గీత -1:-సి.హెచ్.ప్రతాప్

 హే కృష్ణా కరుణా సంధో దీన బంధో జగత్పతే
గోపేశ గోపికాకాంత రాధాకాంత నమొస్తుతే

ఓ ప్రియమైన కృష్ణా, నీవు దీనులకు స్నేహితుడవు, సృష్టికి మూలకారకుడవు,గోపికలకు ఆరాధ్య దైవం నీవు, నీకు నా హృదయపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాను అని పై శ్లోకం భావం.
శ్రీమహావిష్ణువు దశావతారాలలో శ్రీ కృష్ణావతారం ఒక ప్రత్యేకత సంతరించుకొంది. తాను కృష్ణునిగా అవతరిస్తూ దేవతా కోటిని మీరు భూలోకంలో మీకు నచ్చిన రూపంలో జన్మించమన్నాడు ఆ మహావిష్ణువు. ఋషులుగా, గోపికలుగా, గోవులుగా, పక్షులుగా, పశువులుగా, చెట్లుగా, నదులుగా, కొండలుగా వారందరూ భూమి మీద జన్మించారు. అలా జన్మించిన చరాచర జగత్తును తన స్పర్శతో పునీతం చేసి పుణ్యగతులు కల్పించిన అవతారం కృష్ణావతారం. అందుకే కృష్ణావతారానికి అంత ప్రత్యేకత ఏర్పడింది.
శ్రీమన్నారాయణుని అవతార విభూతులన్నింటిలో కృష్ణావతారమే పరిపూర్ణం. అందుకే మనిషి కూడా ఈ పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకోవాలి. హృదయంలో పదిలపరచుకొని జీవితంలో ఆచరణలో పెట్టాలి. శ్రీకృష్ణుడు కర్మయోగి,ధర్మయోగి మరియు జ్ఞానయోగి. ఒక దానిని మిగిలిన రెండింటితో సమన్వయ చేస్తూ, తన అవతార సందేశాన్ని లోకానికి అందించిన జ్ఞానమూర్తి. శ్రీకృష్ణుడి అవతార తత్త్వంలో సమున్నతమైన విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే శ్రీ కృష్ణావతారం సార్వజనీ నకమై, సత్యప్రామాణికమై, పరిపూర్ణావతారంగా నిలిచిపోయింది.కృష్ణావతార ప్రధాన లక్ష్యం ప్రబోధ.సాధు రక్షణ- దుష్ట శిక్షణ (పరిత్రాణాయ సాధూనాం) , భక్త రక్షణ (అనన్యా శ్చిన్తయన్తో మాం), శరణాగత రక్షణ (సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం) అనే మూడు ప్రతిన లను అవతార లక్ష్యంగా చేసుకున్నాడు. తానాచరించిన తర్వాతే మానవాళికి బోధలు చేసిన గొప్ప అవతారమూర్తి.
కామెంట్‌లు