నవ్వుతూ బ్రతకాలిరా - 10:-సి.హెచ్.ప్రతాప్
 1)“భయం మీద ఒక వ్యాక్యం చెప్పురా భాస్కర్ “అడిగింది టీచర్.
“ భయం గురించి విని భయాన్ని చూస్తే భయపడతానని అనుకున్నా కానీ అసలు భయాన్ని భయం భయం గా చూడగానే అసలు భయం వేయలేదు పైగా భయం ఇలాగే వుంటుందా అనిపించింది. భయాన్ని భయం గా చూడకూడదని, అసలు భయపడకూడదని, అంతే కాక భయాన్ని ముందే భయపెట్టాలని అప్పుడే డిసైడ్ అయ్యాను." గుక్క తిప్పుకోకుండా చెప్పాడు కవి కొడుకైన భాస్కర్
2) “సినీ నటిని పెళ్ళి చేసుకోవడం తప్పయి పోయిందిరా “ విచారం గా అన్నాడు రాబర్ట్
“ ఏమయ్యింది, అందం ,చందం, నటన, గుణం, ఆస్తి, అంతస్తు అన్ని వున్నాయని ఏరి కోరి చేసుకున్నావుగా పెళ్ళి ?” అడిగాడు ఫ్రాన్సిస్
“ పెళ్ళి ముందువరకు తన మాజీ భర్త గురించి చెబుతుండేది. పెళ్ళయ్యాక తనకు రాబోయే భర్త గురించి చెప్పడం మొదలు పెట్టింది, నేను పడే బాధ వర్ణనాతీతం” అసలు సంగతి చెప్పి బావురుమన్నాడు రాబర్ట్.
3) “ ఇదేమిటి డాక్టర్ గారూ, ట్రీట్ మెంట్ నాకొక్కడికి ఇస్తే , ముగ్గురికి బిల్లు వేసారు ? ఇది చాలా అన్యాయం, అక్రమం “అంటూ ఆవేశపడ్డాడు చెంగల్రావు.
“ అన్యాయమూ కాదూ, పాడూ కాదు, నీకూ ట్రీట్ మెంట్ ఇస్తున్నప్పుడు నువ్వు పెట్టిన కేకలకు మిగితా ఇద్దరు పేషెంట్లు పారిపోయారు. మరి వారి బిల్లు ఎవరు కడతారు ? మీ బాబా ?”తాపీగా అసలు సంగతి చెప్పాడు డాక్టర్ దైవాధీనం.
4)“ ఏమిటోయ్, ఈ మధ్య మీ ఇంట్లో దొంగలు పడి సర్వం ఊడ్చుకొనిపోయారట కదా ! పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా ? దొంగలు దొరికారా ?” ఆసక్తిగా అడిగాడు రామనాధం.
"ఇంట్లో పడి అంతా ఎత్తుకెళ్ళింది నా కోడలు, అల్లుడె అయితే ఎవరి మీద కంప్లయింట్ ఇవ్వమంటావు ? ఆఖరుకు మా ఆవిడ మెడలో మంగళసూత్రం తో సహా ఇల్లంతా ఖాళీ చేసేసారు సో కాల్డ్ ఇంటి దోంగలు” కళ్ళొత్తుకుంటూ చెప్పాడు విశ్వనాధం.

కామెంట్‌లు