ఊరుగాలి ఈల 17:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మనిషి మనిషితో మాట్లాడే గొప్ప కళాశాల 
ఏకాంత సందడి సంతోషం దుఃఖాల నీడ
దుర్గుణాల పొడలేని మంచి నడతల ఊరు

నమ్మకం పంచప్రాణాలైన రెటీనా దృశ్య చిత్రం
అనుమానాలు శూన్యంలో ఎగిసిపడే అలలు
మూఢనమ్మకాలు నిర్జీవ ప్రేత శిధిల సమాధులు

సంప్రదాయాల సంగమ సంగీతంలో పండుగ
నింగీనేల కలిపే వంతెన కింది తేటనీటి దౌడు
అనురాగాల సరాగ సీమల ఊగే స్నేహ పందిరి

మమతల ప్రాణం మనిషి తీగల సన్నాయి 
ఎవరున్నా లేకపోయినా జీవించే వేదం 
మనిషి లేక మనిషిగ లేక గాలిలేని  లోకం

పండుగలు పబ్బాలు వచ్చీపోయే చుట్టాలు
మనిషి తాత్కాలికమైన శాశ్వతం మట్టి
మొన్న తాత నిన్న నాన్న నేడు నేనుగ సాగే ఊరు

ఇష్టాలూ నమ్మకం బతుకు మూఢత్వం లేక
సంప్రదాయ దురంతాల కోరల బలి కాని జీవం
తరాలు రూపం మారినా మారని మట్టే ఊరు

తొలిచిన ఊసుల్లో ఘనీభవించిన పొర ఊరు
అనుభవాల మోసుకొచ్చే చెట్టు తీపి యాది
ఒక చెకుముకి రాయి సూదంటు రాయి సోయి

==========================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు