భగవద్గీత - 2:-సి.హెచ్.ప్రతాప్

 భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము. విశ్వం యొక్క జ్ఞానమంతా గీతలో నిండి ఉంది. అత్యంత గాఢమైనది, నిఘూఢమైనది అయి వున్నది. భగవదీతను గీతోపనిషత్తుగా కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. సమస్త వేద జ్ఞానసారమైన భగవద్గీత వేద వాజ్మయంలో ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటిగా భావించబడుతొంది. ప్రపంచంలో భగవద్గీతకు ఉన్నన్ని వ్యాఖ్యానములు మరే ఇతర గ్రంధానికి లేవని చెప్పవచ్చును. ఎన్ని సార్లు భగవద్గీత చదివినా ఏదో ఒక కొత్త అంశం మనకు స్పురిస్తూ వుంటుంది. అందుకనే ప్రతీ రోజు ఒక కొత్త వ్యాఖ్యానం భగవద్గీతపై రాయబడుతూ వస్తోంది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు గా వున్నాయి.కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధించడం జరిగింది.మనిషికి మరియు అతని సృష్టికర్తకు మధ్య సత్య-సాక్షాత్కారానికి సంబంధించిన దివ్య-సంయోగం, ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క బోధలను ఎడతెగకుండా గానం చేయాలి…. ప్రపంచంలోని అన్ని గొప్ప గ్రంథాలలో అంతర్లీనంగా ఉన్న ముఖ్యమైన సత్యాలకు, గీతలోని కేవలం 700 సంక్షిప్త శ్లోకాల అనంతమైన జ్ఞానానికి మధ్య సాధారణమైన సయోధ్యను కనుగొనవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు యోగ శాస్త్రానికి సంబంధించిన ఓక లోతైన గ్రంథం, భగవంతునితో ఐక్యత మరియు దైనందిన జీవనానికి ఒక పాఠ్య పుస్తకం. విద్యార్థి అర్జునుడితో కలిసి అంచెలంచెలుగా ఆధ్యాత్మిక సందేహం మరియు బలహీన హృదయం యొక్క మర్త్య చైతన్యం నుండి దివ్య-అనుసంధానం మరియు అంతరంగ-నిశ్చయము వైపు నడిపించబడతాడు.  

కామెంట్‌లు