రాజకీయ జిమ్మిక్కుల మొగ్గేయని పల్లీయం
రణతంత్రపుటెత్తులు మొలకెత్తని ఊరు
శూన్యత లేని కారుణ్య ఎదలవొడి జనారణ్యం
చిక్కులు చింతలు కానరాని వింత సంత
కృషి మెచ్చిన మనిషి పూసే రాయి సోయి
అబద్ధాలు గాంధారి గంతల్లేని స్వచ్ఛమట్టి
ఊసుల రాశుల శ్వాసలు ఊరేగే నింగి పల్లె
కల్లబొల్లి కథల బతుకు సున్నైన ప్రేమ మన్ను
హావభావాల తుంటరికాదు మమతల చేను
మొగులేసిన ఆకాశం కురిసే వాన జాన
ఉరుకలేసే భువి గడ్డకట్టని తరినేల మది
అట జని కాంచే రుషి మనోజ్ఞ రసధుని
ప్రవాహ నది అంచుల కాలం రాసిన కొత్త కవిత
మదిని అలరించిన గరిక గరిమపూల సీమహేమ
పాదరస పదనిసల తొణికే ఎత్తుపల్లాలు పల్లె
ఊరు ఉల్లము ఎలుగెత్తిన సింహనాద ధ్వని
కాంతుల చెమట దోస్తీ సరదాల నాట్య యవ్వని
మూట విప్పని ముడి తేట ఊటల నుడి జవ్వని
ప్రియ స్నేహ చేలాంచల కొంగు రెపరెపల సన్నిధి
హొయల సింగారు దరువు పెంచే బంగరు నగ
కారుకూతల గొంతు గుయ్యనే గూబ తీరు ఊరు
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి