ఊరుగాలి ఈల 27:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఒక మనిషిలో ఒక మనసు మట్టి తారాట 
కస్సుబుసులు బస్సు కరువు నడక పయ్యెల 
ఎటుటచూసినా గుంపు గుండె ఊరై ఉప్పొంగు

పుస్తకం నడిచే బడి తోవ పట్టణాల వంక
ఎక్కడున్నా మనసు పరుగుపరుగు వచ్చే ఊరు
నడకలో పక్కూరెళ్ళి తిరిగొచ్చె పల్లె రయ్యని

గాయాలు గాలాలు ఎరలోని పాఠాలు
కాపాడుకొను ఆట స్వీయ బాట
ఎందరున్నాగాని ధైర్యమొక్కటె శక్తి పీఠం

ఏది మంచో ఏది చెడో అడుగకనే నేర్పే తల్లి ఊరు
బడిలోని గన్నేరు వీధి చిరు మున్నేరు ఊరు పేరు
అందని ఆకాశం అరచేతి చిరు చిందుల విందు

పశువుల ఇల్లంత గోధూళి చేతిలో గోళీల రంగేళి
చెవుల ఆడే గాలి చెట్టంత విసిరే ఊరుశాంతి
కనులపొరలను గుండె అరలను తీసే సౌమ్యరాశి

మేలు మాటల తేనె ఊటలు ఊడల చేతులు
తెరిచిన గుండెల మురిసే మనసుల సిగ్గు ముగ్గు
ఏ కాలమెట్లున్న ఊరుకాలమే చిరకాలం

ఒక నేల ఎద చేలు చెమట అమ్మ సాకిన ఊరు
పరపతి సోపతి గతి తిప్పిన నేర్పు పల్లెసీమ
ఆశపడి బతికిన చింత తొక్కు కథ ఊరు గుండె

==========================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు