ఊరుగాలి ఈల 28:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆలోచన పెంచి ప్రేమ పంచి నగర తోవల పడె
అమ్మ కొమ్మల బతుకు ఊరేగే తీర్థాల గుడి
బత్తీసాలు చిలుకలు ఊరించె తీపి అంగళ్ళ జీర

పానకం పూనకం తీరొక్క తీరు అనంత సంతసి
తావులేని తప్పుకూత తనువులేక శూన్యం
ఊపిరి పిప్పిరిపాట సన్నాయి ఆడే మైదానం

ఆపద సంపద ద్వపద కావ్యమాల అక్షర సీమ
చిక్కులు నొక్కులు కడు దూరమైన సరళరేఖ
రెక్కలల్లార్చిన చెమట దీర్చిన మట్టి పునీత

అంత గొప్ప ఊరు నా గళసీమ నవ్వు మొలక
బారు జారు జడ మీటే జఘన వీణల ప్రీతి
అందమంటే నాదని చూడ కన్నెల కుట్టే కన్నులు

జడలు రెండేసే తల పేను మేను తడిమి అమ్మ
అగరు బొట్టు నాడు దిష్టిబొమ్మని పెట్టే ఆత్మగా
పాలబువ్వ తెచ్చే పసిడి నవ్వు ఊరు బతుకు

కొసిరి కొసరి ఆడే ముసురు వాన చినుకు తేట
వడ్లు దంచే రోలు రోకలి చెలిమి ఊరు ఇసుర్రాయి 
అమ్మ కొంగు నీడలో తిరిగిన ఊరు  చేవ్రాలు

చెట్టు చేరిన సంధ్య కంజు పిచ్చుకల బిలబిలలు
గూడు చేరేటి పసులు పని ముగియ మనసు
ఒక ఉపనిషత్ ఉదయిని కవిత జవ్వనీ వని

==========================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు