ఊరుగాలి ఈల 30:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
తొమ్మిది గజాలు పోక,బీరరంగు తనువు పట్టంచు 
మొల బలమే చింగులు గోచీ సొపుల దోపు చీర
ఎద పైట చెంగు గాలికూగే కొంగు మెరుపు ఊరు

గ్లాస్కో ధోతి తళతళలు కిర్రుచెప్పుల జోరు
సన్ లైట్ లఫ్ బాయ్ సబ్బుల చేతి ఉతుకు 
చెరువు, కాలువ, బావి పరువాల కుతి ఊరు

గుండు రైకల గుత్తపు రవికల మెరిసే చెమ్మగుట్టు
ఖమీజు పైజామా నెక్కరు అంగీల ఊరే ఖుషీలు
మెడగొలుసు లయలో కాలిగొలుసు చిటికె ఊరేగా

పప్పుబియ్యం మక్కపెసర గుడాల చిరు తిండి 
ఉప్పుడుపిండి జొన్నరొట్టె కారం కడుపు నిండ
తోకముడిచే కరువు ఊరుచెమట ధాన్య గరిశె

బాధల గాయాల ఔషధం అమ్మ పలికే ఊరి నడక
ఆశల రెక్కలు ఊహల కిటికీలు గుండె వాకిట్ల
ఆనాటి అందాలు వాసనల్లేని నిస్సార ఈలలు

సొంపుసోయగాల పిలుపుల హరిత ఊరు 
ఎక్కడని అడిగె మది జాబులేక వాలె రెప్ప
కొత్త రూపదాల్చిన సుందరి మెరిసె ఊరుజగమై

మనిషి కలయిక అరుదు మాటలాడని కాలరేఖ 
ఆత్మీయ ఆలింగనాల చూపులేక ఊరు మూగ
ఆశలు ఈడేరి మనసు కలిసే తీరేది ఊరు బాట!

=============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు