ఊరుగాలి ఈల 38:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
బతుకుపాఠం నేర్వ బయలుదేరే బాటల
బతుకుదారిల అనుభవాలే పాఠమై నిలిచే
అంతరంగం తోట వాసన పూల గాలి వానసోలి

కొట్లాడు బతుకు ఆపదల దరి నీరులేని బావి
పొద్దుపొడిచీ గుంకే ఆగమాయే బతుకువొంక డొంక
మాట మాటకు వేరు అర్థము బతుకు తీరే వ్యర్థం

చీమల పుట్టల జొర్రే పాము చలి చీమలకే బలి
ఆకలితో కడుపు నకనకలు గంజి నూకలు గుంజు 
మనిషిపై మనసు దాడి మనిషితో మనసే జోడి

పర్ణశాల ఇల్లు పచ్చని పల్లె మల్లిమాటల ఊరు
గాలిఅల్లరి గుసగుస చెట్టుకొమ్మల ఊగె చెంగు 
మూటముల్లె నడక ముత్తైదువ నెత్తి విప్ప లోకత్తి

గుండె గంటలు మోగే గుడిసె వాకిట్ల ఎద విందు
ఊపిరి పురివిప్ప బతుకు ప్రాణాలు మట్టి శ్వాస 
ఊరంటే ఊరే నా జన్మభూమి పల్లెధార జీవితం

గెలుపు ఓటమిలేని ఆటే ఆత్మ మనిషి మైదానం
చిక్కని చీకటి ముక్కంటి భ్రుకుటి కనని జన వనం
ఓనమాలే లేని వర్ణమాల ఇనుము లేని నది కల

పప్పులు అప్పలు ఆడిపాడు పిల్లలసిరి పల్లెగల్లీ 
పెద్దల నీడలో ఎదిగిన బాలలు పల్లెసీమ సంతకం
ఊగ ఉయ్యాల ఎగుర జంపాల ఊరు అమ్మ
================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు