కుందేలు దెబ్బ: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక కుందేలు, ఎలుగుబంటి పక్కపక్క ఇండ్లల్లో ఉండేవి. కుందేలు ఇంటి ముందు ఒక పెద్దతోట వుండేది. అది రకరకాల కాయలు, పండ్లు, దుంపలతో నిండి వుండేది. కుందేలు సమయానికి నీటిని తెచ్చిపోస్తా, అవసరమైనప్పుడల్లా ఎరువులు వేస్తా, పురుగుమందులు చల్లుతా ఆ మొక్కలని సొంత పిల్లలెక్క చూసుకునేది. దాంతో ఎప్పుడు చూసినా ఆ తోటలో ఏదో ఒక చెట్టుకు పండ్లు, కాయలు నిండుగా కనిపిస్తా వుండేవి. ఆ కుందేలు ఎంత మంచిదో అంత అమాయకురాలు. ఆ కుందేలు ఇంటి పక్కనే ఒక ఎలుగుబంటి వుంది కదా. అది పెద్ద టక్కరిది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని మోసం చేస్తా వుండేది.
ఒకరోజు కుందేలు, ఎలుగుబంట్ల పెండ్లాలు పనుండి పక్కూరికి పోయినాయి. దాంతో వంట చేసుకోవలసిన పని వాటికే పడింది. కుందేలు ఇంటి ముందే తోట వుందిగదా... దాంతో అది ఆకలేసినప్పుడల్లా నాలుగు కాయలు తెంపుకునో, నాలుగు దుంపలు తవ్వుకునో తిని కడుపు నింపుకొనేది. దాని చిన్న పొట్టకు అవి సరిపోయేవి.
ఎలుగుబంటి కడుపు పెద్దదిగదా. దాంతో అది కడుపు నిండా తిండి సంపాదించుకోడానికి నానా తిప్పలు పడేది. అదీగాక అది చానా సోమరిది. ఎప్పుడూ పెండ్లాం తెచ్చి పెడతా వుంటే హాయిగా కాలు మీద కాలేసుకొని తినడానికి అలవాటు పడ్డది. ఇప్పుడు పని చేయాలంటే దానికి చాతగావడంలేదు. దాంతో అది ఒక ఉపాయాన్ని పన్నింది.
కుందేలు దగ్గరికి పోయి కుందేలు ఇల్లుడూ.. కుందేలు అల్లుడూ... మనం ఈరోజు విందు చేసుకొందామా, ఈ రోజు నేను నీకు మంచి మంచివి కడుపు నిండా కమ్మగా పెడతాను. రేపు నీవు నాకు పెట్టాల. సరేనా" అనింది. కుందేలు అమాయకురాలుగదా దాంతో 'సరే' అనింది..
ఎలుగుబంటి వెంటనే అడవికి పోయి తాను తెచ్చుకునే వాటితోపాటు ఒక నాలుగు పండ్లు ఎక్కువ తెంపుకోనొచ్చి కుందేలును ఎందుకు పిలిచింది. కుందేలు కడుపు చిన్నది కావడంతో తొందరగా నిండిపోయింది.
తరువాత రోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు గూడా నాలుగు పండ్లు తెంపుకోనొచ్చి ఎలుగుబంటిని విందుకు పిలిచింది. ఆ పండ్లు దానికి ఒక్క పంటి కిందికి గూడా చాలలేదు. “ఇంకా... ఇంకా... ఆకలి... ఆకలి... అని అరిచింది. కుందేలు తన కోసం తెచ్చుకున్నవి గూడా దానికి పెట్టింది. ఎలుగుబంటి వాటిని ఒక్క క్షణంలో గుటుక్కుమనిపించి "ఇంకా... ఇంకా... ఆకలి... ఆకలి అనింది. కుందేలు పోయి తోటలోని చెట్లకున్న పండ్లు, కాయలూ, అన్నీ తెంపుకోనొచ్చి దాని ముందు గుట్టగా పోసింది. ఎలుగుబంటి వాటన్నింటినీ కసకసకస నిమిషాల్లో తినేసి "ఇంకా... ఇంకా... ఆకలి... ఆకలి" అనింది. కుందేలుకు ఏం చెయ్యాల్నో తోచలేదు.
“నిన్ను ఇంటికి పిలిచి కడుపు నిండా పెడితే నువ్వు నన్ను సగం ఆకలితో సంపుతావా. కొంచమన్నా సిగ్గుందా నీకు. చేతగానిదానివి చేతగానిదాని మాదిరి మట్టసంగా వుండాలగానీ ఎందుకు ఒప్పుకున్నావు. పో, పోయి దుంపలన్నీ తవ్వుకోని రాపో, లేకుంటే నిన్ను కిందామీదా యేసి మెత్తగా తంతా చూడు" అంటూ ఎలుగుబంటి భయపడిచ్చింది. పాపం కుందేలు దానిని ఏమీ చెయ్యలేక గమ్మున తోటలోని దుంపలన్నీ తవ్వుకోనొచ్చి దాని ముందు గుట్టగా పోసింది. ఎలుగుబంటి అవన్నీ హాయిగా మెక్కి నవ్వుకుంటా వెళ్ళిపోయింది.
కుందేలుకు ఎలుగుబంటే ఉపాయం అప్పటికి గానీ అర్థం కాలేదు. పిచ్చికోపం వచ్చింది. ఎట్లాగయినా సరే దానికి బుద్ధి చెప్పాలనుకోనింది. దాని ఇంటి ముందు ఒక పెద్ద గొట్టం వుంది. దాని మీద కూచొని ఆలోచిస్తా వుంటే దానికి ఒక ఉపాయం తోచింది. ఎలుగుబంటి దగ్గరికి పోయి "ఎలుగుబంటి మామా... ఎలుగుబంటి మామా... పొద్దు పోవడం లేదు. ఒకాట ఆడుకుందామా” అనింది. ఎలుగుబంటి తినీతినీ లావయిన తన పొట్టను హాయిగా నిమురుకుంటా “చెప్పు అల్లుడూ ఏమాట" అనింది.
“మనం ముట్టేసుకునే ఆట ఆడదాం మామా నేను నిన్ను ముట్టుకుంటే నువ్వు నాకొక పండు ఇవ్వాలి. నువ్వు నన్ను ముట్టుకుంటే నేను వంద పండ్లిస్తా" అనింది. వందపండ్లు అనే సరికి ఎలుగుబంటి కి బాగా ఆశ పుట్టింది. వెంటనే సరే అనింది. ముందు కుందేలు ఎలుగుబంటి వెంట పడింది. ఎలుగుబంటి అటూ యిటూ వురికిందిగానీ ఆయాసమొచ్చి కుందేలుకు దొరికిపోయింది. దాంతో ఒక మామిడి పండు తెచ్చి కుందేలుకు ఇచ్చింది.
ఈసారి ఎలుగుబంటి వంతు వచ్చింది. కుందేలు అటూ ఇటూ వురకసాగింది. దొరికినట్లే దొరుకుతా.. అంతలోనే వురుకుతా వూరించసాగింది. వందపండ్ల మీద ఆశతో ఎలుగుబంటి వెంటపడతానే వుంది. కుందేలు పురుకుతా పురుకుతా వేగంగా వచ్చి సర్రున ఇంటి ముందున్న పెద్ద గొట్టంలోనికి దూరింది. దాని వెనకాల్నే అంతే వేగంతో దూసుకొస్తావున్న ఎలుగుబంటి కూడా సర్రున ఆ గొట్టంలోనికి దూరింది. అంతే ఆ గొట్టం కుందేలు కంటే లావుగానూ, ఎలుగుబంటి కన్నా సన్నగానూ వుంది. దాంతో అది సగం దూరం పోయేసరికి ఇరుక్కోని పోయింది. అట్లా ముందుకు పోలేక ఇట్లా వెనకకూ రాలేక నడుం వరకూ గొట్టంలో ఇరుక్కోనిపోయి లబోదిబోమని అరవసాగింది.
అల్లుడూ... అల్లుడూ... కొంచెం లాగు అల్లుడూ... వూపిరాడక సస్తా వున్నా అంటూ బతిమలాడింది. కుందేలు నవ్వుకుంటా దాని చిన్ని తోక రెండు చేతులతో గట్టిగా పట్టుకోని బలమంతా ఉపయోగించి లాగింది. ఎలుగుబంటయితే బయటికి రాలేదు గానీ దాని తోక మాత్రం కొద్దిగా వున్నది కాస్తా పూడి చేతికొచ్చింది. ఎలుగుబంటి ఆ మంటకు తట్టుకోలేక లబలబలాడసాగింది. అప్పుడా కుందేలు "మామా... నిన్ను లాగడం ఇంక నావల్ల కాదు గానీ తిన్నదంతా అరిగిపోయి పొట్ట తగ్గేంతవరకూ నువ్వు బైటకు రాలేవు. నాలుగు రోజులు అట్లాగే అన్నం నీళ్ళు లేకుండా వుండు. అప్పుడు నీ అంతట నీవే బైటపడతావు" అనింది.
ఎలుగుబంటి ఏమీ చేయలేక రోజులు లెక్కబెట్టుకుంటా అట్లాగే వుండిపోయింది.
***********
కామెంట్‌లు